NMMS MODEL GRAND TEST - 7NMMS MODEL GRAND TEST - 7HOW TO ATTEMPT AP NMMS…
*📚✍️సర్దుబాటు*
*ఉపాధ్యాయుల జాబితా సిద్ధం✍️📚*
*🌻పెడన గ్రామీణం*: బందరు డివిజన్లోని 12 మండలాల్లో ఉపాధ్యాయులు సర్దుబాటు జాబితా సిద్ధమైంది. 127 పాఠశాల సహాయకులు, పీఈటీ, ప్రధానోపాధ్యాయుల పోస్టులు ఖాళీలను అధికారులు గుర్తిం చారు. పలు పాఠశాలల్లో ఎక్కువగా ఉన్న ఉపాధ్యాయుల్ని సర్దుబాటు చేశారు. ఈ జాబితాను ఉప విద్యాశాఖాధికారి యూవీ సుబ్బారావు గురువారం డీఈవో తాహేరా సుల్తానాకు పంపనున్నారు. అనంతరం దానిపై ఆమె కలెక్టర్ రంజిత్ బాషా అనుమతి తీసుకోనున్నారు. అనం తరం ఆ జాబితా ప్రకారం ఆర్డర్లు జారీ చేస్తారని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నారు. సర్దుబాటు జరిగిన ఉపాధ్యాయులు ఈ విద్యా ఏడాది చివరి వరకు కేటాయించిన పాఠశాలలో పని చేయాల్సి ఉంటుంది.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
*📚✍️25ఏళ్లు సర్వీసు నిండిన*
*ఉద్యోగుల వివరాలివ్వండి✍️📚*
*♦️డీడీవోలకు ఖజానా శాఖ డీడీ సూచన*
*🌻చిత్తూరు కలెక్టరేట్, డిసెంబరు 7:* ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో 25ఏళ్ల సర్వీసు పూర్తయినవారి వివరాలతో కూడిన సంఖ్యను తెలుపుతూ జీతాల బిల్లులతో విధిగా పంపాలని ఖజానా డిప్యూటీ డైరెక్టర్ ఎం.రామచంద్ర సూచించారు. బుధవారం ఈ మేరకు అన్ని శాఖల డీడీవోలకు ఆదేశాలు పంపారు. ఉద్యోగుల సర్వీసు రిజిస్టర్లు చాలాచోట్ల అప్డేషన్ చేయకపోవడం వల్ల పెన్షనర్లకు సకాలంలో బెనిఫిట్స్ అందించలేకపోతున్నట్లు పేర్కొన్నారు. పెన్షన్ ప్రతిపాదనల ఫారాలు ఆయా శాఖల అధిపతులనుంచి నిర్ణీత సమయంలో ఖజానా శాఖకు అందడం లేదని పేర్కొన్నారు. అందుకే డీడీవోలు తమ శాఖ పరిధిలో 25 ఏళ్లు సర్వీసు నిండిన ఉద్యోగుల వివరాల సంఖ్యను ఖజానాశాఖకు అందజేయాలని పేర్కొన్నారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
*📚✍️పెళ్లిళ్లు వాయిదా*
*వేసుకోవాల్సి వస్తోంది📚✍️*
*♦️పెండింగ్ బకాయిలు చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు*
*♦️కలెక్టరేట్ల ఎదుట ధర్నాల్లో ఉపాధ్యాయులు*
*🌻ఈనాడు, అమరావతి*: వేతన సవరణ(పీఆర్సీ), డీఏ బకాయిలు, పీఎఫ్, ఏపీజీఎల్‌ఐ రుణాలు, ఆర్జిత సెలవుల నగదు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రోపాధ్యాయ సంఘం(ఎస్టీయూ) ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్‌ల ఎదుట ఉపాధ్యాయులు ధర్నాలు నిర్వహించారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాలను