TODAY EDUCATION/ TEACHERS TOP NEWS

WhatsApp Group       Join Now
Telegram Group Join Now
*📚✍️3.98 లక్షల మంది*
*తగ్గారు!✍️📚*
*♦️సర్కారు బడికి విద్యార్థులు దూరం*
*♦️1,289 మంది మరణించారు*
*♦️అంగీకరించిన రాష్ట్ర ప్రభుత్వం*
*🌻అమరావతి, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి)*: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిందని రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. 2021-22 విద్యా సంవత్సరంలో 44,29,569 మంది విద్యార్థులు ఉండగా, ఈ ఏడాది 40,31,239 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారని పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్‌ వెల్లడించారు. సోమవారం సచివాలయంలో ఆయన మాట్లాడుతూ.. కొవిడ్‌ కారణంగా చాలా మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల్లో చేరారని తెలిపారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేశామన్నారు. పాఠశాలల విలీనం సహా, ఉపాధ్యాయుల పోస్టుల భర్తీలాంటి షరతులు ప్రపంచ బ్యాంకు పెట్టిందనడం అవాస్తవమన్నారు. గడిచిన మూడేళ్లలో పాఠశాల విద్యాశాఖలో రూ.53 వేల కోట్లకుపైగా వ్యయం చేశామన్నారు. ఒక్కరోజులోనే ఫలితాలు రావని తెలిపారు. 2022-23 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 40,31,239గా నమోదైందని, కిందటి ఏడాదితో పోలిస్తే ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్‌ విద్యా సంస్థలు అన్నింటినీ కలుపుకొని మొత్తం ఈసారి 86,199 మంది విద్యార్థులు తగ్గారన్నారు.

Related Post
ఇతర రాష్ట్రాలకు వలస పోయిన విద్యార్థులు 16,857 అని, కాలానుగుణంగా రాష్ట్రంలోనే ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వలసపోయిన వారు 38,951 మంది విద్యార్థులు ఉన్నారని చెప్పారు. 1,289 మంది విద్యార్థులు మరణించినట్లు వెల్లడించారు. అదే విధంగా రాష్ట్రంలోజనాభా పెరుగుదల తగ్గడంతో ఒకటో తరగతిలో చేరే విద్యార్థుల సంఖ్య గత విద్యా సంవత్సరంతో పోల్చుకుంటే 29,102 తగ్గినట్లు గుర్తించామన్నారు. రాష్ట్రంలో ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వలసపోయిన 38,951 మంది విద్యార్థులను గుర్తించి వారిని పాఠశాలల్లో చేర్పించేందుకు వారి వివరాలను అన్ని జిల్లాల కలెక్టర్లకు పంపామని తెలిపారు. ఇప్పటికే 12 వేల మంది విద్యార్థులను తిగిరి పాఠశాలల్లో చేర్చించామన్నారు. ఆంగ్లమాధ్యమంలో బోధనతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గలేదన్నారు. నవంబరు నెలాఖరునాటికి 8 తరగతి చదువుతున్న 4.6 లక్షల మంది విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేస్తామన్నారు. 2025 నాటికి వీరంతా సీబీఎ్‌సఈ విధానంలో పరీక్షలు రాయనున్నట్టు వెల్లడించారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
*📚✍️త్వరలో 1998*
*అభ్యర్థుల నియామకాలు✍️📚*
*♦️టెట్ డైరెక్టర్ మేరీ చంద్రిక*
*🌻మచిలీపట్నం టౌన్, అక్టోబరు 10:* రాష్ట్ర ప్రభుత్వం 1998 అభ్యర్థుల నియామకాలు త్వరలో చేపడుతుందని టెట్ డైరెక్టర్ మేరీ చంద్రిక అన్నారు. సోమవారం డీఈవో కార్యాలయంలో 1998 అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోజుకు 100 మంది అభ్య ర్థుల సర్టిఫికెట్లను పరిశీలిస్తున్నారన్నారు. సోమవారం డీఈవో కార్యా లయ సమావేశపు హాలులో అభ్యర్థుల సర్టిఫికెట్లను ఆమె పరిశీలించారు. రుక్మిణిబాయి అనే అభ్యర్థిని టైమ్ స్కేలు పనిచేస్తానని విల్లింగ్ ఇవ్వక పోవడంతో ఆమె పేరు ఎంపికైన అభ్యర్థుల జాబితాలో లేకపోవడంతో నిరాకరించారు. విజయవాడకు చెందిన 65 ఏళ్ల వృద్ధుడు ఎన్. వెంకటేశ్వర రావు ఉద్యోగం ఇప్పించాలంటూ దరఖాస్తు పట్టుకుని తన కుమారుని సాయంతో డీఈవో కార్యాలయానికి వచ్చారు. 1960 జూన్ 1వ తేదీ పుట్టిన తేదీగా ఉన్న అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించి వెంకటేశ్వరరావు | దరఖాస్తును తిరస్కరించారు. ఏడీ అజీజ్, ప్రధానోపాధ్యాయులు వైవీ హరనాథ్ తదితరులు పాల్గొన్నారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
