Singareni Results: సింగరేణి జూనియర్ అసిస్టెంట్ ఫలితాల్లో గందరగోళం
గోదావరిఖని, న్యూస్‌టుడే: సింగరేణి యాజమాన్యం సెప్టెంబరు 10న రాత్రి విడుదల చేసిన జూనియర్ అసిస్టెంట్ పరీక్ష ఫలితాల్లో గందరగోళం నెలకొంది. 177 ఖాళీలకు సింగరేణి యాజమాన్యం ఈ నెల 4న రాత పరీక్షలు నిర్వహించింది. 49,328 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. పరీక్ష ఫలితాల్లో అభ్యర్థి పేరు వద్ద తెలంగాణ, ఏపీ అని రాష్ట్రాల పేర్లు, డిగ్రీ ఉండటం ఆందోళన కలిగిస్తోందని..అభ్యర్థుల పేర్లు లేకుండా ఎలా ప్రకటించారని పలువురు విమర్శిస్తున్నారు. ఫలితాల్లో అవకతవకలు చోటు చేసుకున్నాయని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా కొంత మంది పైరవీకారులు ఉద్యోగాల పేరుతో అభ్యర్థుల నుంచి భారీ మొత్తంలో వసూలు చేశారని ఆరోపణలు రావడంతో భూపాలపల్లికి చెందిన ఉద్యోగిని సింగరేణి విజిలెన్సు అధికారులు విచారించారు. ఆధారం లభించకపోవడంతో పంపించారు. సింగరేణి సంచాలకులు ఎస్.చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ‘‘పరీక్ష ఫలితాల్లో కేవలం మూడు తప్పులు దొర్లాయి. పొరపాటుగా అభ్యర్థి పేరు వద్ద రాష్ట్రాలు, డిగ్రీ అని పడింది. అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’’ అని అన్నారు.