AP Tenth Exams: టెన్త్ విద్యార్థులపై సిలబస్ భారం
ఆరు పేపర్లు చేసినా తగ్గని ఒత్తిడి
ఈనాడు, అమరావతి: పదో తరగతి పరీక్షల్లో పాఠశాల విద్యాశాఖ తీసుకొచ్చిన ఆరు పేపర్ల విధానం విద్యార్థులను తీవ్ర మానసిక ఒత్తిడికి గురి చేయనుంది. సిలబస్ తగ్గించకుండా పరీక్ష పేపర్లను మాత్రం కుదించారు. దీంతో విద్యార్థులు ఒకేసారి కొండంత సిలబస్ చదివి, పరీక్షలు రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరోనా సమయంలో పరీక్షలు నిర్వహించేందుకు అప్పటి వరకున్న 11 పేపర్లను ఏడుకు తగ్గించారు. తొలుత ఇది ఒక్క ఏడాదికే అని ప్రకటించారు. ఇప్పుడు ఏడు పేపర్లను ఆరుకు తగ్గించారు. సిలబస్‌లో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు. అంతర్గత మార్కులు, బిట్ పేపర్ విధానం లేకుండా వంద మార్కులకు అన్ని పాఠాలను ఒకేసారి చదివి, గుర్తు పెట్టుకుని పరీక్షలు రాయడం పిల్లలను తీవ్ర ఒత్తిడిలో నెడుతుందని విద్యారంగ నిపుణులు చెబుతున్నారు. గత విద్యాసంవత్సరం ఎక్కువ మంది పదో తరగతి పరీక్ష తప్పడానికి పేపర్ల సంఖ్య తగ్గడమే ప్రధాన కారణం. ఇవన్నీ విశ్లేషించుకోకుండా ఆరు పేపర్లతో పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ ప్రకటించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.
అన్నీ గుర్తు పెట్టుకోగలరా?
గత విద్యాసంవత్సరం పదో తరగతి పరీక్షల్లో సైన్స్‌లో భౌతిక, రసాయనశాస్త్రాలను కలిపి ఒక పేపర్‌గా.. జీవశాస్త్రం మరో పేపర్‌గా 50 మార్కుల చొప్పున పరీక్షలు పెట్టారు. ఈసారి రెండింటిని కలిపి ఒకే పేపర్‌గా నిర్వహించనున్నారు. భౌతిక, రసాయన శాస్త్రాల్లో 12, జీవశాస్త్రంలో 10 అధ్యాయాలు ఉన్నాయి. ఇవికాకుండా పర్యావరణ విద్య సబ్జెకులో చిన్నచిన్న పాఠాలు 22 వరకు ఉన్నాయి. ప్రభుత్వ పరీక్షల విభాగం విడుదల చేసిన బ్లూప్రింట్ ప్రకారం జీవశాస్త్రం నుంచి 17 ప్రశ్నలు, భౌతిక, రసాయనశాస్త్రాల నుంచి 16 ప్రశ్నలు ఇస్తారు. నాలుగో సెక్షన్‌లో ఇచ్చే ఎనిమిది మార్కుల ప్రశ్నలు అయిదింటికి తప్ప ఎక్కడా ఛాయిస్ ఉండదు. అన్నింటికీ సమాధానాలు రాయాలి. 22 అధ్యాయాలు, 22 పర్యావరణం పాఠాలు చదివి ఎలాంటి ఛాయిస్ లేని 100 మార్కుల పరీక్ష అంటే.. మొదటిసారిగా బోర్డు పరీక్షలు రాసే పదో తరగతి పిల్లలు ఎంత ఒత్తిడికి గురవుతారనే దాన్ని రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి పరిగణనలోకి తీసుకోలేదు.
సాంఘికశాస్త్రం గట్టెక్కేదెలా?
