దేశంలో అత్యధికుల నోళ్లలో నానే మాట… భిన్న సంస్కృతుల వారధి… కేంద్ర అధికారిక హోదా అందుకున్న భాష… హిందీ భాష. నేడు హిందీ దివస్.. ఆ సందర్భంగా కొన్ని ఆసక్తికర సంగతులు.
* 1949లో భారత రాజ్యాంగ సభ హిందీని జాతీయ అధికారిక భాషగా గుర్తించింది. అప్పటి నుంచి ప్రతి ఏడాది సెప్టెంబరు 14ని ‘హిందీ దివస్’గా జరుపుకొంటున్నారు.
* పర్షియన్ పదం ‘హింద్’ నుంచి హిందీ పుట్టుకొచ్చింది. ఇండస్ నదీ పారుతున్న నేలలో మాట్లాడే భాష అని దీని అర్థం.
* కేంద్ర ప్రభుత్వం అధికారికంగా గుర్తించిన రెండు భాషల్లో హిందీ ఒకటి. ఇది దేవనాగరి లిపిలో ఉంటుంది. దేశంలో అత్యధికులు మాట్లాడే భాష హిందీ.
* ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే భాషల్లో నాలుగోస్థానంలో ఉంది. మాండరియన్, స్పానిష్, ఇంగ్లిష్, తర్వాత హిందీనే ఎక్కువగా 35 కోట్ల మంది మాట్లాడుతున్నారు.
* భారత్‌లోనే కాదు.. పాకిస్థాన్, నేపాల్, బంగ్లాదేశ్, అమెరికా, ఇంగ్లండ్, జర్మనీ, న్యూజిలాండ్, యూఏఈ, ఉగాండా, గయానా, సురినామ్, ట్రినిడాడ్, మారిషస్, దక్షిణాఫ్రికాల్లోనూ హిందీని జనం గణనీయ సంఖ్యలో మాట్లాడతారు.
* కాకా కాలేల్కర్, మైథిలీ శరణ్ గుప్తా, హజారీ ప్రసాద్ ద్వివేదీ, సేథ్ గోవింద్‌దాస్ హిందీ అధికారిక భాషగా గుర్తింపు పొందడంతో విశేష కృషి చేశారు.
* ప్రపంచ భాష ఇంగ్లిష్.. హిందీ నుంచి చాలా పదాలు అరువు తీసుకుందంటే మీరు నమ్ముతారా? అవతార్, బంగ్లా, గురు, కర్మ, లూట్, పంచ్, పైజామా, షాంపూ, యోగా.. ఇవన్నీ ఆంగ్లంలో విరివిగా వాడే హిందీ పదాలు.
* హిందీలో ప్రతి పదానికీ ప్రత్యేకమైన శబ్దం, ఆల్ఫాబెట్ ఉంటుంది. దీంతో ఆ పదాల్ని ఉచ్ఛరించడం, రాయడం తేలిక. ఇతర భాషలతో పోలిస్తే దీన్ని నేర్చుకోవడమూ సులభమే.
* దేశంలో హిందీని అధికారిక భాషగా గుర్తించిన మొదటి రాష్ట్రం బిహర్. 1881లో ఉర్దూ స్థానంలో హిందీని చేర్చారు.
* ప్రతి ఏడాది హిందీ దివస్ నాడు భారత రాష్ట్రపతి హిందీ భాష కోసం విశేష కృషి చేసిన కళాకారులు, రచయితలకు దిల్లీలో జరిగే ఒక కార్యక్రమంలో అవార్డులు ప్రదానం చేస్తారు