ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2022 కార్యక్రమం వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ 5జీ సర్వీసులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చీఫ్ ముఖేష్ అంబానీ మాట్లాడుతూ వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి దేశం నలుమూలల రిలయన్స్ జియో 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. తొలుత కోల్‌కతా, ఢిల్లీ, ముంబై, చెన్నై నగరాల్లో జియో 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయని, దీపావళి నాటికి ఈ నగరాల్లో 5జీ సర్వీసులు లభ్యమవుతాయని స్పష్టం చేశారు.
5జీ సేవల దిశగా సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, టెలికాం శాఖల కృషి గర్వకారణమన్నారు. ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ ఇప్పుడు ఆసియన్ మొబైల్ కాంగ్రెస్, గ్లోబల్ మొబైల్ కాంగ్రెస్‌గా ఎదగాలని ఆకాంక్షించారు. రాబోయే తరం కనెక్టివిటీ టెక్నాలజీ కంటే 5జీ అధికమని ఏఐ, ఐఓటీ, రోబోటిక్స్, బ్లాక్‌చైన్ అండ్ మెటావర్స్ వంటి 21వ శతాబ్ధపు టెక్నాలజీలను అందిపుచ్చుకునేందుకు 5జీ ప్రాధమిక టెక్నాలజీ వంటిదని ముఖేష్ అంబానీ అభిప్రాయపడ్డారు.
5జీ ఆధారిత డిజిటల్ సొల్యూషన్స్ చవకైన నాణ్యతతో కూడిన విద్య, నైపుణ్యాలను దేశంలోని సామాన్య పౌరులకు చేరువ చేస్తాయని ఆకాంక్షించారు. దేశ యువతకు నూతన టెక్నాలజీలతో ప్రపంచ శ్రేణి సామర్ధ్యాలు, నైపుణ్యాలు అలవడతాయని, దేశం ప్రపంచంతో పోటీ పడేలా రూపొందేందుకు 5జీ సేవలు తోడ్పడతాయని చెప్పారు.