మన ఆలోచనలే మన లోచనాలు

WhatsApp Group Join Now
Telegram Group Join Now
మన ఆలోచనలే మన లోచనాలు
లోచనాలు అంటే కళ్ళు. మన ఆలోచనలే మన కళ్ళు. మనం ఎలా ఆలోచిస్తే మన కళ్ళు అలా చూస్తాయి.మన ఆలోచనలు మంచివైతే మనకళ్ళకి అన్నీ మంచిగానే కనబడతాయి. అలాగే మన ఆలోచనలు చెడ్డవైతే మనకు అన్నీ చెడ్డగానే కనబడతాయి. అవే మన మనోనేత్రాలు. అందుకే ఎప్పుడూ మంచిగానే ఆలోచించాలి.అన్నింటిలోనూ మంచినే చూడాలి.
ఇద్దరు వ్యక్తులు చంద్రునిపైనున్న మచ్చలను చూస్తున్నారు.అందులో ఒకాయన అన్నాడు.”ఆహా! ఆ మచ్చలను చూడండి.అచ్చం దేవాలయ గోపుర శిఖరాల్లా ఉన్నాయి “అని. దానికా రెండో ఆయన “అబ్బే! అవేం కాదండీ! అవి ప్రేయసీప్రియులు ఒకరినొకరు ముద్దాడుకుంటున్నట్లు ఉన్నాయి చూడండి.”అన్నాడు.
మొదటి ఆయన ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే రెండో ఆయన శృంగార పరంగా చూసేడు.అవే మచ్చలు.కాని చూడడంలో తేడా. మన మనసెలా ఉంటే మన పరిసరాలు అలా అనిపిస్తాయి. మనం సంతోషంగా ఉంటే మన చుట్టూ ఉన్న ప్రపంచం అంతా ఆనందమయంగా కనిపిస్తుంది. అదే మనం విచారంగా ఉంటే ప్రపంచం అంతా దుఃఖ మయంగా కనిపిస్తుంది.
ఒక పాదచారి నడుచుకుంటూ వెళ్తూ త్రోవలో రోడ్డుప్రక్కన ఒక వ్యక్తి అచేతనంగా పడి ఉండడం చూసి “ పీకల దాకా త్రాగి ఉంటాడు.అందుకే పడిపోయేడు.” అనుకుంటూ వెళ్లిపోయేడు. అదే దారిన వెళ్తున్న మరొకతను చూసి “ అయ్యో పాపం.స్పృహ తప్పి పడిపోయినట్లున్నాడు.” అని చల్లని నీళ్ళు తెచ్చి ఆ వ్యక్తి ముఖం మీద జల్లేడు.వెంటనే అతను తేరుకున్నాడు. మొదటి ఆయన ఆలోచనను బట్టి అతనికి ఆ వ్యక్తి అలా కనిపించేడు. ఇంక రెండో ఆయన విధానం వేరు.అంచేత ఆయనకు అదే వ్యక్తి మరోలా కనిపించేడు.
అలాగే రామాయణాన్ని ఒక కథగా అనుకుంటే కథలాగే అనిపిస్తుంది.అలా కాకుండా ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే అందులోని అంతరార్థం బోధపడుతుంది. శ్రీరాముడు పరమాత్మ.సీత జీవాత్మ.ప్రతి మానవుని దేహం లంకానగరం.ఈ లంకాద్వీపమనే దేహంలో బంధింపబడిన సీత అనే జీవాత్మ శ్రీరాముడనే పరమాత్మను చేరుకోవాలని కోరుతుంటుంది. కాని రాక్షసులు దానిని జరుగనీయరు. రాక్షసులు అంటే మానవునిలోని రజో,తమో గుణాలు. ఈ రజో,తమో గుణాలు సీత అనే జీవాత్మను శ్రీరాముడనే పరమాత్మతో కలుసుకోనీయకుండా దేహమనే లంకలో బంధించి ఉంచేయి. అలా బంధింపబడి శ్రీరాముని కలుసుకోగోరే సీతవద్దకు హనుమంతుడనే గురువు వస్తాడు. శ్రీరాముని అంగుళీయకం ఆమెకు చూపిస్తాడు.సకల భ్రాంతులను రూపుమాపే బ్రహ్మజ్ఞానమే ఆ అంగుళీయకం. ఈ విధంగా శ్రీరాముని చేరడానికి సీతకు మార్గమేర్పడుతుంది.అంటే గురువు వలన పొందిన బ్రహ్మజ్ఞానమే జీవాత్మ పరమాత్మతో ఐక్యం కావడానికి మార్గదర్శనం చేస్తుంది.
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Stay informed about the latest government job updates with our Sarkari Job Update website. We provide timely and accurate information on upcoming government job vacancies, application deadlines, exam schedules, and more.

Categories

Category 1

Category 2

Category 3

Category 4

Category 5

error: Content is protected !!