పరిగెత్తుతున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
జీవితమే ఒక పరుగు..ఆ పరుగు లేకపోతే ఆరోగ్యమే లేదు. ఎలాంటి జబ్బు వచ్చినా, రాకుండా ఉండాలన్నా పరుగు తప్పదు. దాంతోనే ఆరోగ్యం ముడిపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఆ పరుగు సక్రమంగా చేయకపోతే లేనిపోని అనర్థాలు వస్తాయి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకోండి.
* రోజూ కాసేపు పరుగెత్తడం శరీరానికి చక్కని వ్యాయామం. మనలో చాలా మంది ఏమీ తినకుండానే పరుగు అందుకుంటారు. ఇది పొరపాటని నిపుణులు చెబుతున్నారు.
* పరగడుపున పరుగెత్తడంతో శరీరంలోని కొవ్వులను కరిగించడానికి తగిన ఇంధనం అందించనట్టే. దాంతో కొవ్వు కరగకపోగా మరింత నీరసించిపోతాం. కార్బోహైడ్రేట్లు లభించే అరటి, యాపిల్, మామిడి పండ్లు, పాలు, డ్రైఫ్రూట్స్, బ్రెడ్, కాయధాన్యాలు గంట ముందే తీసుకోవాలి. ఆ తర్వాత పరుగెత్తాలి.
* పరుగెత్తడం పూర్తయ్యాక శరీరం కోల్పోయిన శక్తిని తిరిగి పొందడానికి ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు లభించే ఆహార పదార్థాలను తీసుకోవాలి.
* నీళ్లు తాగిన తర్వాతనే పరుగు మొదలెట్టాలి. ఆ తర్వాత కూడా నీళ్లు తాగాలి. చేతులు స్థిరంగా ఉంచకుండా అటుఇటు కదలించాలి.
* భుజాలు బాగా ఊపాలి. చేతులు పొట్టకు దగ్గరగా పెట్టుకొని ముందుకు వెళ్లాలి.
* చాలా మందికి వదులు, పొట్టి దుస్తులు ధరించడం అలవాటు. శరీరానికి అతికినట్టు ఉండే కాటన్ దుస్తులు వేసుకోవాలి.
* మెత్తటి రన్నింగ్ షూలను ఎంపిక చేసుకోవాలి. అవి పాదాలకు ఇబ్బంది కలగకుండా ఉండేలా చూసుకుంటే మంచిది.
* నడకతో మొదలెట్టి క్రమంగా వేగం పెంచి పరుగు చేపట్టాలి. ఒక్కసారిగా వేగం మంచిది కాదు. వారానికి ఒకరోజు శరీరానికి విశ్రాంతి ఇస్తే బాగుంటుంది.