ఏపీ ఉన్నత విద్యామండలి (AP State Council of Higher Education) సెట్స్ అడ్మిషన్ కౌన్సిలింగ్ షెడ్యూల్‌ను విడుదల చేసింది.
2023-24 విద్యా సంవత్సరానికి కౌన్సిలింగ్ తేదీలు వెల్లడిస్తూ ఉన్నత విద్యామండలి కార్యదర్శి వై.నజీర్ అహ్మద్ ప్రకటన విడుదల చేశారు. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించే ఐసెట్‌కు సెప్టెంబర్ 6వ తేదీ నుంచి, పీజీ కోర్సులకు ప్రవేశాలు కల్పించే పీజీ సెట్‌కు సెప్టెంబర్ 11వ తేదీ నుంచి కౌన్సిలింగ్ ఉంటుందని తెలిపారు.
బీపీఈడీ, యూజీడీ పీఈడీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించే పీఈసెట్‌కు సెప్టెంబర్ 17వ తేదీ నుంచి, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాల ఎల్ ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశాలు కల్పించే లా సెట్ కు సెప్టెంబర్ 26వ తేదీ నుంచి కౌన్సిలింగ్ ఉంటుంది. బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించే ఎడ్‌సెట్ కు సెప్టెంబర్ 30వ తేదీ నుంచి కౌన్సింలింగ్ ఉండగా, ఎంటెక్, ఎంఫార్మసీల్లో ప్రవేశాలు కల్పించే పీజీ ఈ సెట్ కు ఈ నెల 10వ తేదీ నుంచే కౌన్సిలింగ్ ఉంటుంది. ఇక ఏపీ ఈఏపీ సెట్ (MCET)లో నాన్ ఎన్‌ఆర్‌ఐ, క్యాట్ బీ, ఇంజినీరింగ్ కోర్సుకు నేటి నుంచి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు ఉన్నత విద్యామండలి ప్రకటన విడుదల చేసింది.