పరిశోధక ఔత్తరాహికుడు డా. కె.ముత్యం
ప్రజా ఉద్యమాలు సృష్టించుకున్న, ప్రజలు మెచ్చిన సాహిత్య చరిత్రకారుడు డాక్టర్ కె.ముత్యం. నిజామాబాదు జిల్లాలోని బాచినపల్లిలో పుట్టి మధ్యలో ఉస్మానియా యూనివర్సిటీలో మెరిసి, ఆరోగ్యాన్ని
నిజామాబాద్ పల్లెలో జన్మించి, ఉస్మానియా విశ్వవిద్యాలయం మేధో పాదుల్లో పెరిగి, ఉత్తర భారతావనిలోని ప్రతిష్ఠాత్మక బెనారస్ వర్శిటీలో ఉత్తరాంధ్ర అరుణోదయం– చరిత్రాత్మక శ్రీకాకుళ గిరిజనుల తిరుగుబాటు– ప్రభావాలు తెలుగు సాహిత్యంలో ప్రతిఫలించిన తీరుతెన్నులను తరచి చూచిన తెలంగాణీయుడు డాక్టర్ కె. ముత్యం (1958–2024). ఉత్తరాంధ్ర ప్రజా పోరాటాలు, సాహిత్య సంస్కృతులపై ఆయన మొత్తం 11 పుస్తకాలు వెలువరించారు. ఆయన పరిశోధక కృషికి మరో ప్రగాఢ ప్రేరణ ఉత్తర తెలంగాణ.
ప్రజా ఉద్యమాలు సృష్టించుకున్న, ప్రజలు మెచ్చిన సాహిత్య చరిత్రకారుడు డాక్టర్ కె.ముత్యం. నిజామాబాదు జిల్లాలోని బాచినపల్లిలో పుట్టి మధ్యలో ఉస్మానియా యూనివర్సిటీలో మెరిసి, ఆరోగ్యాన్ని సైతం పణంగా పెట్టి ఉత్తరాంధ్రలోని బారువా వరకు ప్రయాణించి నిరంతర సాహిత్య పరిశోధనతో భావితరాలకు ఎంతో మేధో సంపదను సమకూర్చిపెట్టిన అక్షర కృషీవలుడు ముత్యం. తనదైన సిద్ధాంత నిబద్ధత ఆయన్ను ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ తెలుగు పూర్తి చేసుకొని, పిహెచ్డి కోసం బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం వైపు నడిపించింది. అక్కడ ఆయన ‘శ్రీకాకుళం ఉద్యమం–తెలుగు సాహిత్యంపై దాని ప్రభావం’ అనే అంశంపై పరిశోధన చేసి 1990లో ‘బెస్ట్ థీసీస్’ అవార్డుతో పిహెచ్డి పట్టాను పొందారు. శాతవాహన యూనివర్సిటీలో తెలుగు అధ్యాపకులుగా చేరిన ముత్యం జీవిత పర్యంతం ఒక అవిరామ పరిశోధనా తపస్వి. ముత్యం పరిశోధనలు, రచనలు రెండు భాగాలుగా మనం చూడవచ్చును. 1) ఉత్తరాంధ్ర సాహిత్య పరిశోధనా–రచనలు; 2) తెలంగాణ ప్రాంత రచనలు, సేకరణలు, సంపాదకత్వ కృషి. ఈ కృషిలో తెలుగునాట ఆయన వెళ్లని గ్రంథాలయం లేదు అనడంలో అతిశయోక్తి లేదు. ‘శ్రీకాకుళ ఉద్యమానికి మూలమైన ఉద్యమాలు, ప్రభావశీలుర జీవిత కథలు, గాథలు తవ్వి తీసే పరిశోధనలో సుదీర్ఘకాలం నిమగ్నమైనారు. ముఖ్యంగా ఆ ఉద్యమానికి పునాది వేసిన రైతు ఉద్యమకారులు మార్పు పద్మనాభం, గానుగుల తరుణాచారి, జెండాలు గవరయ్య జీవితాల్లోకి వెళ్ళి ‘ఈ ముగ్గురు ఒక్కరే’ పేరుతో పుస్తకం రాశారు.
