ఫోటో …ఓ మధుర జ్ఞాపకం!
(నేడుప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం)
మన పూర్వీకులు ఎలా ఉంటారో మనకు తెలియదు.కవులు తమకవిత్వం లో, చిత్ర కారులు తమ చిత్రాలలో వర్ణించిన దానిని బట్టి మనం వారు ఎలా ఉంటారనే విషయం పై ఒక అవగాహన వచ్చాము.కానీ ఫోటోగ్రఫీ రంగం అభివృద్ధి చెందాకా,మన రూపాలని భవిష్యత్ తరాలకు భద్రంగా అందించేందుకు దోహదపడుతుంది.
ఆధునిక ఫొటోగ్రఫీ ప్రక్రియ అయిన ‘డాగ్యుర్రె టైప్’ ను కనుగొనడం ఈ ఫొటోగ్రఫీ దినోత్సవానికి మూలం. ఈ ప్రక్రియను లూయిస్ జాకురెస్ డాగ్యుర్రె అభివద్ధిపరిచాడు. మొట్టమొదటి సారిగా ఛాయాచిత్రాలను తయారు చేయటానికి శ్రీకారం చుట్టింది ఫ్రాన్స్ దేశానికి చెందిన లూయిస్ జాకురెస్ డాగ్యుర్రె. 1553లో బిఫోర్ట్ అనే సాధరణ వ్యక్తి కెమెరాను కనిపెట్టాడు. అయితే లూయిస్ డాగ్యుర్రె మొదట గాజు పలకపై కొన్ని రసాయనాలను పోసి, ఛాయాచిత్రాన్నిరూపొందించాడు. అది 1839 ఆగస్టు19న కావడంతో ఆనాటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా ‘ఫోటోగ్రఫీ దినోత్సవం’ నిర్వహిస్తున్నారు.
వెయ్యి మాటలు చెప్పలేని భావాన్ని ఫోటో చెపుతుంది. వర్తమాన అంశాలని భవిష్యత్ తరాలకు అందిస్తుంది. మధుర జ్ఞాపకాలని తరతరాలకి భద్రపరుస్తుంది.పండుగలు ,వివాహాలు ,వేడుకలు ,విహారాలు ,విషాదాలు, సాహసాలు .. అన్నిటికీ ఫోటో సాక్ష్యంగా నిలుస్తుంది. ఓ ఫోటో చూస్తే ఎంతోకాలం మదిలో ముద్రించుకు పోతుంది. ప్రతి ఫోటో వెనుక ఓ జ్ఞాపకం.. ఓ కథ.. ఓ అనుభూతి.. దాగుంటుంది. అలనాటి జ్ఞాపకాల్ని మళ్ళీ మళ్ళీ తనివితీరా వీక్షించుకునే అవకాశాన్ని ఇచ్చే తీపిగురుతులు ఫొటోలు మాత్రమే. అందుకనే నేటి దైనందిన జీవితంలో ఫొటోగ్రఫీ ఒక భాగంగా మారింది. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఫోటోతో జీవితం ముడిపడిన అందరికీ శుభాభినందనలు.
దశాబ్దాలుగా ఫోటోలు తీయడం ఎన్నో దశలు దాటుతూ వస్తోంది. ఫోటోగ్రఫీకి ప్రధానం గా కావాల్సింది సృజనాత్మకత. అలాగే కెమెరా కన్ను ఉండాలి. చాలా రోజులు బ్లాక్ అండ్ వైట్ ఫోటోలదే పై చేయి.. ఇప్పటికి కొన్ని ఫోటోలు బ్లాక్ అండ్ వైట్ లోనే బావుంటాయి. నేడు ఫోటోగ్రఫీ రోజుకో కొత్త పుంతలు తొక్కుతూ అధునిక రంగంలో దూసుకెళ్తోంది.
1901లో మార్కెట్లోకి ”కొడక్ బ్రౌనీ” రావడంతో ఎవరైనా ఫోటోలు తీసుకోవడానికి వీలైన పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చేసింది. తొలి డిజిటల్ స్కానింగ్ ఫోటోగ్రాఫ్ 1957లో మొదలైంది. డిజిటల్ స్కానింగ్ ప్రక్రియను ‘రస్కెల్ ఎ కిర్స్చ్’ అనే కంప్యూటర్ పరిజ్ఞాని కనుగొన్నాడు. కెమేరా ఇమేజ్‌లను కంప్యూటర్‌లోకి ఫీడ్ చేశాడు. తొలి కలర్ ఇమేజ్‌ను 1861లో ఫోటోగ్రాఫ్ చేసినా, కలర్ ఫోటోగ్రఫీపై 19వ శతాబ్ధి అంతా పరిశోధన కొనసాగింది. దశాబ్ధాలు గడిచేకొద్దీ రకరకాల కెమేరాలు అందుబాటులోకి వచ్చేశాయి. ఇలా నేడు అరచేతిలో ఇమిడిపోయి, కనురెప్ప పాటులో ‘క్లిక్’ అనిపించే ఫోటోగ్రఫీ వెనుక ఎందరో శాస్త్రవేత్తల శ్రమ దాగి ఉంది.
