Gaddar: గర్జించిన గద్దర్ గళం మూగబోయింది!

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

Gaddar: గర్జించిన గద్దర్ గళం మూగబోయింది!

ప్రజా యుద్ధనౌక గద్దర్ ఇకలేరు. గుండె సంబంధిత రుగ్మతతో ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. గద్దర్ అసలు పేరు గుమ్మడి విఠల్ రావు. తన పాటలతో ప్రజా జీవితాలను ప్రభావితం చేశారు. ప్రభుత్వాలను కదిలించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో గద్దర్ పాడిన ‘పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న గానమా..’ పాట ఉద్యమాన్ని ఉరకలెత్తించింది

Gaddar death


గుమ్మడి విఠల్ రావు….నుంచి గద్దర్ వరకు…

గద్దర్‌ 1949లో తూప్రాన్‌లో జన్మించారు. ఆయన అసలు పేరు గుమ్మడి విఠల్‌ రావు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. తన పాటలతో ఉద్యమాలకు మంచి ఊపుతెచ్చారు. 1987లో కారంచేడు దళితుల హత్యలపై గద్దర్‌ అవిశ్రాంతంగా పోరాటం చేశారు. 

నకిలీ ఎన్‌కౌంటర్లను తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ క్రమంలోనే 1997 ఏప్రిల్‌ 6వ తేదీన గద్దర్‌పై హత్యాయత్నం జరిగింది. అమ్మ తెలంగాణమా, పొడుస్తున్న పొద్దుమీద పాటలతో ఉద్యమాలకు ఊపుతెచ్చిన గద్దర్‌… నీ పాదం మీద పుట్టుమచ్చనై పాటకు నంది అవార్డు సైతం అందుకున్నారు. అయితే.. నంది అవార్డును తిరస్కరించారు. 

పొడుస్తున్న పొద్దు మీద..

తెలంగాణ ఉద్యమ సమయంలో గద్దర్ పాడిన ‘పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న గానమా.. పోరు తెలంగాణమా’ పాట ఎంతటి ప్రభావం చూపిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఉద్యమం అప్పటిదాకా ఒక ఎత్తు. ఆ పాట తర్వాత మరొక ఎత్తుగా కొనసాగింది. గద్దర్ ఆటా పాట కోట్లాది మందిని కదిలించింది. ఉద్యమాన్ని ఉరకలెత్తించింది. ‘అమ్మా తెలంగాణమా..’, ‘బండెనక బండి కట్టి..’, ‘భద్రం కొడుకో..’, ‘మదనాసుందరి’, ‘అడవి తల్లికి వందనం’ ఇలాంటి వందలాది పాటలతో ప్రభావం చూపారు గద్దర్. జనం గోసలను తన పాటల ద్వారా వినిపించారు. ‘నీ పాదం మీద పుట్టుమచ్చనై పాటకు’కు నంది అవార్డుకు ఎంపికయ్యారు గద్దర్. కానీ, నంది అవార్డును స్వీకరించేందుకు తిరస్కరించారు.

పీపుల్స్‌ వార్‌, మావోయిస్టు ఉద్యమం, తెలంగాణ ఉద్యమాల్లో తన గొంతు వినిపించారు గద్దర్. తన గళంతో కోట్లాది మంది ప్రజలను ఉత్తేజపరిచారు. 1987లో కారంచేడు దళితుల హత్యలపై గద్దర్‌ అవిశ్రాంతంగా పోరాటం చేశారు. నకిలీ ఎన్‌కౌంటర్లను తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ క్రమంలోనే 1997 ఏప్రిల్‌ 6న గద్దర్‌పై హత్యాయత్నం జరిగింది. నాడు మరణం అంచుల దాకా వెళ్లి, ప్రాణాలతో బయటపడ్డారు. నాటి నుంచి ఆయన శరీరంలో ఒక బుల్లెట్ అలాగే ఉండిపోయింది. ఆ బుల్లెట్‌ను తొలగించేందుకు శస్త్రచికిత్స చేస్తే, ఆయన ప్రాణాలకే ప్రమాదమని అలాగే వదిలేశారు వైద్యులు.

గద్దర్ పేరు ఎలా వచ్చింది?

1969 తెలంగాణ ఉద్యమంలోనూ గద్దర్ చురుగ్గా పాల్గొన్నారు. భావజాల వ్యాప్తి కోసం ఊరురా తిరిగి బుర్రకథలతో ప్రచారం చేసేవారు. అలా ఆయన ప్రదర్శనను చూసిన సినిమా దర్శకులు బి. నరసింగరావు.. భగత్ సింగ్ జయంతి రోజున ఒక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ప్రతి ఆదివారం ఆయన ప్రదర్శనలు ఇచ్చేవారు. 1971లో బి. నరసింగరావు ప్రోత్సాహంతో గద్దర్ ‘ఆపర రిక్షా’ పేరుతో తన మొదటి పాట రాశారు. ఆయన మొదటి ఆల్బం పేరు గద్దర్. ఇదే ఆయన పేరుగా స్థిరపడింది.

గండె సమస్య నుంచి బయటపడ్డా.. లంగ్స్ సమస్య తిరగబెట్టడంతో

గద్దర్ మృతిపై అపోలో స్పెక్ట్రా ఆస్పత్రి (అమీర్‌పేట) ఒక ప్రకటన విడుదల చేసింది. ఊపిరితిత్తులు, మూత్రపిండాల సమస్యలతో భాద పడుతూ గద్దర్ కన్నుమూశారని తెలిపింది. ‘గుమ్మడి విఠల్ రావు అలియాస్ గద్దర్ తీవ్ర గుండె సంబంధిత సమస్యతో జూలై 20న అడ్మిట్ అయ్యారు. ఆయనకు ఆగస్టు 3న బైపాస్ సర్జరీ నిర్వహించాం. దాని నుంచి ఆయన కోలుకున్నారు. అయితే, ఆయన సుదీర్ఘ కాలంగా ఊపిరితిత్తులు, మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్నారు. ఆ సమస్యలు తీవ్రమవడంతో చికిత్స పొందుతూ.. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు చివరి శ్వాస విడిచారు’ అని ఆస్పత్రి వర్గాలు ప్రకటన విడుదల చేశాయి.

error: Content is protected !!