అంతేకాదు, స్వాతంత్ర్య ఉద్యమంలో ‘మాకొద్దీ తెల్ల దొరతనం’ అంటూ గర్జించిన స్వాతంత్ర్య ఉద్యమ కవి గరిమెళ్ళ సత్యనారాయణ అముద్రిత రచనలు సైతం ఎంతో కష్టపడి సాధించి పుస్తకం రూపంలో వెలుగులోకితెచ్చారు. శ్రీకాకుళం ఉద్యమానికి ప్రేరణగా నిలిచిన ఉత్తరాంధ్ర ప్రజా నాయకుల మరుగున పడ్డ చరిత్రలు వెలికితీయడానికి ఆయన పడ్డ శ్రమ అంతా ఇంతా కాదు. ఆ క్రమంలోనే జాతీయోద్యమనేత, శ్రీకాకుళం దళిత కవి ‘సిల్లా రాజులురెడ్డి’ జీవితం, కవిత్వం పుస్తకం తెచ్చారు. శ్రీకాకుళ ఉద్యమం సృష్టించిన సాహితీవేత్త, పాటకు ప్రాణం పోసిన త్యాగజీవి సుబ్బారావు పాణిగ్రాహి కుటుంబసభ్యులను వెతికి పట్టుకొని, ఇంటర్వ్యూలు చేసి ఆ విప్లవ కవి జీవిత కథ, సాహిత్య చరిత్రను అందించిన ఘనత ముత్యందే! అదే కోవలో శ్రీకాకుళం ఉద్యమానికి ముందు ప్రజా ఉద్యమ కెరటంగా వెలుగొందిన కళింగాంధ్ర తేజం ‘పుల్లెల శ్యామసుందర్రావు జీవిత చరిత్రనూ రాశారు. స్వాతంత్ర్యోద్యమ కాలంనాటి సంఘ సంస్కర్త బంకుపల్లె మల్లయ్యశాస్త్రి జీవిత గాథనూ రాశారు. 28 ఏళ్ళకే గొప్ప ప్రజానాయకుడుగా, రైతు ఉద్యమ నేతగా ఎదిగిన ఆదర్శ కమ్యూనిస్టు గంటి రాజేశ్వరరావు జీవితాన్ని శోధించి ‘ప్రవహిస్తున్న జ్ఞాపకం’ అనే ఒక గొప్ప గ్రంధాన్ని మనకు అందించారు. ఆయన తవ్వి తీసిన జీవిత గాథలు అన్నీ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో శ్రీకాకుళం గిరిజన రైతాంగ పోరాటానికి ఊపిరిపోసిన వారివే కావడం విశేషం! మందస రైతాంగ పోరాటచరిత్రను ‘సునాముది జీవధార’గా మనకందించారు. ఉత్తరాంధ్ర ప్రజా ఉద్యమాలపై ముత్యం మేధో కృషి 11 విలువైన గ్రంధాలుగా ఫలించి, సార్థకమయింది
ముత్యం పరిశోధనా కృషిలో మరో కోణానికి ఆలంబన తెలంగాణ. శాతవాహన యూనివర్సిటీ ప్రచురించిన ఉత్తర తెలంగాణ చరిత్ర–సంస్కృతి, ‘ఉత్తర తెలంగాణ పల్లె, సంస్కృతి’, ‘తెలంగాణ అలభ్య శాసనాలు, గ్రంథాలు’ అనే పుస్తకాలు ముత్యం సంపాదకత్వంలో వెలువడ్డాయి. తెలంగాణ కళాకారిణి చిందుల ఎల్లమ్మను ఇంటర్వ్యూ చేసి ఆమె జీవిత వివరాలను ‘నేను చిందు ఎల్లమ్మను’, ‘చిందుల ఎల్లమ్మ యాది’గా గ్రంథస్థం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంలో ఆయన రాసిన ‘చిందుల ఎల్లమ్మ’ను తెలుగు అకాడమీ ప్రచురించింది. ఈ గ్రంథానికి 2007లో తెలుగు యూనివర్సిటీ పురస్కారం లభించింది. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, కష్టాల కొలిమిలో, త్యాగాలు చాళ్ళు పోసిన చిత్రకారుడు ఫణిహారం రంగాచారి జీవిత చరిత్రను ‘మట్టి రంగును ఎంచుకొన్న కుంచె’ పేరుతో వెలువరించారు. ఇక సొంత జిల్లా నిజామాబాదుపై స్వతస్సిద్ధ మమకారంతో ముత్యం జిల్లా అంతా తిరిగి పల్లె ప్రజల్లో నానుడిగా ఉన్న సామెతలను సేకరించి ‘తెలంగాణ శాస్త్రాలు’ అనే పేరుతో ఓ పుస్తకం ప్రచురించారు. స్వగ్రామానికి చెందిన రచయిత ‘అగ్ని పూలు’ పత్రికా సంపాదకులు స్వయం ప్రకాష్‌తో కలిసి ‘బాచినపల్లి’ పేరుతో తన కన్న ఊరు ఇతిహాసాన్ని వెలుగులోకి తెచ్చారు. చరిత్రాత్మక తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి, దానికి ఆయువుపట్టు అయిన ఆంధ్ర మహాసభకు నాయకత్వం వహించిన సర్వదేవభట్ల రామనాధం (ఈయన వందల ఎకరాల భూస్వామి. అయినప్పటికీ దున్నేవానికే భూమి అన్న కమ్యూనిస్టు పార్టీ పిలుపునకు స్పందించి తన భూమి ఆసాంతం సబ్బండ వర్గాలకు పంచిపెట్టిన త్యాగశీలి) చరిత్రను కమ్యూనిస్టు పార్టీలు సైతం విస్మరించినా ఎంతో శ్రమకోర్చి మిత్రుడు శివలింగంతో కలిసి ‘కష్టాల కొలిమి, త్యాగాల పునాది, సర్వదేవభట్ల రామనాధం చరిత్ర’గా ఈ తరం వారికి ప్రజలకు అందించగలిగారు. అదే విధంగా ఖమ్మం జిల్లాలోని పిండిప్రోలు గ్రామం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి ఒక ప్రధాన స్థావరంగా ఉండేది. ఎందరో యోధులు ఆ గ్రామం కేంద్రంగా రజాకార్ల, యూనియన్ సైన్యంపై పోరాడి అసువులు బాసారు. ఆ గ్రామ చరిత్రను సైతం శోధించి రాయడం ముత్యం మాత్రమే చేయగలిగిన పని. అలాగే గిరిజన యోధుడు సోయం గంగులు జీవితాన్ని నవలీకరించారు. ముత్యం రచనా శైలి విశిష్టమైనది, విలక్షణమైనది. సరళతరంగా ఉండి సామాన్యుడికి సైతం చదవాలనే ఆసక్తి కలిగించేలా ఉంటుంది. వందేళ్ళ క్రితం జీవించిన ఓ వ్యక్తి జీవితం చిత్రించాలన్నా, లేక నాటి పోరాట గాథలు రాయాలన్నా చాలా పరిశోధన చేయవలసి ఉంటుంది. ముత్యం తన జీవిత కాలాన్ని ప్రజా ఉద్యమాల పరిశోధనకు, రచనా వ్యాసంగం కోసమే వినియోగించాడు
ముత్యం తన నాలుగు దశాబ్దాల పరిశోధనా కృషిలో వందలాది వ్యక్తులతో నిర్వహించిన ఇంటర్వూలు ఉన్నాయి. చరితార్థుల కుటుంబాలతో ఆయనకు ఏర్పడిన అనుబంధం చాలా గొప్పది. ఆయన పడ్డ శ్రమలో శ్రమైక జీవన సౌందర్యం నిండి ఉంది. మట్టిపరిమళం గుబాళిస్తుంది. ఒళ్ళు గగుర్పొడిచే చారిత్రక సన్నివేశాలకు ఆయన కల్పించిన అక్షర చిత్రాలు అద్భుతమైనవి. ఆ రచనా విధానం అనితరసాధ్యమైనది. ముత్యం సేకరించిన చారిత్రిక ఆనవాళ్లను, నిక్షిప్తం చేసిన జ్ఞాపకాలు ఛిద్రమైపోకుండా భద్రం చేసి భవిష్యత్తు తరాలకు అందించవలసిన బృహత్తర బాధ్యత విశ్వ విద్యాలయాలపై ఉన్నది. ఆ అసమాన పరిశోధనా కృషి వల్లే, డాక్టర్ కె. ముత్యం ఆగస్టు 20న మనకు శాశ్వతంగా దూరమయినా ఆయన పరిశోధనలు, పుస్తకాలు తెలుగు సమాజాలకు కలకాలం చైతన్య దివిటీలుగా వెలుగొందుతాయి
_ యన్.తిర్మల్ (ఆంధ్ర జ్యోతి సౌజన్యం)