AP 1000 CBSE Schools 10th Hindi Deleted Syllabus 2024-25 Review the syllabus of Hindi subject…
*🌻న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ*: పాఠశాల విద్యలో ఆధునికత, అదనపు సదుపాయాలను జోడించేసరికొత్త పథకానికి కేంద్ర మంత్రిమండలి ఆమోద ముద్ర వేసింది. ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి చేసిన ప్రకటనకు బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రిమండలి కార్యరూపం తీసుకొచ్చింది. ‘ప్రధాన మంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా(పీఎం – శ్రీ పేరుతో అమలుకానున్న ఈ పథకంలో దేశవ్యాప్తంగా 14,500 పాఠశాలలను కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేయనుంది. ఫలితంగా మొత్తం 18 లక్షల మంది విద్యార్థులకు లబ్దిచేకూరనుంది. 2020 నుంచి అమల్లోకి తీసుకొచ్చిన సరికొత్త జాతీయ విద్యావిధానంలో పొందుపర్చిన మౌలిక వసతులు, ఆధునిక సాంకేతిక సదుపాయాలను కల్పించనుంది. 21వ శతాబ్దానికి కావాల్సిన నైపుణ్యాలను అందించే వేదికలుగా పాఠశాలలను మార్చడం కోసం ఈ కొత్త పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఐదేళ్ల కాలంలో (2022-23 నుంచి 2026 వరక ఎ) రూ.27,360 కోట్లను ఈ పథకంలో భాగంగా వెచ్చించనున్నారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం తన వాటా కింద రూ.18,128 కోట్లు ఖర్చు చేయనుంది. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ పాఠశాలలతో పాటు స్థానిక సంస్థలు నిర్వహించే పాఠశాలల్లో కొన్నింటిని ఎంపిక చేసి మౌలిక వసతులను మెరుగుపర్చనున్నారు.
⭕జాతీయ విద్యా విధానంలో పొందుపర్చిన ప్రకారం విద్యార్థుల భిన్న నేపథ్యాలు, బహుభాషా అవసరాలు, విభిన్న విద్యా సామర్థ్యాలను దృష్టిలో పెట్టుకుని వారందరూ అభ్యాస ప్రక్రియలో చురుకుగా పాల్గొనేలా అందరికీ సమాన, నాణ్యమైన, ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించడం కోసం కేంద్రం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. అన్నింటా ఇతర పాఠశాలలకు ఆదర్శప్రాయంగా నిలిచేలా పీఎం-శ్రీ పథకంలో ఉన్న పాఠశాలలను అభివృద్ధి చేయనున్నారు. ఈ స్కూళ్లలో సోలార్ ప్యానెళ్లు, ఎల్ఈడీ లైట్లు, సహజ వ్యవసాయ పద్దతులతో కూడిన పోషకాహార తోటలు, వ్యర్థ పదార్థాల సమర్థ నిర్వహణ వ్యవస్థ, ప్లాస్టిక్ రహిత, నీటి సంరక్షణ, సాగు, పర్యావరణ పరిరక్షణ విధానాలతో మొత్తంగా ప్రతి పాఠశాలను గ్రీన్ స్కూల్గా తీర్చిదిద్దనున్నారు. అదే సమయంలో ఈ పాఠశాలల్లో డిజిటల్ క్లాస్ రూమ్స్, డిజిటల్ లైబ్రరీ, స్మార్ట్ క్లాస్ రూమ్స్, నైపుణ్య శిక్షణకు తగిన మౌలిక వసతులు, సైన్స్ ల్యాబులు వంటి ఆధునిక సదుపాయాల కల్పన కూడా ఈ పథకంలో భాగమే. అయితే పీఎం-శ్రీ పథకం కింద పాఠశాలల ఎంపిక పోటీ పద్ధతిలో జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇందుకోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక పోర్టల్లో పాఠశాలలు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది.