Categories: BlogTRENDING

SITHARAM YECHURY BY TELAKAPALLI RAVI

WhatsApp Group       Join Now
Telegram Group Join Now

🚩ఆశయ పతాకమై…ఆఖరు దాకా!🚩
———– ✍️తెలకపల్లి రవి

సీతారాం ఏచూరి సి.పి.ఎం లో అత్యున్నత నాయకుడు అని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో జోహార్లర్పించింది. వామపక్ష ఉద్యమ కాంతి అని ప్రధాని నరేంద్ర మోడీ అభివర్ణించారు. ఏచూరితో సంప్రదింపుల ప్రక్రియను తాను పోగొట్టు కున్నానని ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ నివాళులర్పించారు.

స్నేహశీలి, ప్రతిభాశాలి అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రత్యేకంగా వ్యాసం రాశారు. భారత రాజకీయాలలో ఏచూరిది గౌరవ ప్రదమైన స్థానమనీ,ఇతర పార్టీలకూ అందుబాటులో వుండే ప్రజ్ఞావంతుడైన నాయకుడనీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనియాడారు.

ప్రొఫెసర్‌ సి.పి.చంద్రశేఖర్‌,ప్రబీర్‌ పుర్కాయస్థ, బదిరీ రైనా వంటి సమకాలీనులు జెఎన్‌యు కాలంలోనూ, సిపిఎం అగ్రనేతగానూ ఆయన మానవీయ వైఖరిని ఆర్ద్రంగా ప్రస్తావించారు.డజన్ల మంది సంపాదకులు, పాత్రికేయులు ఆయన ఎంతగా తమతో కలిసిపోయేవారో రాజకీయ గీత దాటకుండానే చెప్పవలసింది చెప్పేవారో అనుభవాలతో రాశారు.

పుస్తక ప్రియుడుగా,పాటల ప్రేమికుడుగా, మీడియా సినీ ప్రపంచంలో మార్పులను గమనించే జిజ్ఞాసిగా ఆయన తీరును రచయితలు, కళాకారులు నెమరేసుకున్నారు.

అదే సమయంలో ఏచూరిని ఆచరణ వాది అనీ, అన్ని పార్టీలకూ కామ్రేడ్‌ అనీ చాలా మంది వ్యాఖ్యానించారు. ఆయన పదవీ కాలం ఎదురీతగా నడిచిందన్నట్టు,ఈ పదిహేనేళ్లలో క్రమేణా మరింత క్షీణించి పోయిందన్నట్టు తెలుగులోనూ కొన్ని సంపాదకీయాలే వెలువడ్డాయి.

సి.పి.ఎం విధాన రూపకల్పనలో అంతర్గత చర్చను వ్యక్తిగతంగా నాయకుల మధ్య తేడాగా చూపే రాతలూ మాటలు సరేసరి. వ్యక్తిగతంగా ఆయనకు సంతాపం తెలుపుతూ ఆయన జీవితాంతం పోరాడిన మౌలిక సిద్ధాంతాలను తక్కువ చేసే ఒక ధోరణి కూడా కొన్నిటిలో వ్యక్తమైంది.

➡️ఉద్యమ నిబద్ధత

అటూ ఇటూ ఐ.ఎ.ఎస్‌ లు,ఇంజనీర్లు, న్యాయమూర్తుల కుటుంబంలో అత్యంత ప్రతిభావంతమైన విద్యార్థిగా ప్రారంభమైన ఏచూరి అర్థశాస్త్ర అధ్యయనం తర్వాత ప్రజా ఉద్యమానికి అంకితం కావాలని నిర్ణయించు కోవడం,ప్రకాశ్‌ కరత్‌ వంటి వారు అందుకు తోడు కావడం అత్యంత సహజం.

అగ్రశ్రేణి ప్రజ్ఞాశాలులు వామపక్ష భావాలను స్వీకరించి ప్రజల కోసం పని చేయడం ప్రపంచ వ్యాపితంగా జరిగింది. ‘ఒక దాహార్తుడు మంచి నీటి కోసం వచ్చినట్టు తాను ప్రతి ఏటా కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వాన్ని పునరుద్ధరించుకోవడానికి వస్తానని’ ప్రసిద్ధ చిత్రకారుడు ప్లాబో పికాసో అనేవారని ఏచూరి ఎప్పుడూ గుర్తుచేసే వారు. ఆ కోవలోనే ఆయన సార్థక జీవితం గడిపారు.

ఐసియు నుంచి పంపిన ఆఖరి సందేశం కూడా పాలస్తీనా విముక్తి పోరాటం గురించి కావడం యాదృచ్ఛికం కాదు.మీరు ఓడిపోతే ఎవరితో కలుస్తారు అని ఒక ఇంటర్వ్యూలో బర్కాదత్‌ అడిగితే ‘నేను విజయం సాధించ గలననే నమ్మకంతో పోరాడుతున్నాను. ఓడిపోతే ఏం చేస్తావని మీరడిగితే ఎందుకు జవాబు చెప్పాలి?’ అని ఎదురు ప్రశ్న వేశారు.

జెఎన్‌యు విద్యార్థి నాయకుడుగా ఇందిరా గాంధీతో రాజీనామా చేయించడం ఆయన మొదటి విజయమైతే మతతత్వ రాజకీయాలపై పోరాటంలో విశాల ఐక్యతను పెంపొందించి బిజెపికి మెజార్టీ రాకుండా చేయడంలో ఫలప్రదం కావడం ఆయన ఆఖరి కీలక చొరవ.

➡️నాలుగు దశాబ్దాల నడక

నిర్దిష్ట పరిస్థితులకు నిర్దిష్ట అన్వయం అనే మార్క్సిస్టు మూల సూత్రం పాటించడం, అధ్యయనాలు, ఘన విజయాలతో పాటు ఎదురు దెబ్బలూ ప్రతికూలతలూ అధిగమిస్తూ ముందుకు పోవడం ఏచూరి రాజకీయ జీవిత గమనంలో కీలకాంశమని వ్యాఖ్యాతలు గుర్తించవలసి వుంటుంది.

మోడీ కాలానికే పరిమితమై పాఠాలు తీస్తే కుదరదు. 1977లో ప్రజలు తిరస్కరించిన ఇందిరా గాంధీ 1980లో తిరిగి అధికారానికి వచ్చారు. 1984లో ఆమె హత్య ప్రభావంతో రాజీవ్‌ గాంధీ 400 పైన స్థానాలతో ప్రధాని అయ్యారు. 1985లో ప్రకాశ్‌ కరత్‌,సీతారాం ఏచూరి వంటి వారు సిపిఎం నూతన తరం నాయకులుగా బాధ్యతలలో తొలి అడుగు వేసినప్పటి పరిస్థితి అది.

రాజీవ్‌ గాంధీ తర్వాతి ఎన్నికలలోనే ఓటమి పాలై నేషనల్‌ ఫ్రంట్‌ అనే లౌకిక కూటమి అధికారంలోకి వచ్చింది.వి.పి. సింగ్‌ ప్రభుత్వంలో బిజెపి చేరకుండా ఆపగలగడం, రథయాత్రను షరతుగా ఆ పార్టీ మెడ మీద కత్తి పెడితే అడ్డుకుని అధికారాన్ని వదులుకోవడం వెనక వామపక్షాల పాత్ర చాలా వుంది.

జాతీయ రాజకీయాలలో అప్పటి సిపిఎం ప్రధాన కార్యదర్శి హరికిషన్‌ సింగ్‌ సూర్జిత్‌, జ్యోతిబసుతో పాటు ఏచూరి ప్రవేశించడం వేగం పుంజుకుంది.ఇంత సుదీర్ఘ కాలం పాటు జాతీయ రాజకీయ రంగంలో లౌకిక కూటముల ఏర్పాటు వ్యూహ ప్రతివ్యూహాలలో ప్రత్యక్ష పాత్ర వహిస్తూ వస్తున్న వారు బహుశా ఎంతో మంది వుండరు.

విధాన స్పష్టతతో పాటు వ్యక్తిగత స్నేహ సంబంధాలు, పట్టు విడుపులతో వ్యవహరించే ఏచూరి స్వభావం అందుకు గొప్పగా దోహడపడింది. వృద్ధ నాయకులతో పాటు యువతరంతోనూ సులభంగా కలసి పోవడమే ఆయనను మరింత జన ప్రియుణ్ని చేసింది.

➡️కీలక విధాన పత్రాలు

విజయ పరంపరలు సాధిస్తున్నప్పుడు రాజకీయాలు నడపడం పెద్ద సమస్య కాదు. పరిస్థితులు ప్రతికూలంగా మారినప్పుడు సిద్ధాంత స్ఫూర్తిని నిలబెట్టడం పెద్ద సవాలు.

90వ దశకం ప్రారంభం నుంచి మతతత్వ రాజకీయాలు పెరగడం,పాలక పార్టీల అవకాశవాద రాజకీయాలు లౌకిక ప్రజాస్వామ్యానికి పెను సవాలు విసిరాయి. అంతర్జాతీయంగా సోషలిస్టు శిబిరం ఎదురు దెబ్బ తినడం అశనిపాతమైంది. దాన్ని వెంటనంటి దేశంలోనూ సరళీకరణ విధానాలు, ద్రవ్య పెట్టుబడి విజృంభణ రాజకీయాల స్వరూపమే మార్చివేశాయి.

Related Post

ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో సైద్ధాంతికం గానూ దిశా నిర్దేశం చేయడంలో ఏచూరి వంటి వారి పాత్ర చాలా ప్రధానమైంది. సోవియట్‌ విచ్ఛిన్నం తర్వాత వెనువెంటనే మద్రాసులో జరిగిన 14వ మహాసభలో సైద్ధాంతిక సమస్యలపై తీర్మానం ప్రవేశపెట్టే బాధ్యత ఏచూరికి అప్పగించడమే ఇందుకు నిదర్శనమైంది. అప్పటికి మాకినేని బసవపున్నయ్య, జ్యోతిబసు, ఇ.ఎం.ఎస్‌, సూర్జిత్‌ వంటి హేమాహేమీలు వున్నారని గుర్తుంచుకోవాలి.

2012లో మారిన పరిస్థితులకు తగినట్టు తాజాపర్చిన సిపిఎం కార్యక్రమాన్ని సమర్పించే పని కూడా ఆయనే నిర్వహించారు. అంతర్జాతీయ విభాగం బాధ్యుడుగా దేశ దేశాల కమ్యూనిస్టు ఉద్యమాలు, ప్రగతిశీల శక్తులతో సంబంధాలు, ఆయనకు అపారమైన అవగాహన, సమగ్ర సమాచారం చేరుతుండేది. ఆ విధంగా ఆయన విశ్వ విప్లవ నరుడు!

➡️పదునైన ప్రచారం

1992-93 తర్వాత ముదిరిన మత శక్తులపై ప్రత్యేక అధ్యయనం చేసి హిందూ రాష్ట్ర సిద్ధాంతం, దేశ సాంస్కృతిక వైవిధ్యంపై దాడి వంటి అంశాలను ఆయన ప్రతిభావంతంగా ముందుకు తెచ్చారు. గాట్‌, పేటెంట్ల పెత్తనం వంటి ఆర్థికాంశాలనూ విడమర్చి చెప్పగలిగారు.

ఆ ఇరవయ్యేళ్లలో ఆయన పీపుల్స్‌ డెమోక్రసీ సంపాదకుడుగానూ అనేక విధాల ప్రయోజనకరమైన సమాచారాన్ని అందుబాటు లోకి తెచ్చారు. బయిటి పత్రికల్లోనూ రాస్తూ వచ్చారు.చానళ్ల విషయానికి వస్తే ఆయన తొలి నుంచి పరిచితమైన వ్యాఖ్యాత. దేశ రాజధానిలోని మేధా బృందాలు, కళాకారులతో ప్రత్యేక సంబంధాలు పాటిస్తూ భిన్న స్రవంతుల స్పందనలను గమనించడంలో ఆయన చాలా శ్రద్ధ పెట్టేవారు.

బాబ్రీ విధ్వంసం తర్వాత ఇలాంటి వారెవరో ఎదురుపడి అడిగితే సరదాగా ‘వినిర్మాణం’ (డికన్‌స్ట్రక్షన్‌) అంటూ ఆధునికానంతర వాదంలో వాడే పదాన్ని ప్రయోగించారట. అదో చర్చ అయింది. మామూలూ భాషలో మాట్లాడుతూనే రాజ్యాంగ కోణాలు, సామాజిక వైరుధ్యాలు, అభివృద్ధి నిరోధక సవాళ్లు,ప్రపంచీకరణ ప్రభావాలు కళ్లకు కట్టినట్టు చెప్పడానికి ఆయన మేధస్సు కారణమైంది.

మనోభావాల పేరిట ఈ పదాలను అడ్డుపెట్టుకుని రాజకీయం నడిపే వారిని నిలదీయడానికి ఇదే దారితీసింది.సామాజిక న్యాయంకోసం పోరాటం అవసరాన్ని ఎప్పుడూ గుర్తించడమే గాక అంబేద్కర్‌ మాటలను ఉటంకిస్తుండేవారు.

