ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) పేపర్-2ఏ స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ) ఆంగ్ల పరీక్షపై ఆగస్టు 9న అభ్యర్థులు అయోమయానికి గురయ్యారు. ఎస్ఏ ఆంగ్ల పరీక్ష ప్రశ్నపత్రంలో చైల్డ్ డెవలప్మెంట్, పెడగాజీని తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో ఇవ్వాల్సి ఉండగా.. ఒక్క ఆంగ్లంలోనే ఇచ్చారు. 30 మార్కులకు ఇచ్చిన ఈ విభాగంలో ఈ సమస్యతో విద్యార్థులు ఇబ్బందిపడ్డారు. టెట్ నోటిఫికేషన్లో రెండు భాషల్లో ప్రశ్నపత్రాన్ని ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. వెబ్సైట్లో మాక్ పరీక్షలోనూ చైల్డ్ డెవలప్మెంట్, పెడగాజీని రెండు భాషల్లో ఇచ్చారు. ఒక్క ఆంగ్లంలోనే ఇవ్వడంతో ప్రశ్నలను అర్థం చేసుకోవడం ఇబ్బందిగా మారిందని అభ్యర్థులు వాపోయారు. స్కూల్‌అసిస్టెంట్ ఆంగ్ల పరీక్షలో చైల్డ్ డెవలప్మెంట్, పెడగాజీ ఒక్క ఆంగ్ల మాధ్యమంలోనే ఉంటుందని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్‌కుమార్ వివరణ ఇచ్చారు. వైయస్ఆర్ జిల్లాలో మంగళవారం జరిగిన పరీక్షలో తెలుగు మీడియం రాయాల్సిన అభ్యర్థులకు పేపరు ఆంగ్లంలో వచ్చింది. ఇంగ్లిష్ స్కూల్ అసిస్టెంట్‌కు 90 మార్కులు ఆంగ్లం, 30 మార్కులు తెలుగు, 30 మార్కులు సైకాలజీ విభాగానికి కేటాయించారు. తెలుగుమీడియం అభ్యర్థులకు సైకాలజీ పేపరు ఆంగ్లంలో రావడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. కడప ఆర్జేడీ వెంకటకృష్ణారెడ్డిని వివరణ కోరగా ఇంగ్లిష్ స్కూల్ అసిస్టెంట్ రాసే అభ్యర్థులు తెలుగు తప్ప మిగతా సబ్జెక్టులన్నీ ఆంగ్లంలోనే రాయాలని, అందుకే ఇంగ్లిష్‌లో పేపరు ఇచ్చామని రాష్ట్ర విద్యాశాఖ ప్రతినిధులు చెప్పినట్లు వివరించారు.
టెట్ ఎస్ఏ ఆంగ్ల పరీక్షపై అభ్యర్థుల్లో అయోమయం
You might also check these ralated posts.....