విమానాల నిర్వహణలో యువతకు శిక్షణ GMR ఇవ్వనుంది

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

విమానాల నిర్వహణలో యువతకు శిక్షణ ఇచ్చేందుకు జీఎంఆర్‌ గ్రూపుతో ఎయిర్‌బస్‌ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ శిక్షణకు ఎంపికైన విద్యార్థులకు హైదరాబాద్‌లోని జీఎంఆర్‌ స్కూల్‌ ఆఫ్‌ ఏవియేషన్‌లో ఎయిర్‌క్రాఫ్ట్‌ మెయింటెనెన్స్‌ ఇంజినీర్‌ (ఏఎంఈ) లైసెన్సు ప్రోగ్రామ్‌లో చేరే అవకాశం లభిస్తుంది. ఇది నాలుగేళ్ల కోర్సు. ఇందులో రెండేళ్ల పాటు తరగతిగదిలో శిక్షణ ఉంటుంది. మిగిలిన రెండేళ్ల పాటు విమానాల నిర్వహణ, మరమ్మతు, ఓవర్‌హాలింగ్‌ (ఎంఆర్‌ఓ) పనుల్లో నిమగ్నమవుతారు. జీఎంఆర్‌ ఏరో టెక్నిక్‌ కేంద్రంలో ఈ ప్రాక్టికల్‌ శిక్షణ ఉంటుంది. ఆ తర్వాత ‘ఎయిర్‌క్రాఫ్ట్‌ టైప్‌ ట్రైనింగ్‌’ కూడా విద్యార్థులకు లభిస్తుంది. దీనికి అవసరమైన సాఫ్ట్‌వేర్‌, పాఠ్యాంశాలు, పరీక్షల నిర్వహణ, సంబంధిత ఇతర సాంకేతిక సమాచారాన్ని ఎయిర్‌బస్‌ అందిస్తుంది. ఎయిర్‌బస్‌ కస్టమైజ్డ్‌ బేసిక్‌ ట్రైనింగ్‌ మాడ్యూల్స్‌, ఎయిర్‌బస్‌ కాంపిటెన్స్‌ ట్రైనింగ్‌ (ఏసీటీ) ప్యాకేజీని సరఫరా చేస్తుంది. జీఎంఆర్‌లోని ఇన్‌స్ట్రక్టర్లకు అవసరమైన శిక్షణను సైతం ఎయిర్‌బస్‌ అందజేస్తుంది.

ఈ ఏడాది నుంచే: ఏఎంఈ లైసెన్సు ప్రోగ్రామ్‌ను ఈ ఏడాది నుంచే ప్రారంభించాలని సంకల్పించారు. ఇంటర్‌ ఎంపీసీ అభ్యసించిన విద్యార్థులు దీనికి అర్హులు. జీఎంఆర్‌ ఏరో టెక్నిక్‌ కేంద్రం హైదరాబాద్‌లోని జీఎంఆర్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉంది. భారతదేశంలో ఎంఆర్‌ఓ సదుపాయాలు, సేవల విస్తరణకు జీఎంఆర్‌ గ్రూపుతో కుదుర్చుకున్న ప్రస్తుత భాగస్వామ్యం దోహదపడుతుందని ఎయిర్‌బస్‌ ఇండియా, దక్షిణాసియా వ్యవహారాల ఎండీ రెమి మెయిలార్డ్‌ పేర్కొన్నారు. ఎయిర్‌బస్‌ గ్లోబల్‌ మార్కెట్‌- 2022 అంచనాల ప్రకారం వచ్చే 20 ఏళ్లలో మనదేశంలో 45,000 మంది ఎయిర్‌క్రాఫ్ట్‌ మెయింటెనెన్స్‌, సర్వీసెస్‌ నిపుణుల అవసరం ఉంది. 2030 నాటికి మనదేశం అతిపెద్ద విమాన సేవల విపణిగా అవతరించనుందని జీఎంఆర్‌ ఏరో టెక్నిక్‌ సీఈఓ అశోక్‌ గోపినాథ్‌ తెలిపారు.

error: Content is protected !!