సమర్పించారు. రుణాలు, అడ్వాన్సులు సకాలంలో ఇవ్వకపోవడంతో పిల్లల పెళ్లిళ్లు, గృహ నిర్మాణాలను వాయిదా వేసుకోవాల్సి వస్తోందని, పిల్లల చదువులకు ఫీజులు చెల్లించేందుకు ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల జీతాలు, జీవితాలతో చెలగాటం ఆడితే తిరుగుబాటు చేస్తామని హెచ్చరించారు. గుంటూరు కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాలో ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి పాల్గొనగా.. అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళనలో ఎస్టీయూ అధ్యక్షుడు సాయి శ్రీనివాస్, మచిలీపట్నం ధర్నాలో ప్రధాన కార్యదర్శి తిమ్మన్న పాల్గొన్నారు. మచిలీపట్నంలో ఉపాధ్యాయులు మోకాళ్లపై నిలబడి భిక్షాటన చేశారు. బకాయిలు, జీతాలు ఇవ్వకపోవడంతో ఉద్యోగుల పరిస్థితి దారుణంగా తయారైందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి మాట్లాడుతూ.. ‘ప్రభుత్వం హామీ ఇచ్చిన ఏడు డీఏ బకాయిలు, పీఆర్సీ బకాయిలు ఇవ్వకపోవడంతో ప్రతి ఉపాధ్యాయుడూ రూ.2 లక్షల వరకు నష్టపోతున్నారు. ఒకటో తేదీన జీతాలు వచ్చే పరిస్థితి లేదు. సీపీఎస్ రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చినా అమలు చేయడం లేదు. ఉపాధ్యాయులకు బదిలీలు, పదోన్నతులు కల్పిస్తామని చెప్పి ఇప్పుడు సర్దుబాటు చేస్తున్నారు. ఉపాధ్యాయులకు బోధనేతర పనుల నుంచి మినహాయింపు ఇస్తామంటూ విద్యాహక్కు చట్టానికి సవరణలు చేసిన అధికారులు యాప్‌ల ద్వారా మరిన్ని పనులు చేయిస్తున్నారు. ఉపాధ్యాయులను ప్రభుత్వం తీవ్ర ఒత్తిడికి గురి చేస్తోంది’ అని మండిపడ్డారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
*📚✍️కాలేజీల అనుమతులకు దరఖాస్తు గడువు పెంపు✍️📚*
*🌻సాక్షి, అమరావతి*: రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ కోర్సులు నిర్వహిస్తున్న విద్యాసంస్థలు 2023-24 విద్యా సంవత్సరానికి ప్రొవిజనల్ అఫిలియేషన్ పొడిగింపు, పునరుద్ధరణ, అదనపు సెక్షన్ల మంజూరు కోసం దరఖాస్తు చేసుకునేందుకు గడువు పొడిగించినట్లు ఏపీ ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి ఎంవీ శేషగిరిబాబు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్లైన్లో అప్లికేషన్ల సమర్పణకు ఈ నెల 8 నుంచి 23వ తేదీ వరకు గడువు పొడిగించామని పేర్కొన్నారు. రూ.10వేల అపరాధ రుసుముతో ఈ నెల 24 నుంచి 30వ తేదీ వరకు దరఖాస్తు సమర్పించవచ్చని తెలిపారు. ఆరోవోల ఇన్స్పెక్షన్లు డిసెంబర్ 15 నుంచి జనవరి 3వ తేదీ వరకు కొనసాగుతాయని వివరించారు.
*🌻కృష్ణలంక(విజయవాడతూర్పు):* మంచి మార్కులు సాధించాలంటే మంచి అలవాట్లను జీవన విధానంగా మార్చుకోవాలని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రకాష్ సూచించారు. విజయవాడ కృష్ణలంక లోని శ్రీ పొట్టి శ్రీరాములు నగర పాలక సంస్థ పాఠశాలను బుధవారం ఆయన సందర్శిం చారు.10, 6వ తరగతి విద్యార్థులకు ఇటీవల జరిగిన ఎఫ్ఎ-2 పరీక్షల జవాబు పత్రాలను, మార్కులను పరిశీలించారు. జగనన్న విద్యా కానుకలోని ఐటమ్స్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ ప్రకాష్ మాట్లాడుతూ ఏదైనా మంచి పనులను 21 రోజుల పాటు చేస్తే అలవాటు అవుతుందన్నారు. అదే 90 రోజులు పాటు చేస్తే జీవన విధానంగా మారుతుందని 21/90 విధానం గురించి తన అనుభవాలను విద్యార్థులకు వివరించారు. ఎఫ్ఎ-2 పరీక్షలలో ఫస్ట్ వచ్చిన విద్యార్థులతో ఫొటోలు దిగి స్టేటస్, ప్రొఫైల్ పిక్చర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లలో పెట్టాలని ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యా యులకు, అధికారులకు సూచించారు. విద్యార్థులందరూ యూనిఫామ్స్ తో పాటు షూస్ కూడా వేసుకురావడంపై సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం పాఠశాలలో జరుగుతున్న నాడు- నేడు పనులను పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్ర మంలో ఎన్టీఆర్ జిల్లా డీఈఓ రేణుక, పాఠశాలల ఉప తనిఖీ అధికారి రవికుమార్, హెచ్ఎం రమేష్ తదితరులు పాల్గొన్నారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
*📚✍️ఎయిడెడ్ ఉపాధ్యాయులకుహెల్త్ కార్డులివ్వాలి✍️📚*
*♦️టీచర్స్ గిల్డ్*
*🌻ప్రజాశక్తి-అమరావతి బ్యూరో*
రాష్ట్రంలో పనిచేస్తున్న 3,400 మంది ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బందికి హెల్త్ కార్డులు మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ గిల్డ్ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బీ చిట్టిబాబు, ఎల్కే చిన్నప్ప బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా అన్ని శాఖలకు మెడికల్ రీయింబర్స్మెంట్ నుంచి ఆరోగ్య కార్డులు సౌకర్యం ప్రభుత్వం కల్పించిందని పేర్కొన్నారు. ఎయిడెడ్ సిబ్బందికి కనీసం మెడికల్ రీయింబర్స్మెంట్ కూడా లేదని పేర్కొన్నారు. కరోనా సమయంలో 169 మంది ఎయిడెడ్ ఉపాధ్యాయులు మరణించారని తెలిపారు. హెల్త్ కార్డు లేకపోవడంతో కొన్ని కుటుంబాలు రూ.22 లక్షల వరకూ ఖర్చు చేశాయని వివరించారు. మరణించిన కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల కింద కలెక్టర్ పూల్లో ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని వెల్లడించారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
*📚✍️ఫేషియల్ హాజరు కోసం*
*తనిఖీలు✍️📚*
*♦️రంగంలోకి నేరుగా సిఎస్*
*🌻ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి*
సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల్లో ఉద్యోగులు, అధికారుల ఫేషియల్ హాజరు అమలుపై ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. అందరూ తప్పనిసరిగా ఈ విధానంలో హాజరు నమోదు చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించినప్పటికీ చాలామంది అధికారులు దీనిని పాటించడం లేదని ప్రభుత్వం గుర్తించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శే స్వయంగా రంగంలోకి దిగనునాన్నారు. ఇక నుండి ఆయన అకస్మిక తనిఖీలు చేయాలని నిర్ణయంచారు. ఒకటి, రెండు రోజుల్లోనే ఈ నిర్ణయం అమలులోకి రానుంది. ప్రతి శాఖలోనూ ఓపీ విభాగానికి సంబంధించిన మధ్య స్థాయి అధికారులు (ఎంఎల్ఏ) తప్పనిసరిగా మధ్యాహ్నం రెండు గంటల కల్లా హాజరుపై నివేదికలు ఇవ్వాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది. ఆ సమయంలోనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తనిఖీలు చేయనున్నారని సమాచారం.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
*📚✍️ఇంటర్ కళాశాలల*
*గుర్తింపు కోసం దరఖాస్తు✍️📚*
*🌻ప్రజాశక్తి-అమరావతి బ్యూరో*
రాష్ట్రంలో 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి జూనియర్ కళాశాలల అనుమతి, |అదనపు తరగతి గదుల నిర్మాణానికి దరఖాస్తులు చేసుకోవాలని బోర్డు కార్యదర్శి ఎంవి శేషగిరి బాబు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. బోర్డు వెబ్సైట్ ఎఱవ.జూ.స్త్రశీఙ.ఱఅలో దరఖాస్తులను ఈ నెల 8వ తేదీ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని, 23వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. రూ.10 వేల అపరాధ రుసుంతో 24 నుంచి 30వ తేదీ వరకు అవకాశం ఉందని పేర్కొన్నారు. వచ్చిన దరఖాస్తులను ఆర్ ఐఓలు ఈ నెల 15 నుంచి జనవరి 3వ తేదీ వరకు పరిశీలిస్తారని వివరించారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
*📚✍️3 విభాగాలుగా గ్రూప్-1*
*మెయిన్స్ పేపర్ 1 సిలబస్✍️📚*
*🌻సాక్షి, అమరావతి*: గ్రూప్-1 క్యాడర్ పోస్టుల భర్తీకి మెయిన్స్ పరీక్షల్లో పేపర్-1 (జనరల్ ఎస్సే) సిలబస్ ను 3 విభాగాలుగా చేసినట్లు ఏపీపీఎస్సీ బుధవారం తెలిపింది. మొదటి సెక్షన్లో కరెంట్ ఎఫైర్స్, రెండో సెక్షన్లో సోషియో పొలిటికల్, ఎకనమిక్స్, ఎన్విరాన్ మెంటల్ అంశాలుంటాయి. మూడో సెక్షన్లో కల్చరల్ హిస్టారికల్, సివిక్ అవేర్నెస్, రిఫ్లెక్టివ్ అంశాలు ఉంటాయని పేర్కొంది. అభ్యర్థులు మూడు విభాగాల నుంచి 800 పదాలు ఉండేలా 3 వ్యాసరూప సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ఒక్కో దానికి 50 మార్కులు ఉంటాయి. పరీక్ష 3 గంటలు ఉంటుంది.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
*📚✍️ఉపాధ్యాయుల కోసం*
*రోడ్డెక్కిన విద్యార్థులు✍️📚*
*♦️8 కి.మీ. నడిచి వెళ్లి ఆందోళన*
*♦️హెచ్చరించి పంపిన పోలీసులు*
*🌻గురజాల, న్యూస్‌టుడే*: ఉపాధ్యాయులను నియమించాలని, హెచ్‌ఎంపై సస్పెన్షన్ వేటు ఎత్తివేయాలని కోరుతూ పల్నాడు జిల్లా గురజాల మండలం మాడుగుల జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు రోడ్డెక్కారు. టీచర్లను నియమించాలని గత నెల 27న నిరసన చేశారు. ఆ ఆందోళనకు హెచ్‌ఎం కారణమని, ‘నాడు-నేడు’ పనుల్లోనూ అలసత్వం వహించారనే కారణాలు చూపి ఆయన్ను సస్పెండ్ చేశారు. దీంతో బుధవారం ఉదయం 100 మంది విద్యార్థులు ప్లకార్డులు పట్టుకుని పాఠశాల నుంచి నడుచుకుంటూ 8 కి.మీ. దూరంలోని గురజాలకు వెళ్లారు. అక్కడ తహసీల్దారు కార్యాలయం ఎదుట హెచ్‌ఎంపై సస్పెన్షన్ ఎత్తివేయాలని నినాదాలు చేశారు. సీఐ ప్రభాకర్ వచ్చి విద్యార్థులను తహసీల్దారు కార్యాలయం లోపలికి తీసుకెళ్లారు. ‘ఇంట్లో చెప్పి వచ్చారా. కేసుల్లో ఇరుక్కుంటే మీ భవిష్యత్తు ఏమవుతుంది. మీ వెనుక ఎవరు ఉండి చేయిస్తున్నారో.. మాకు తెలుసు’ అని హెచ్చరించారు. అనంతరం ప్రైవేటు బస్సులో విద్యార్థులను మాడుగులకు పంపారు. ఈ సమయంలో తహసీల్దారు కార్యాలయం ఎదుట వైకాపా, తెదేపా నాయకుల మధ్య వాదన చోటుచేసుకుంది. ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయనున్నారని వైకాపా నాయకులు.. పరీక్షలు దగ్గరకొస్తుంటే ఇంకెప్పుడని తెదేపా నాయకులు వాదనకు దిగారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
*📚✍️ఉపాధ్యాయుల*
*సమస్యల పరిష్కారానికి*
*ఎస్టీయూ రాష్ట్రవ్యాప్త ధర్నాలు✍️📚*
*🌻అమరావతి, ఆంధ్రప్రభ*:ఎన్నో రోజులుగా పెండింగ్లో ఉన్న సమస్యల పరి ష్కారానికి ఎస్టీయు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల ముందు బుధవారం ధర్నాలు నిర్వహించారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పీఆర్సీ, డీఏ బకాయిలు వెంటనే చెల్లించాలని ధర్నాలో పాల్గొన్న నేతలు డిమాండ్ చేశారు. ప్రతి ఉపాధ్యాయునికి సుమారు 2 లక్షల రూపాయలు బకాయిలు చెల్లించవలసి ఉందని, వీటికి తోడు పిఎఫ్ లోన్లు, ఎపిజిఎల లోన్లు, పిఎఫ్, ఎపిజిఎస్ఇ తుది చెల్లింపులు, సరెండర్ లీవ్ ఎన్క్యజ్మెంట్ చేయక ఉపాధ్యాయులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారనీ, గత్యంతరం లేని పరిస్థితులలో ఎస్టీయూ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేపట్టిందని వారు తెలిపారు. ఆర్థికేతర అంశా లు కూడా పరిష్కారానికి నోచుకోవడం లేదని, 2003 డిఎస్సీ ఉపాధ్యా యులకు, 2002 డిఎస్సి హిందీ పండితులకు పాత పిఆర్సి వర్తింపజేయుటలో జాప్యం జరుగుతుందని, సిపిఎస్ రద్దు చేసి ఓపిఎస్ ఇస్తామనే హామీ నెరవేర్చలేదని అన్నా రు. పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎంఎల్సీ కత్తి నరసింహారెడ్డి గుంటూరు కలెక్టరేట్ వద్ద, ఎస్టియు రాష్ట్ర అధ్యక్షులు ఎల్. సాయి శ్రీనివాస్ డా. బిఆర్. అంబే ద్కర్ కోనసీమ కలెక్టర్ కార్యాలయం వద్ద, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హెచ్.తిమ్మన్న కృష్ణా జిల్లా మచిలీపట్నం కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాలలో పాల్గొన్నారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
*📚✍️ఉపాధ్యాయ*
*నియోజకవర్గాల్లో బోగస్ ఓట్లు✍️📚*
*♦️రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి ఫిర్యాదు*
*🌻ఈనాడు, అమరావతి*: పశ్చిమ, తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో భారీగా బోగస్ ఓట్లు నమోదయ్యాయని, వాటిని తొలగించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాకు ఎమ్మెల్సీలు విఠపు బాలసుబ్రహ్మణ్యం, కత్తి నరసింహారెడ్డి, లక్ష్మణరావు, సాబ్జీ వినతిపత్రం సమర్పించారు. తూర్పు రాయలసీమలో 856 బోగస్ ఓట్ల గురించి ఆధారాలు అందజేశారు. నెల్లూరు జిల్లా విద్యాధికారిని, నిజాయతీగా పని