సాంఘికశాస్త్రంలో భౌగోళిక, చరిత్ర, ఆర్థిక, పౌరశాస్త్రాల్లో కలిపి 22 అధ్యాయాలు ఉన్నాయి. అన్నింటికి కలిపి ఒకే పరీక్ష అంటే ఒకేసారి నాలుగు విభాగాల్లోని పాఠాలూ చదవాలి. ప్రశ్నపత్రంలో మొత్తం 33 ప్రశ్నలు ఇస్తారు. ఇందులో ఒక మార్కు ప్రశ్నలు 12, రెండు మార్కుల ప్రశ్నలు 8, నాలుగు మార్కుల ప్రశ్నలు ఎనిమిదింటిలో ఛాయిస్ లేదు. అన్నింటికీ సమాధానం రాయాల్సిందే. గతంలో బిట్‌పేపర్ ఉండేది. దీన్ని తొలగించి నేరుగా సమాధానం రాయాల్సిన ఒక మార్కు, రెండు మార్కుల ప్రశ్నలు తీసుకొచ్చారు. 8 మార్కులకు ఇచ్చే 5 ప్రశ్నల్లోనూ ఒకదానికి ఒక్కటే ఛాయిస్ ఇస్తున్నారు. ప్రశ్న ‘ఏ’ లేదా ప్రశ్న ‘బీ’కి సమాధానం రాయాలి. ఇక్కడ కొంత ఛాయిస్ ఉన్నా ఎక్కువ సబ్జెక్టు చదవాల్సి వస్తుంది
ప్రశ్నల సంఖ్య తగ్గినా ఇబ్బందే
పదిలో 11 పేపర్లు ఉంటే ఒకరోజు సరిగా రాయకపోయినా రెండో పేపర్‌కు ఎక్కువగా సన్నద్ధమయ్యేందుకు అవకాశం ఉండేది. 11 పేపర్లలో 50 మార్కుల ప్రశ్నపత్రంలో 33 ప్రశ్నలు ఇచ్చేవారు. 100 మార్కులకు 66 ప్రశ్నలు వచ్చేవి. ప్రశ్నల సంఖ్య ఎక్కువగా ఉండటంతో సాధారణ విద్యార్థులు కొన్నింటికి సమాధానం రాయలేకపోయినా గట్టెక్కగలిగేవారు. ఇప్పుడు ప్రశ్నల సంఖ్యలో మార్చకుండా మార్కులను రెట్టింపు చేయడంతో సాధారణ విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి లోనవుతారని నిపుణులు అంటున్నారు.
గత ఫలితాలు పట్టవా?
నిరుడు పదో తరగతిలో 67.26% మంది విద్యార్థులే పాసయ్యారు. గణితంలో 19.74%, సామాన్యశాస్త్రంలో 17.82%, సాంఘికశాస్త్రంలో 18.57% మంది పరీక్ష తప్పారు. గతంలో మాదిరిగా అంతర్గత మార్కులు, బిట్‌పేపర్‌కు 25% వెయిటేజీ లేకపోవడంతో విద్యార్థులు ఎక్కువ మంది అనుత్తీర్ణులయ్యారు. ఒకేసారి సిలబస్ మొత్తం చదవడం, ఒకటి, రెండు, నాలుగు మార్కుల ప్రశ్నలన్నింటికీ సమాధానాలు రాయాల్సి రావడంతో గత కొన్నేళ్లలో ఎప్పుడూ లేనంత సాధారణ స్థాయి ఫలితాలు వచ్చాయి. దీన్ని విశ్లేషించి, సిలబస్‌కు తగ్గట్లు ప్రశ్నపత్రాలను రూపొందించాల్సి ఉండగా.. విద్యార్థులపై మరింత ఒత్తిడి తెచ్చేలా మార్పు చేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సీబీఎస్‌ఈ విధానం ఏం చెబుతోంది?
రాబోయే రోజుల్లో పదో తరగతి పరీక్షలను సీబీఎస్‌ఈ విధానంలో నిర్వహిస్తామని ప్రభుత్వం చెబుతోంది. సీబీఎస్‌ఈలో తరగతిలో ఇచ్చే ఎసైన్‌మెంట్లు, నోటుపుస్తకాలు రాయడం, ఇతరత్రా అంశాలను పరిశీలించి అంతర్గత మార్కులు ఇస్తారు. 80 మార్కులకు రాత పరీక్ష, 20 అంతర్గత మార్కులు ఉంటాయి. రాష్ట్ర బోర్డులో అంతర్గత మార్కుల విధానం లేదు. ఇప్పుడు ఎనిమిదో తరగతి విద్యార్థులకు జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్టీ) పుస్తకాలను ఇచ్చారు. 2025లో వీరు పదో తరగతి వచ్చేసరికి సీబీఎస్‌ఈ విధానంలో పరీక్ష రాస్తారు. సీబీఎస్‌ఈ గుర్తింపు లభించని ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలకు సీబీఎస్‌ఈ సిలబస్‌తో రాష్ట్ర బోర్డే పరీక్షలు నిర్వహించాలి. ఒకే సిలబస్ చదివి సీబీఎస్‌ఈ రాసేవారికి అంతర్గత మార్కులు ఉండగా, రాష్ట్ర బోర్డు నిర్వహించే పరీక్ష రాసేవారికి అంతర్గత మార్కులు ఉండని పరిస్థితి ఏర్పడుతుంది.
ప్రభుత్వం విడుదల చేసిన మోడల్ పేపర్లు