1993లో నేను విజయవాడ ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడుగా మీట్‌ ద ప్రెస్‌కు పిలిస్తే ఆయన తాను చిన్నప్పుడు సంధ్యావందనంతో మొదలెట్టానని చెప్పడం,ఈనాడు మిత్రులు ప్రముఖంగా రాయడం అందరినీ ఆకర్షించింది. మనువాదంపై పోరాటం గురించి చెప్పడానికే ఈ ప్రస్తావన తెచ్చారు.

2017లో ఇదే రాజ్యసభలోనూ ప్రస్తావించి తన భార్య, ఆమె తలిదండ్రులు వేర్వేరు మతాలకు, రాష్ట్రాలకూ చెందిన వారనీ, ఇప్పుడు తన కొడుకును భారతీయుడుగా తప్ప మరేమని పిలవగలమని ప్రశ్నిస్తే చప్పట్లు మోగాయి. ఈ విధంగా భారత దేశం అనే భావన చర్చ తీసుకురావడం లోనూ చాలా సృజనాత్మకత కనిపిస్తుంది.

ఇప్పుడు పాలక పార్టీలు అవకాశవాదం కొంతైనా తగ్గించుకుని మత రాజకీయాలను విమర్శిస్తూ మాట్లాడుతున్నారంటే అది ఇలాటి కృషి ఫలితమేనన్నది నిర్వివాదాంశం.

తనను నాయకుడిని చేసిన జె.ఎన్‌.యుపై మోడీ సర్కారు ఉక్కుపాదం మోపినపుడు జరిగిన రాజ్యసభ చర్చలో షేక్‌స్పియర్‌ భాషలో నాటి మంత్రి స్మృతి ఇరానీకి జవాబిచ్చిన తీరు ఎవరూ మర్చిపోరు.

ఎ.పి విభజన హడావుడిగా ఆమోదించ వద్దని సావధానంగా చర్చించాలని నాడు ఆయన పట్టుపట్టిన తీరు ఎంత అర్థవంతమో ఇప్పటికీ అపరిష్కృతంగా వున్న విభజన సమస్యలను చూస్తే తెలుస్తుంది.

కొన్నేళ్ల కిందట సిపిఎంలో విభేదాల గురించి, తన బాధ్యతల గురించి మీడియాలో అదేపనిగా ఊహాగానాలు సాగుతున్నప్పుడు కూడా సూటిగానూ సున్నితంగానూ సమాధానమిచ్చి ముగించిన ఏచూరి చివరకు-ప్రధాన కార్యదర్శిగానే జీవితం ముగించిన మొదటి నేత అయ్యారు.

➡️తెలుగింటి బిడ్డగా…

బెంగాలీ,తమిళం,మరాఠీ,హిందీతో సహా బహు భాషా కోవిదుడైన ఏచూరి తెలుగు బిడ్డ కావడం ప్రత్యేకంగా గర్వకారణమైన విషయం. దేశ భాషలందు తెలుగు లెస్స అన్న పద్యం మూలాలను గురించి చర్చించిన సందర్భం నాకింకా గుర్తుంది. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత కేతు విశ్వనాథరెడ్డి ప్రత్యేకించి తన పుస్తకానికి ఆయనతో ముందుమాట రాయించు కున్నారు.శాస్త్రీయ సంగీతంలో ముగ్గురు ప్రముఖులు దక్షిణాది వారే కావడంపై ఆ ముందుమాటలో ప్రస్తావించడం చాలా చర్చ అయింది.

చెన్నై,కాకినాడ నుంచి హైదరాబాద్‌ వరకూ ఏచూరివే. ప్రతి సభలోనూ తాము ఢిల్లీలో వుండిపోవడం వల్ల సరైన తెలుగు మాట్లాడ లేనంటూ మొదలు పెట్టినా అదో ఆకర్షణీయ మైన భాష మాట్లాడేవారు.

‘మన రక్తం ఎర్రగా వున్నంత వరకూ ఎర్ర జండా ఎగురుతుంటుందని’ ఆయన అనే మాటతో చప్పట్లు మోగిపోయేవి.బస్సులో మన డబ్బులు కొట్టేసిన దొంగే మళ్లీ టికెట్టు కొనిచ్చి సహాయం చేసినట్టు పోజు పెట్టే కథ కూడా తప్పనిసరి.పాలకుల తీరుకు ఉదాహరణగా ఇది చెప్పేవారు.ఇలాంటి తమాషాలెన్నో. అసలు ఆయన ఎంట్రీయే ఏదో ఒక చలోక్తితో జరిగేది.

