📚 *లిమిటెడ్ రిక్రూట్మెంట్ DSC గురించి*
*బ్యాక్ లాగ్ పోస్టులు ఏమిటి?*
సాధారణంగా డియస్సీతో పాటు ఇతర ఉద్యోగాల భర్తీ ప్రక్రియలు అన్నీ రోస్టర్ కమ్ మెరిట్ ఆధారంగా ఆయా రిజర్వేషన్ల ఆధారంగా జరుగుతూ ఉంటాయి. కొన్ని జిల్లాలలో, కొన్ని సబ్జక్టులలో, కొన్ని రిజర్వేషన్ వర్గాల వారు తగిన అర్హతలు కలిగిన వారు లేకుండా ఉంటారు. అప్పుడు ఆయా వర్గాలకు చెందిన పోస్టులు రిక్రూట్మెంట్ లో భర్తీ కాక మిగిలిపోతూ ఉంటాయి. ఆయా పోస్టులను అదే వర్గానికి చెందిన అభ్యర్థుల చేత మాత్రమే ఫిల్ చేయాలన్న నిబంధన ఉండటం, ఆ వర్గాలకు చెందిన అభ్యర్థులు లేకపోవడం మూలంగా మిగిలిపోయే పోస్టులను బ్యాక్ లాగ్ పోస్టులు అంటారు. ఉదాహరణకు ఒక జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ బయాలజీ పోస్టులలో రెండు పోస్టులు వినికిడి లోపం గల దివ్యాంగులకు కేటాయించారనుకుందాం. డిగ్రీ +BEd (బయాలజీ) చేసిన వినికిడి లోపం గల దివ్యాంగులు అందుబాటులో లేకపోతే ఆ పోస్టులు భర్తీ కాక ఖాళీగా మిగిలిపోతాయి. అటువంటి పోస్టులనే బ్యాక్ లాగ్ పోస్టులు అంటారు.
*నోటిఫికేషన్ ఎవరికోసం? ఏ వర్గాలకు చెందిన పోస్టులు ఉన్నాయి?*
ఈ నోటిఫికేషన్ ను నిశితంగా గమనించినపుడు ఇది పూర్తిగా దివ్యాంగులు, మైనర్ మీడియంలకు చెందిన వారికి సంబంధించిన డియస్సీ. దాదాపుగా ఉన్న పోస్టులలో 99% పోస్టులు OH (Orthopaedically Handicapped – శారీరక వికలాంగులు), VH (Visuvally Handicapped – దృష్టిలోపం కలవారు), HH (Hearing Handicapped . వినికిడి లోపం కలవారు) మరియు ఉర్దూ, తమిళం, కన్నడం, ఒరియా, సంస్కృతం మీడియంలకు బోధించే అర్హతలు కలిగిన వారికి మాత్రమే ఉన్నాయి.
కనుక సాధారణ SC, ST, BC మరియు OC అభ్యర్థులకు ఈ డియస్సీ రాయడానికి అవకాశం లేదు. ఒకవేళ రాసినా ఉద్యోగం ఇవ్వరు. కనుక దీన్ని రెగ్యులర్ డియస్సీ అని పొరపాటు పడకండి.
👉ఒక సారి నోటిఫికేషన్ మీరు కూడా గమనించండి.
🔸మైనర్ మీడియం అంటే ఏమిటి?
మన రాష్ట్రం పలు ఇతర రాష్ట్రాలతో సరిహద్దులను కలిగి ఉంది. ఆయా సరిహద్దు ప్రాంతాలలో మన రాష్ట్ర తెలుగు భాషతో పాటుగా, ప్రక్క రాష్ట్రాల భాషలు అయిన తమిళం, ఒరియా, కన్నడ, ఉర్దూ వంటి భాషలను మాట్లాడుతూ ఉంటారు. కనుక ఆయా ప్రాంతాలలో ఆయా భాషలకు అనుగుణంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక పాఠశాలలను నడుపుతున్నది. ఉదాహరణకు ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో ఉర్దూ పాఠశాలలు కనిపిస్తాయి. తమిళనాడుకు సరిహద్దున ఉన్న చిత్తూరు ప్రాంతంలో తమిళ పాఠశాలలు, కర్ణాటక సరిహద్దు ప్రాంతాలైన కడప, అనంతపురం జిల్లాలలో కన్నడ పాఠశాలలు, ఒడిశా తో సరిహద్దు జిల్లాలు అయిన విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాలలో ఒరియా పాఠశాలలు ఉన్నాయి. అక్కడ బోధించే ఉపాధ్యాయులు కూడా ఆయా భాషలలో చదువుకుని, బిఈడీ చేసి ఉండాలి. అయితే ఆ తరహా అభ్యర్థులు ఎక్కువగా లేకపోవడం మూలంగా పోస్టులు భర్తీకాక మిగిలిపోతూ, ఇలా రిక్రూట్మెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాయి.