IB SYLLABUS IN AP SCHOOLS

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

IB SYLLABUS IN AP SCHOOLS 

AP Schools: సర్కారీ బడుల్లో అంతర్జాతీయ సిలబస్‌ 

* పుస్తకాలు చూసి రాసేలా పరీక్షలు  

* మూడో తరగతి నుంచే టోఫెల్‌  

* ‘జగనన్న ఆణిముత్యాలు’ కార్యక్రమంలో సీఎం జగన్‌ ప్రకటన 

* పేదవర్గాలు ప్రపంచాన్ని ఏలే పరిస్థితి వస్తుందని ఆశాభావం 

ఈనాడు, అమరావతి: రాబోయే రోజుల్లో దేవుడి సహకారంతో ప్రభుత్వ బడుల్లో ఇంటర్నేషనల్‌ బాకలారియేట్‌ (ఐబీ) సిలబస్‌ను తీసుకొస్తామని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. ఇంటర్నేషనల్‌ పరీక్షల్లాగే మన ప్రశ్నపత్రాల్లోనూ మార్పులు చేయాల్సిన అవసరం ఉందని, పరీక్షలంటే జ్ఞాపకం పెంచుకుని రాయడం కాకుండా పుస్తకాలు చూసి (ఓపెన్‌ బుక్‌) పరీక్షలు రాసే విధానాన్ని తీసుకొస్తామని వెల్లడించారు. ప్రశ్నపత్రాల్లో ప్రశ్నలను విశ్లేషణాత్మకంగా తీసుకురావాలని, అంతర్జాతీయ సిలబస్‌ మాదిరిగా మార్పులు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతిలో టాపర్‌గా నిలిచిన 42 మంది, ఇంటర్మీడియట్‌లో గ్రూపులవారీగా అత్యధిక మార్కులు సాధించిన 26 మంది విద్యార్థులను ‘జగనన్న ఆణిముత్యాలు’ అవార్డులతో సీఎం సత్కరించారు. ఉన్నత విద్యలో ఐదు కేటగిరిల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 17 మందికి క్విజ్‌ ఛాంపియన్‌షిప్, ఎక్స్‌లెన్స్‌ అవార్డులు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘పేదింటి పిల్లలంతా అంతర్జాతీయంగా ఎదగాలన్న ఉద్దేశంతో ఈ ఏడాది నుంచి మూడో తరగతి వారిని టోఫెల్‌ పరీక్షకు సిద్ధం చేస్తున్నాం. పిల్లలు ఆంగ్లంలో రాయడం, మాట్లాడడం రెండింటిలోనూ అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడే పరిస్థితి తీసుకువచ్చేందుకు ఈ పరీక్ష నిర్వహిస్తున్నాం. ఎనిమిదో తరగతికి రాగానే ప్రతి విద్యార్థికి కంటెంట్‌ వేసి, ట్యాబ్‌ ఇస్తున్నాం. ప్రభుత్వ బడుల్లోని పేదవర్గాలు ప్రపంచాన్ని ఏలే పరిస్థితి వస్తుంది. అత్యున్నత శిఖరాలకు ఎదగాలనే తపన ప్రతి ఒక్కరిలోనూ ఉండాలి’ అని సూచించారు. 

మారుతున్న చదువును అందుకోవాలి.. 

‘‘ప్రపంచాన్ని మారుస్తున్న సాంకేతికత, మారుతున్న చదువులను పిల్లలందరూ తెలుసుకోవాలి. ప్రపంచాన్ని శాసించబోయే కృత్రిమ మేథ, డేటా సైన్స్, మేషిన్‌ లెర్నింగ్, ఛాట్‌ జీపీటీ యుగంలో ఉన్నాం. మారుతున్న ప్రపంచంలో మనం ఎక్కడ ఉన్నాం.. ఎంతగా ఎదగాలి.. అని ఆలోచించాలి. రానున్న రోజుల్లో పోటీలోనూ మార్పు వస్తుంది. మనం వేగంగా మారకపోతే ఎక్కడుంటామో తెలియని పరిస్థితుల్లోకి వెళ్లిపోతాం. ఈ ఏడాది పదోతరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్షల్లో అణిముత్యాలుగా నిలిచిన 22,768 మందిని నాలుగు స్థాయిల్లో సత్కరించాం. పరోక్షంగా ప్రభుత్వ బడి, వాటిలో పాఠాలు చెబుతున్న టీచర్లకు ఇది సన్మానం. పదో తరగతి టాపర్లలో బాలురు 18 మంది ఉంటే బాలికలు 24 మంది ఉన్నారు. ఇంటర్మీడియట్‌లో బాలురు నలుగురు ఉంటే బాలికలు 22 మంది ఉన్నారు. ఇది ఆడపిల్లలను బడికి పంపి తల్లిదండ్రులు అందిస్తున్న ప్రోత్సహిస్తున్నదానికి నిదర్శనం. పేద తల్లిదండ్రులు ఎవ్వరూ చదివించేందుకు అప్పులపాలయ్యే పరిస్థితి రాకూడదని విద్యాదీవెన, వసతి దీవెన అమలు చేస్తున్నాం. డిగ్రీ, ఇంజినీరింగ్, వైద్యవిద్యకు మొత్తం ఫీజులన్నింటినీ ప్రభుత్వమే భరిస్తోంది. విదేశాల్లో టాప్‌ 50 కళాశాలల్లో 21 సబ్జెక్టుల్లో సీటు తెచ్చుకుంటే మీ జగన్‌ మామ ప్రభుత్వం అండగా ఉంటుంది. ప్రతి రంగంలోనూ ప్రపంచానికి మన పిల్లలు నాయకులుగా ఎదగాలనే తాపత్రయంతో అడుగులు వేస్తున్నాం. ఇది జరగాలంటే నాణ్యమైన విద్య రావాలి. ఈ నాలుగేళ్లల్లో దీనిపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. ప్రభుత్వ బడుల్లోనే కార్పొరేట్‌ సదుపాయాలు కల్పిస్తున్నాం’ అని వెల్లడించారు.   

సంకల్పం గట్టిదైతే ఫలితాలు వస్తాయి..

‘టాప్‌ ర్యాంకులు తెచ్చుకున్న విద్యార్థులే కాదు.. వారితోపాటు ఏ ర్యాంకూ తెచ్చుకోలేని వాళ్లుకూ సమాన ప్రాధాన్యం ఇస్తాం. సంకల్పం గట్టిదైతే ఫలితాలు అవే వస్తాయి. ‘అణిముత్యాలు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ బడుల్లో చదువుతున్న పిల్లలను దేశానికి చూపిస్తున్నాం. అత్యధిక మార్కులు తెచ్చుకున్న వారిని చూస్తుంటే ప్రభుత్వ బడులు, కళాశాలలను మరింత గొప్పగా మార్చాలన్న కోరిక మరింత పెరుగుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం, సీబీఎస్‌ఈ సిలబస్‌ అందుబాటులోకి వచ్చాయి. ద్విభాషా పాఠ్యపుస్తకాలు తీసుకొచ్చాం. బైజూస్‌ కంటెంట్‌ అందుబాటులోకి వచ్చింది. మూడో తరగతి నుంచి సబ్జెక్టు టీచర్లను పెట్టాం. ఆరో తరగతి నుంచి ప్రతి తరగతిలోనూ ఇంటరాక్టివ్‌ ప్లాట్‌ ప్యానెల్స్‌తో డిజిటల్‌ బోధన అందిస్తున్నాం. ప్రతి విద్యార్థికి మరింత ప్రభావవంతంగా చదువు నేర్పించే ప్రయత్నం చేస్తున్నాం. ప్రతి విద్యార్థి ముఖంలో కాంతి, ఆత్మ విశ్వాసం కనిపిస్తున్నాయి. మట్టి నుంచి పెరిగిన ఈ మొక్కలు ఈ రోజు మహా వృక్షాలై ప్రపంచానికే అభివృద్ధి ఫలాలు అందించాలని కోరుకుంటున్నాను’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అంతకుముందు మంత్రి బొత్స మాట్లాడుతూ.. టాపర్లుగా నిలిచిన విద్యార్థులను చూసి, మిగిలిన వారు స్ఫూర్తి పొందాలనే ఉద్దేశంతోనే ఇలా సన్మానం చేస్తున్నామని వెల్లడించారు. ఈ ఏడాది నుంచి 6-10 తరగతుల్లో ఐఎఫ్‌పీ ప్యానల్స్‌ ఏర్పాటు చేస్తామని తెలిపారు. 

error: Content is protected !!