AP 1000 CBSE Schools 10th Hindi Deleted Syllabus 2024-25 Review the syllabus of Hindi subject…
*🌻అమరావతి, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి):* పాఠశాలల్లో తరగతుల విలీనం నేపథ్యంలో విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఏ పాఠశాలకు ఎంతమంది టీచర్లు అవసరమవుతారో ఖరారు చేయాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 31 నాటికి పాఠశాలల్లో ఉన్న విద్యార్థుల సంఖ్యను ప్రామాణికంగా తీసుకుని ఈ లెక్క తేల్చాలని స్పష్టం చేసింది. ఇది పాఠశాల, సబ్జెక్టు, కేటగిరీ వారీగా ఉండాలని సూచించింది. దీనినిబట్టి 31వ తేదీనాటికి పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఎంత ఉందనే వివరాలను ప్రధానోపాధ్యాయుల ద్వారా తీసుకుని, కొత్తగా తెచ్చిన హేతుబద్ధీకరణ విధానం ఆధారంగా టీచర్లను కేటాయించనున్నారు. 20 మంది విద్యార్థులే ఉంటే ప్రాథమిక పాఠశాలలకు ఒక ఉపాధ్యాయుడిని ఇస్తారు. 98 కంటే తక్కువ మంది విద్యార్థులున్న ప్రాథమికోన్నత పాఠశాలలకు స్కూల్ అసిస్టెంట్లను కేటాయించరు. అక్కడ 3 నుంచి 5 తరగతులతో పాటు 6 నుంచి 8 తరగతుల విద్యార్థులకు కూడా ఎస్జీటీలే బోధించాలి. ఈ విధానాలపై టీచర్లు నిరసనలు వ్యక్తం చేసినా ప్రభుత్వం ముందుకెళ్తోంది. రాష్ట్రంలో ఎక్కడా ఏకోపాధ్యాయ పాఠశాలలుండవని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పదే పదే హామీలిచ్చినా ఇంతవరకూ దానిపై జీవో ఇవ్వలేదు. దీంతో 20 మంది విద్యార్థులుంటే అక్కడ సింగిల్ టీచర్ మాత్రమే ఉంటారు.
*♦️విలీనంపై 1,399 అభ్యంతరాలు*
తరగతుల విలీనాన్ని వ్యతిరేకిస్తూ విద్యాశాఖకు మొత్తం 1,399 అభ్యంతరాలు అందాయి. వాటిలో 820 అభ్యంతరాలు ఎమ్మెల్యేల నుంచి, 579 జిల్లా స్థాయి నుంచి వచ్చాయి. వాటిపై పరిశీలన చేసిన జిల్లా స్థాయి కమిటీలు 649 పాఠశాలల్లో విలీన ప్రక్రియను నిలిపివేయాలని నిర్ణయించాయి. వీటిలో 380 ఎమ్మెల్యేలు అభ్యంతరాలు తెలిపిన పాఠశాలలున్నాయి. మరో 780 అభ్యంతరాలను విద్యాశాఖ పరిగణనలోకి తీసుకోలేదు. అంటే అక్కడ అభ్యంతరాలు లేవనెత్తినట్లుగా పాఠశాలలకు వెళ్లేదారిలో వాగులు, వంకలు లేవని, నిబంధనల ప్రకారం కిలోమీటరు పరిధిలోనే విలీనం చేసే పాఠశాలలు ఉన్నాయనేది జిల్లాస్థాయి కమిటీలు తమ పరిశీలనలో తేల్చాయి. దీంతో ఈ అభ్యంతరాలను పక్కన పెట్టారు.