చేసిన అనంతపురం డీఈఓ శామ్యుల్‌ను అన్యాయంగా బదిలీ చేశారని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. కడప జిల్లాలో ఎన్నడూ లేని విధంగా తొలిదశలో 3,570, కర్నూలులో 1,600 ప్రైవేటు ఓట్లు నమోదయ్యాయని, ఖాళీ దరఖాస్తులపై జిల్లా విద్యాధికారి సంతకాలు పెట్టారని ఎమ్మెల్సీలు వెల్లడించారు. కడపలోని సాయిబాబా ప్రైవేటు పాఠశాలలో 13 మంది టీచర్లు పని చేస్తున్నట్లు పాఠశాల విద్య యూడైస్‌లో నమోదు చేశారని, కానీ, ఆ పాఠశాల పేరుతో 78 మందిని ఓటర్లుగా నమోదు చేశారని ఆరోపించారు. యూడైస్‌వారీగా విచారించి, బోగస్ ఓట్లు తొలగించాలని విన్నవించారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పని చేస్తున్నట్లుగా పేర్కొంటూ అనర్హులను సైతం ఓటర్లుగా నమోదు చేశారని, ఆధారాలు అందజేశారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
*📚✍️బీఈడీ ప్రవేశాలపై*
*సందిగ్ధం✍️📚*
*♦️పునఃపరిశీలన విషయంలో తీవ్ర జాప్యం*
*♦️కృష్ణా వర్సిటీ, విద్యా సంస్థల మధ్య కుదరని సయోధ్య*
*🌻ఈనాడు, అమరావతి*
‘కృష్ణా విశ్వవిద్యాలయం పరిధిలోని బీఈడీ కళాశాలల్లో ఈ ఏడాది ప్రవేశాలకు సంబంధించి ప్రతిష్ఠంభన నెలకొంది. అన్ని బీఈడీ కళాశాలల్లోని వసతులు, విద్యార్థులు, సిబ్బంది పరిస్థితిని స్వయంగా పునఃపరిశీలించిన తర్వాతే ప్రవేశాలకు వెళ్లాలనే ధోరణిలో విశ్వవిద్యాలయం ఉంది. కానీ.. ఈ ప్రక్రియ వేగవంతంగా జరగడం లేదు. ఉన్నత విద్యామండలి తీరు కూడా ఇలాగే ఉండడంతో డిసెంబర్ 07 నుంచి ఆరంభమవ్వాల్సిన తరగతులు.. జనవరిలోనైనా అవుతాయో లేదో అనే అనుమానం ప్రస్తుతం నెలకొంది. దీనికితోడు బీఈడీ కళాశాలల యాజమాన్యాలు, కృష్ణా వర్సిటీ మధ్య పలు విషయాల్లో సయోధ్య కుదరడం లేదు. ప్రధానంగా కళాశాలల్లోని విద్యార్థుల సంఖ్య, స్టాఫ్ అప్రూవల్, డిసెంబర్ నుంచి అమలు చేయాల్సిన ఫేస్ రికగ్నేషన్ ఈ మూడు విషయాలపై సందిగ్ధం నెలకొంది. తాజాగా విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలల యాజమాన్యాలన్నీ దీనిపై సమావేశమయ్యారు. ఉన్నత విద్యామండలి, కృష్ణా వర్శిటీ, కళాశాలల యాజమాన్యాల తీరుతో.. విద్యాసంవత్సరాన్ని కోల్పోయే ప్రమాదం కనిపిస్తోందని విద్యార్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.’
కృష్ణా వర్సిటీ పరిధిలోని అన్ని బీఈడీ కళాశాలల్లో మూడు నెలల కిందటే ఇన్‌స్పెక్షన్ జరిగింది. కానీ.. ఇన్‌స్పెక్షన్ బృందాలు సక్రమంగా పరిశీలించకుండానే పచ్చజెండా ఊపేశారు. ఒక్కో కళాశాల నుంచి రూ.25 వేల వరకూ తీసుకుని.. వ్యవహారం కానిచ్చేశారనే ఆరోపణలున్నాయి. విశ్వవిద్యాలయం నుంచి అన్ని కళాశాలలకు ఇప్పటికే మరోసారి పరిశీలనకు వస్తామనే సమాచారం కూడా ఇచ్చారు. కానీ.. అనుకున్నంత వేగంగా కళాశాలల్లో పరిశీలన జరగడం లేదు. కేవలం కొన్ని కళాశాలలకే బృందాలు వచ్చి వెళ్లాయని సమాచారం. దీనిపై విశ్వవిద్యాలయం ఎలాంటి సమాచారం బయటకు చెప్పడం లేదు. ఈసారి ఆకస్మికంగా పరిశీలనకు బృందాలను పంపుతున్నట్టు తెలుస్తోంది. విజయవాడ పరిధిలోని మూడు ప్రధాన బీఈడీ కళాశాలలకూ వర్సిటీ బృందాలు ఇంకా రాలేదు. దీంతో ఈ పునఃపరిశీలన ఎప్పటికి పూర్తి చేస్తారనేది విశ్వవిద్యాలయం అధికారులకే తెలియాలి.
*♦️ఒకరికే మూడేసి కళాశాలల్లో..*
కృష్ణా వర్సిటీ పరిధిలో 22 బీఈడీ కళాశాలలుండగా.. ఏటా వెయ్యి మందికి పైగా కొత్తగా చేరుతుంటారు. వీరిలో చాలావరకూ విద్యార్థులు కళాశాల ముఖం చూడకుండానే కోర్సును పూర్తిచేస్తున్నారు. వీరికి ప్రవేశాలు కల్పించినప్పుడే కళాశాలల యాజమాన్యాలు ఈమేరకు హామీ ఇస్తున్నాయి. పైగా కళాశాలల్లో పనిచేసే అధ్యాపకులు కూడా రిజిస్టర్లలోనే ఉంటారు. కొంతమంది అధ్యాపకుల పేర్లు రెండు మూడు కళాశాలల్లో కనిపిస్తుంటాయి. ఇలా.. ఒక్కో లెక్చరర్ కనీసం మూడు కళాశాలల్లో స్టాఫ్ అప్రూవల్ చేసుకుని ఉండడం విచిత్రం. ఇలా ఒకరినే మూడేసి కళాశాలలకు సంబంధించి స్టాఫ్ అప్రూవల్ ఎలా చేశారనేది విశ్వవిద్యాలయానికే తెలియాలి.
*♦️మేనేజ్‌మెంట్ కోటాలో హామీలతో ప్రవేశాలు..*
కళాశాలల్లో ఫేస్ రికగ్నేషన్‌ను ఖచ్చితంగా అమలు చేయించాలని కృష్ణా వర్సిటీ భావిస్తోంది. దీనికి సంబంధించి కళాశాలల్లో ఇప్పటివరకూ ఎలాంటి ఏర్పాట్లు చేసుకోలేదు. దీనితో పాటు కళాశాలల్లో లేని సిబ్బందిని ఉన్నట్టు చూపించడంపైనా విశ్వవిద్యాలయం దృష్టిసారించింది. ఈ రెండు విషయాలపై స్పష్టత వచ్చాకే.. ప్రవేశాలు కల్పించడం, తరగతులు ఆరంభించడం చేయాలనే ఆలోచనలో ఉంది. కానీ.. ఈ విషయంలో వేగవంతమైన చర్యలు చేపట్టకపోవడంతో విద్యార్థులకు జాప్యం జరుగుతోంది. పక్కనే ఉన్న నాగార్జున విశ్వవిద్యాలయంలో రెండేళ్ల కోర్సు ఒకే ఏడాదిలో పూర్తయ్యేలా వేగంగా చేసున్నారు. అక్కడ 2022 జున్, జులైలో ఆరంభమైన ఎంఈడీ వాళ్లు వచ్చే ఏడాది జనవరికి మూడో సెమిస్టర్ పూర్తిచేసేందుకు నోటిఫికేషన్ ఇచ్చేశారు. ఒక ఏడాది పోవడంతో దానిని భర్తీ చేసేందుకు ఇలా చేస్తున్నారు. కానీ.. కృష్ణా విశ్వవిద్యాలయం పరిధిలో ఈ వేగం కనిపించడం లేదు. పైగా.. బీఈడీ కళాశాలలకు సంబంధించిన అకడమిక్ క్యాలెండర్‌ను సక్రమంగా నిర్వహించే పద్ధతి కూడా లేదు. దీంతో పరిస్థితి అస్తవ్యస్తంగా మారుతోంది. ఎన్నో ఏళ్లుగా తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే కళాశాలల్లో ఈ పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మేనేజ్‌మెంట్ కోటాకు సంబంధించి కూడా ఇప్పటికే కొన్ని కళాశాలలు విద్యార్థులకు ముందస్తు హామీలను ఇచ్చేసి ప్రవేశాలు కల్పించుకుంటున్నట్టు తెలుస్తోంది. వీరు కళాశాలకు రావాల్సిన పనిలేదనే హామీతోనే చేర్చుకుంటున్నారు. ఇప్పుడు ఫేస్ రికగ్నేషన్‌ను పెడితే.. వీరు ఖచ్చితంగా కళాశాలకు రావాలి. అది కుదరని పని. అందుకే.. మేనేజ్‌మెంట్ విద్యార్థులకు ఈ నూతన హాజరు విధానం వద్దనే వాదనను కొన్ని కళాశాలల యాజమాన్యాలు వినిపిస్తున్నాయి.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
*📚✍️పాఠశాలల విలీనంపై*
*మీ వైఖరి చెప్పండి: హైకోర్టు✍️📚*