*📚✍️కొత్త పిఆర్సిలో కోతలు వద్దు✍️📚*
*♦️ఆర్టీసి ఉద్యోగ సంఘాల జెఎసి*
*🌻ప్రజాశక్తి-అమరావతి బ్యూరో* ఆర్టిసి ఉద్యోగులకు కొత్త పిఆర్సిలో అలవెన్సులను, ఓటీలను కోత పెట్టకుండా పూర్తి స్థాయిలో కొనసాగించాలని ఆర్టిసి ఉద్యోగ సంఘాల జెఎసి డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆర్టిసి ఎమి ద్వారకా తిరుమలరావును జెఎసి కన్వీనర్లు పలిశెట్టి దామోదరరావు, వై శ్రీనివాసరావు, కో కన్వీనర్లు సిహెచ్ సుందరయ్య, వైఎస్ రావు కలిసి సోమవారం వినతిపత్రం అందజేశారు. ఆర్ టిసిలో డ్రైవర్లకు, కండక్టర్లకు, గ్యారేజ్ సిబ్బందికి చాలా కాలంగా అలవెన్స్లు, ఓటీలు ఇస్తున్నారని, ఇప్పుడు కోతలు పెట్టడం సరికాదన్నారు. మెడికల్ లీవ్ లో ఉన్న ఉద్యోగులకు కూడా కోత విధించారని వివరించారు. ఆర్టిసి ఉద్యోగుల కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఈ నెలలో కోత విధించిన అలవెన్స్లను, ఓటీలను తక్షణం వేతనంలో కలపాలని కోరారు. కార్యక్రమంలో ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు వైవి రావు, ఎన్ఎంయు రాష్ట్ర అధ్యక్షులు రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
*📚✍️సిఆర్టీ లకు షాక్!✍️📚*
*♦️పది నెలలే వేతనం*
*♦️ఈ విద్యా సంవత్సరం నుంచి తిరిగి అమలు*
*♦️రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సాకుగానిర్ణయం*
*🌻ప్రజాశక్తి- విజయవాడ ప్రతినిధి*
రాష్ట్ర ఖజానా పరిస్థితి సరిగా లేదనే పేరుతో ఆర్థిక భారాన్ని తగ్గించుకునే ఆలోచనల అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తోన్న కాంట్రాక్ట్ రెసిడెంట్ టీచర్ (సిఆర్టీ)లకు వేతనాల చెల్లింపు నెలలను కుదించింది. ఏడాది మొత్తానికి అంటే 12 మాసాలకు కాకుండా కేవలం పది నెలలకు మాత్రమే చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు వారం రోజుల క్రితం గిరిజన సంక్షేమ శాఖ అధికారులకు రాష్ట్ర ఆర్థిక శాఖ సర్క్యులర్ జారీ చేసినట్లు తెలిసింది. దీంతో, సిఆర్డిలకు ఈ విద్యా సంవత్సరం నుంచి పది నెలలకు మాత్రమే. వేతనాలు అందించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 400 వరకు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. ఇవి గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. ఇవి ఎక్కువగా గిరిజన ప్రాంతాల్లో ఉన్నాయి. గిరిజన ప్రాంతాల్లో ఆదివాసీలు ఎక్కువ సంఖ్యలో ఉండడం వల్ల గతంలో వీటిని అక్కడ ఏర్పాటు చేశారు. మూడో తరగతి
నుంచి పదో తరగతి వరకు విద్యార్థులు వీటిల్లో ఆశ్రమం పొందుతూ విద్యను అభ్యసిస్తుంటారు. వీటిల్లో రెగ్యులర్ ఉపాధ్యాయులతోపాటు సిఆర్డిలు కూడా విధులు నిర్వహిస్తుంటారు. దాదాపు వెయ్యి మంది వరకు సిఆర్డిలు ఆశ్రమ పాఠశాలల్లో పని చేస్తున్నారు. వీరికి గిరిజన సంక్షేమ శాఖ ద్వారా వేతనాలు చెల్లిస్తున్నారు. రెగ్యులర్ ఉపాధ్యాయులకు మాదిరిగా సిఆర్డిలకు ప్రభుత్వం ఏడాదిలో పది నెలలు మాత్రమే జీతాలు చెల్లించేది. 12 నెలలూ వేతనాలు చెల్లించాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. కోవిడ్ సమయంలో ప్రభుత్వం దీనిపై సానుకూల నిర్ణయం తీసుకుంది. ఉపాధ్యాయులకు మాదిరిగానే సిఆర్డిలకు కూడా ఏడాది పొడవున అంటే 12 నెలలూ వేతనాలు చెల్లించింది.