అంతరిక్షంలోకి ప్రవేశపెట్టే శాటిలైట్ తయారీ అంటే సామాన్యమైన విషయం కాదు.
మేధావులు, సైంటిస్టులు మాత్రమే ఇందులో భాగస్వాములవుతారనేది ఇప్పటి వరకు అందరికీ తెలిసిన విషయం. అయితే తగిన రీతిలో శిక్షణ ఇస్తే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సైతం ఇందులో తమ వంతు సేవలు అందించగలరని నిరూపించారు వెంగళరావు నగర్ విద్యార్థినులు.
NMMS MODEL GUESS PAPER 01 NMMS MODEL GUESS PAPER 01 HOW TO ATTEMPT AP NMMS…
75 ప్రభుత్వ పాఠశాలలు.. 750 మంది విద్యార్థులు
స్వాతంత్య్ర అమృత మహోత్సవాలకు గుర్తుగా శాటిలైట్ రూపకల్పనకు చర్యలు చేపట్టారు. ‘అంతరిక్షంలో మహిళలు’ ఐక్యరాజ్యసమితి థీమ్ నేపథ్యంలో ‘ఆల్ ఉమెన్ కాన్సెప్ట్’తో దీనిని రూపొందిస్తున్నారు. ఇందుకోసం దేశంలోని 75 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 750 మంది విద్యార్థినులను ఎంపిక చేశారు. ప్రతి పాఠశాలలో 8 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న 10 మంది బాలికలను నీతి ఆయోగ్ భాగస్వామ్యంతో ఎంపిక చేశారు. వారి చేతుల మీదుగా ‘ఆజాదీ శాట్’ అనే ఉపగ్రహం రూపుదిద్దుకుంటోంది. దాదాపు 8 కిలోలున్న ఈ ఉపగ్రహం సమాచార సేవలు అందిస్తుంది. వీరు తయారు చేసిన ఈ ఉపగ్రహాన్ని ఎస్‌ఎస్‌ఎల్‌వీ–డి1 లాంచింగ్ వెహికల్ ద్వారా ఆగస్టు 7న శ్రీహరికోటలోని అంతరిక్ష కేంద్రం నుంచి అంతరిక్షంలోకి ప్రవేశపెట్టనున్నారు. హెక్సావేర్ టెక్నాలజీ సంస్థ కార్పొరేట్ సామాజిక బాధ్యతగా రూ.58 లక్షలు సమకూర్చగా, చెన్నైలోని స్పేస్ కిడ్జ్ ఇండియా సంస్థ సాంకేతిక సహకారం అందిస్తోంది.
ప్రభుత్వ పాఠశాల బాలికల భాగస్వామ్యం..
ఈ శాటిలైట్ తయారీ కోసం తెలంగాణా నుంచి నాలుగు పాఠశాలలు ఎంపిక కాగా అందులో నగరంలోని వెంగళరావునగర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులను సైతం ఎంపికయ్యారు. గత మార్చి నెల నుంచి వీరు తమవంతుగా ఆజాదీ శాట్‌ను స్కూల్‌లోనే రూపొందించి బుధవారం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ‘షార్’కు పంపారు. ఈ ఉపగ్రహ తయారీలో స్కూల్‌కు చెందిన సిహెచ్.హేమచంద్రిక, పి.అశ్విని, పి.జ్ఞానేశ్వరి, బి.రేష్మ, పి.పూజిత, జి.సంధ్య రమ్య, ఈ.పూజ, ఎస్.శ్రావ్య, ఆర్.శరణ్య, ఏ.నవ్య, పి.కావ్య, బి.జశ్విత భాగస్వాములయ్యారు.
డీఈఓ రోహిణి అభినందనలు
విద్యార్థినులతో రూపొందుతున్న ‘ఆజాదీశాట్’ ఉపగ్రహం తయారీలో వెంగళరావునగర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థినుల భాగస్వాములు కావడం గర్వించదగ్గ విషయమని హైదరాబాద్ జిల్లా విద్యాశాఖాధికారి రోహిణి అన్నారు. ఈమేరకు బుధవారం ఆమె సదరు విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో జెండర్ అండ్ ఈక్విటీ కో ఆర్డినేటర్ రజిత, ప్రధానోపాధ్యాయులు పి.ధనుంజయ, టీచర్ ఉమామహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
ఎంతో గర్వంగా ఉంది..
ఈ సందర్భంగా చిన్నారులు ‘సాక్షి’తో మాట్లాడుతూ శాటిలైట్ తయారీలో తాము భాగస్వామ్యం కావడం ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. దేశం గర్వించదగ్గ శాటిలైట్ తయారీలో తమను ఎంపిక చేస్తారని కలలో కూడా ఊహించలేదన్నారు. నిరంతరం తాము స్కూల్‌లో తయారు చేసే శాటిలైట్ అనుసంధాన పరికరం పూర్తిగా సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉందన్నారు. ఈ ప్రక్రియ ప్రారంభం నుంచి ప్రతిరోజు తమను ప్రోత్సహిస్తున్న డిప్యూటీ డీఈఓ యాదయ్య, హెచ్‌ఎం ధనుంజయ్, టీచర్ ఉమామహేశ్వరి తదితరులు తమలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ పరోక్షంగా సహకారాన్ని అందించారన్నారు.