➡️1980 నుంచీ..

1980లో ఏచూరి విజయవాడలో ఎస్‌.ఎఫ్‌.ఐ రాష్ట్ర మహాసభలకు హాజరైన నాటి కవరేజి నుంచి వ్యక్తిగతంగానూ ప్రజాశక్తి పరంగానూ ఆయనతో ఎన్నో మంచి జ్ఞాపకాలున్నాయి. ప్రతి అఖిల భారత మహాసభల్లో ఆయనతో ఒక ఇంటర్వ్యూ తీసుకోవడం తప్పనిసరిగా వుండేది. అర్థశాస్త్రం పాఠాలకు పేరుపొందిన మా నాన్న పుస్తకం 2012 ఖమ్మం మహాసభలో ఏచూరితో ఆవిష్కరింపచేయాలని అడిగితే వెంటనే ఒప్పుకోవడమే గాక రాజకీయ అర్థశాస్త్రం ప్రాథమిక సూత్రాల ప్రాధాన్యత ఏంటో గొప్పగా వివరించారు.

మా కుటుంబానికి సంబంధించిన ఒక ప్రత్యేక సహాయం అడిగితే వెనువెంటనే చేయడం ఎప్పటికీ మర్చిపోలేము. తన ప్రజ్ఞా పాటవాలనూ శక్తియుక్తులనూ ప్రజల కోసం ఉద్యమాలకు అంకితం చేయడం తప్ప స్వంతానికి ఏమీ కోరుకోని ఏచూరి వంటి వారి గురించి ఎన్ని, ఎంత రాసినా ఇంకా మిగిలే వుంటాయి. ఆయనకిదే నివాళి. ఆ అధ్యయనం, ఆచరణ, సమగ్ర మానవీయ కోణం సదా అనుసరణీయం. సవాళ్లను ఎదుర్కోవడానికీ అదే మార్గం.

@ప్రజాశక్తి దినపత్రిక నుండి సేకరణ

sikkoluteachers.com

Recent Posts

NMMS MODEL GRAND TEST – 7

NMMS MODEL GRAND TEST - 7NMMS MODEL GRAND TEST - 7HOW TO ATTEMPT AP NMMS… Read More

November 20, 2024

NMMS MODEL GRAND TEST – 6

NMMS MODEL GRAND TEST - 6NMMS MODEL GRAND TEST - 6HOW TO ATTEMPT AP NMMS… Read More

November 19, 2024

NMMS MODEL GRAND TEST – 5

NMMS MODEL GRAND TEST - 5NMMS MODEL GRAND TEST - 5HOW TO ATTEMPT AP NMMS… Read More

November 17, 2024

NMMS MODEL GRAND TEST – 4

NMMS MODEL GRAND TEST - 4NMMS MODEL GRAND TEST - 4HOW TO ATTEMPT AP NMMS… Read More

November 17, 2024

NMMS MODEL GRAND TEST – 3

NMMS MODEL GRAND TEST - 3NMMS MODEL GRAND TEST - 3HOW TO ATTEMPT AP NMMS… Read More

November 15, 2024

NMMS MODEL GRAND TEST – 2

NMMS MODEL GRAND TEST - 2NMMS MODEL GRAND TEST - 2HOW TO ATTEMPT AP NMMS… Read More

November 14, 2024

NMMS MODEL GRAND TEST – 1

NMMS MODEL GRAND TEST - 1 NMMS MODEL GRAND TEST - 1 HOW TO ATTEMPT… Read More

November 13, 2024

‘PAPER CUTTING’ NMMS MENTAL ABILITY ONLINE TESTS

'PAPER CUTTING' NMMS MENTAL ABILITY ONLINE TESTS re you preparing for the NMMS exam? Do… Read More

November 13, 2024

‘ANALYTICAL REASONING’ NMMS MENTAL ABILITY ONLINE TESTS

'ANALYTICAL REASONING' NMMS MENTAL ABILITY ONLINE TESTS re you preparing for the NMMS exam? Do… Read More

November 11, 2024

‘SHAPE CONSTRUCTION’ NMMS MENTAL ABILITY ONLINE TESTS

'SHAPE CONSTRUCTION' NMMS MENTAL ABILITY ONLINE TESTS re you preparing for the NMMS exam? Do… Read More

November 10, 2024