జేఈఈ (JOSSA) కౌన్సెలింగ్ అనంతరమే రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మా తదితర కోర్సుల్లో ప్రవేశాలకు ఏపీ ఈఏపీసెట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.
ఈసారి EAPCET అడ్మిషన్లలో ప్రైవేటు కాలేజీల్లో 30 శాతం, యాజమాన్య కోటా సీట్ల భర్తీకి సంబంధించిన ఫైల్ పరిశీలనలో ఉందన్నారు. కొన్ని వివరణలు అడిగామని, అవి వచ్చాక ఉత్తర్వులు వెలువడతాయన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులపై యాప్‌ల భారం పడుతుందన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.. సమస్య ఎక్కడ ఉందో తెలిపితే పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆగస్టు 15 కల్లా ప్రవేశాల ప్రక్రియ పూర్తవుతుందని, అనంతరం పిల్లల చేరికల గణాంకాలపై స్పష్టత వస్తుందన్నారు. ప్రయివేటు స్కూళ్లను మూసివేయించాలన్నది ప్రభుత్వ విధానం కాదని స్పష్టం చేశారు. గత విద్యా సంవత్సరం వరకు 6 లక్షల మందికి పైగా విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్లలో అదనంగా చేరారని వివరించారు. నాడు నేడు, జగనన్న విద్యాకానుక, జగనన్న గోరుముద్ద, ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్‌ఈ విధానం ఇలా అనేక కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టిందన్నారు.