దరఖాస్తుకు జులై 19 వరకు గడువు
ఇంటర్(Inter) విద్యార్హతతో నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడీ(Integrated B.Ed)లో చేరేందుకు 2023-24 విద్యా సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(NCET) పేరిట జాతీయ స్థాయిలో ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించనుంది. ఈ మేరకు జాతీయ పరీక్షల సంస్థ(NTA) నోటిఫికేషన్ జారీ చేసింది. జులై 19వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్షల తేదీలను తర్వాత ప్రకటిస్తారు. నూతన విద్యా విధానంలో భాగంగా బీఏ-బీఈడీ, బీఎస్‌ఈ-బీఈడీ, బీకాం-బీఈడీలను ప్రవేశపెట్టాలనే కేంద్రం నిర్ణయం మేరకు ఆ కోర్సులను రాష్ట్రంలో ఐఐటీలు, ఎన్‌ఐటీలు, కేంద్ర, రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో ఈ సంవత్సరమే కొత్తగా ప్రవేశపెడుతున్నారు. ఇప్పటికే రీజనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్(RIE)లు ఐదు ఉండగా వాటిలో ఉన్న కోర్సుల్లో సీట్ల భర్తీకి జాతీయ స్థాయిలో ఉమ్మడి ప్రవేశ పరీక్ష జరుపుతారు. రాష్ట్రంలో ఉర్దూ విశ్వవిద్యాలయం, వరంగల్ ఎన్‌ఐటీ, మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మోడల్ డిగ్రీ కళాశాలలకు కొత్త కోర్సులు మంజూరు కాగా వాటిలో మొత్తం 250 సీట్లున్నాయి.