ప్రస్తుతం ఫోటోగ్రఫీ చేయితిరిగిన ఫోటోగ్రాఫర్లకే పరిమితం కావడం లేదు. అందర్నీ సామాజిక కోణంలో ఆలోచింపజేసే ఫొటోగ్రాఫర్లుగా తీర్చిదిద్దుతోంది. తమ ఫొటోలు తామే తీసుకునే ”సెల్ఫీ” ల ట్రెండ్ ప్రస్తుతం నడుస్తోంది. సెల్ఫీ ఫొటోలు క్షణాల్లోనే సోషల్ మీడియా ద్వారా అందరికీ చేరుతున్నాయి. ఇలా ఫొటోచిత్రణ ఎప్పటికప్పుడు ఆధునికతనుసంతరించుకుంటూ ప్రపంచాన ‘క్లిక్ క్లిక్’ అంటూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. ప్రతి దృశ్యం ఓ జ్ఞాపకం.. ఓ కథ.. ఓ అనుభూతి..
ఫోటో తీయడం ఓ రెండు దశాబ్దాల వెనక్కి వెళితే ఓ పెద్ద ఆర్ట్ కిందే లెక్క. ఆ కళను ప్రత్యేకంగా నేర్చుకునేవారు. కెమెరా స్వంతంగా కొనుక్కోవడం అంటే అది ఓ పెద్ద విశేషమే.అంతకు మరో రెండు దశాబ్దాల వెనక్కి వెళితే ఫోటో తీయించుకోవడం కేవలం ధనికులకు మాత్రమే ఉన్న అవకాశం. ఇలా వెనక్కి తరచి చూస్తె ఫోటో గ్రాఫి ప్రస్థానంలో బోలెడు మైలురాళ్ళు.
ప్రపంచంలో మొదటి ఫోటో..
1826లో ఫ్రాన్స్ లో కెమేరాతో మొదటి ఫోటో తీశారు. జోసెఫ్ నికోఫోర్ నిప్సే అనే ఆయన తన ఇంటి మెట్లమీద ఉన్న కిటికీ నుంచి ఈ ఫోటో తీసాడు. ఒక అద్దం మీద జూడియా బిటమిన్ (ఒక రకమైన తారులాంటి పదార్ధం) పూసి హేలోగ్రఫీ పద్ధతిలో దీనిని తీశారు.మొట్టమొదటి కలర్ ఫోటో.జేమ్స్ క్లార్క్ మాక్స్ వెల్ అనే లెక్కల మాస్టారు 1861లో మొదటి కలర్ ఫోటో తీసారు.
మొట్టమొదటి డిజిటల్ ఫోటో..
1957లో అంటే కోడాక్ డిజిటల్ కెమెరాని కనుగొనడానికి 20 ఏళ్లకు ముందు రస్సెల్ కిర్ష్ తన కొడుకును డిజిటల్ పద్ధతిలో ఫోటో తీశాడు.
మొదటి మనిషి ఫోటో..
లూయిస్ మొదటి సారి మనిషి ఫోటో తీసాడు. ఒక బౌలేవార్డ్ ఆలయం వద్ద నిలబడి ఉన్న మనిషిని ఫోటో తీసాడు. ఈ ఫోటో తీయడానికి ఏడునిమిషాల సమయం పట్టింది. ఈలోపు ఆ వ్యక్తి అక్కడ నుంచి కదలి వెళ్ళిపోయాడు. దాంతో మనిషిని ఫోటో తీయలేకపోయాం అనుకున్నారు. కానీ, ఆ ఆలయం ముందు ఒక వ్యక్తి షూ పాలిష్చేయించుకుంటున్న విషయం జాగ్రతగా పరిశీలిస్తే కనిపించింది. అందుకే ఇది మొదటి మనిషిని తీసిన మొదటి ఫోటోగా గుర్తింపు పొందింది.
ప్రస్తుతం స్మార్ట్ ఫోన్తో అందరూ ఫోటోలుతీసుకుంటున్నారు.పాత్రికేయులు వివిధ సమస్యలపై ఫోటోలు తీసుకుని వార్తలని ప్రచురించి,వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. సెల్ ఫోన్లు వచ్చాక సెల్ఫీల సంస్కృతి కూడా బాగా పెరిగింది. ఉద్యోగ,ఉపాధ్యాయులకు ముఖ ఆధారిత యాప్ ద్వారా వారి హాజరు వివరాలని తీసుకునేందుకు వివిధ ప్రభుత్వాలు సన్నాహాలు చేస్తున్నాయి.ఒకప్పుడు ఫోటో అనేది ఒక మధుర జ్ఞాపకం.ఇప్పుడిది జీవితంలో ఒక భాగం అయ్యింది.
యం.రాం ప్రదీప్
తిరువూరు
9492712836