*🌻అమరావతి, డిసెంబరు 7(ఆంధ్రజ్యోతి)*: పాఠశాలల విలీనం, ఉపాధ్యాయుల హేతబద్ధీకరణను సవాల్ చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. సీనియర్ న్యాయవాది ఎ.సత్యప్రసాద్ వాదనలు వినిపిస్తూ… రాష్ట్ర ప్రభుత్వ చర్యలు విద్యా హక్కు చట్టానికీ, జాతీయ విద్యావిధానానికీ విరుద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఆరు నుంచి 12ఏళ్ల వరకు విద్యను తప్పనిసరి చేస్తూ కేంద్రం విద్యా హక్కు చట్టం తీసుకొచ్చిందన్నారు. ఆర్‌టీఈ చట్టం మేరకు ప్రతీ 60 మంది విద్యార్థులకు కనీసం ఇద్దరు టీచర్లు ఉండాలన్నారు. కానీ ప్రతీ 30 మంది విద్యార్థులకు ఒక్క టీచర్ ఉంటే సరిపోతుందని రాష్ట్ర ప్రభుత్వం సొంత భాష్యం చెబుతోందన్నారు. ప్రాథమిక పాఠశాలల్లో విద్యా బోధన మాతృభాషలో ఉండాలని ఆర్‌టీఈ చట్టం చెబుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో 9వ తరగతి వరకు ఒకే మాధ్యమంలో బోధన ఉంటుందని ప్రభుత్వం చెబుతోందని, ఏ మాధ్యమంలో బోధన చేస్తారనే విషయం పై ప్రభుత్వ ఉత్తర్వులలో స్పష్టత లేదని అన్నారు. గతంలో ప్రాథమిక విద్య కింద ఉన్న 3, 4, 5 తరగతులను ప్రభుత్వం ప్రాథమికోన్నత పాఠశాలల్లో విలీనం చేసిందన్నారు. దీంతో మూడో తరగతి నుంచే చిన్నారులు మూడు కిలోమీటర్లు వెళ్లి చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.ఈ కారణంగా పిల్లలు చదువులకు దూరం అవుతున్నారని వాదించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం విద్యా హక్కు చట్టం, జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకంగా ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ స్పందన కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆ వివరాలను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం ప్రభుత్వ నిర్ణయం విద్యాహక్కు చట్టానికి విరుద్ధంగా ఉందని పిటిషనర్ వాదనలు వినిపిస్తున్న నేపధ్యంలో ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వ వైఖరి తెలియజేస్తూ కౌంటర్ వేయాలని డిప్యూటీ సొలిసిటర్ జనరల్ హరినాథ్‌ను ఆదేశించింది. విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యు.దుర్గాప్రసాదరావు, జస్టిస్ టి.మల్లిఖార్జునరావుతో కూడిన ధర్మాసనం బుధవారం ఆదేశాలిచ్చింది. పాఠశాలల విలీనం, ఉపాధ్యాయుల హేతబద్ధీకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 117, 128, 84, 85లను సవాల్ చేస్తూ ఏపీ సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ కన్వీనర్ డి.రమేష్ చంద్ర సింహగిరి పట్నాయక్, డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ హైకోర్టులో వేర్వేరుగా పిల్ దాఖలు చేశారు. అలాగే పాఠశాలల విలీనాన్ని సవాల్ చేస్తూ తూర్పుగోదావరి, కడప జిల్లాలకు చెందిన విద్యార్థులు, తల్లిదండ్రులు రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలు బుధవారం ధర్మాసనం ముందు విచారణకు వచ్చాయి.