గత రెండు విద్యా సంవత్సరాల్లో ఇది అమలు చేసింది. అయితే, ఈ విద్యా సంవత్సరం నుంచి పది నెలలకే వేతనాలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో, సిఆర్డిలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. త్వరలో జరగనున్న టీచర్స్, గ్రాడ్యుయేట్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వారిలో చర్చ జరుగుతోంది. పిఆర్సి, సిపిఎస్ రద్దు వంటి అంశాల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయుల వ్యతిరేకతను ప్రభుత్వం ఇప్పటికే మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో సిఆర్డిల అంశం కూడా కీలకం కానుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ సత్తా చాటేందుకు వారు సంసిద్ధం అవుతున్నట్లు సమాచారం.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
*📚✍️మధ్యాహ్న భోజనం*
*ఖర్చును పెంచిన కేంద్రం✍️📚*
*🌻సాక్షి, న్యూఢిల్లీ*: ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజనం ధరలను పెంచింది. రెండేళ్ల విరామం అనంతరం ఒక్కో విద్యా ర్థిపై గతంలో అందిస్తున్న వంట ఖర్చు(ఆహార దినుసులు, గ్యాస్ తదితరాలు కలిపి)ను 9.6శాతం మేర పెంచింది. 2020లో చివరిసారి వంట ఖర్చును పెంచిన సమయంలో ప్రాథమిక తరగతి (1-4వ తరగతి వరకు) లో ఒక్కో చిన్నా రికి భోజనానికి రోజుకు రూ.4.97 చెల్లించగా, దానిని ఇప్పుడు రూ.5.45 కు సవరించింది. ప్రాథమికోన్నత (6- 8వ తరగతి వరకు) స్థాయిలో భోజనం ఖర్చు రూ.7.45 నుంచి రూ.8.17కు పెంచుతూ కేంద్ర ఆర్ధిక శాఖ నిర్ణయం తీసుకుంది. దీనిద్వారా దేశ వ్యాప్తంగా ఉన్న 11.20 లక్షల ప్రభుత్వం, ప్రభుత్వ ఎయి డెడ్ పాఠశాలల్లో చదువుతున్న 11.80 కోట్ల విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. పెంచిన ధరలు ఈ ఏడాది అక్టోబర్ నుంచి అమల్లోకి వచ్చాయని కేంద్రం రాష్ట్రాలకు లేఖలు రాసిం ది. మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తితో నిధులు సమకూరుస్తాయి. 2022-23 బడ్జెట్లో కేంద్రం ఈ పథకానికి రూ.10,233 కోట్లు కేటా యించగా, రాష్ట్రాలు రూ.6,277 కోట్లు ఖర్చు చేయనున్నాయి. కేంద్రంపై అదనంగా రూ. 600 కోట్ల భారం పడనుందని సమాచారం.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
*📚✍️రేపటి నుంచి ట్రిపుల్*
*ఐటీ కౌన్సెలింగ్✍️📚*
*🌻నూజివీడు:* ఆరు సంవత్సరాల సమీకృత ఇంజనీరింగ్ విద్యాబోధనకు నిలయమైన ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల కోసం ఈ నెల 12వ తేదీ నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. నూజివీడు, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీల్లో అడ్మిషన్ల కోసం ఈ నెల 12, 13 తేదీల్లో ఆయా క్యాంపస్లలో కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఒంగోలు ట్రిపుల్ ఐటీలో ప్రవే శాలకు 14, 15 తేదీల్లో ఇడుపులపాయలో, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్ల కోసం 15, 16 తేదీల్లో ఎచ్చెర్ల క్యాంపస్లో కౌన్సె లింగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు విద్యార్థులకు ఇప్పటికే ట్రిపుల్ ఐటీ అధికా రులు కాల్ లెటర్లతోపాటు వారి సెల్ఫోన్ లకు మెసేజ్లు కూడా పంపారు. కౌన్సెలిం గ్కు ట్రిపుల్ ఐటీల్లో అన్ని ఏర్పాట్లు చేశారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
*📚✍️ఉపాధ్యాయులకు శిక్షణ✍️📚*
*🌻హనుమాన్ జంక్షన్, న్యూస్టుడే:* పాఠశాల స్థాయిలోనే విద్యార్థులలో వ్యవస్థాపక మనస్తత్వ లక్ష ణాలను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయు లపై ఉంటుందని బాపులపాడు ఎంఈవో సక్సేనా రాజు అన్నారు. సోమవారం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి విద్యార్థుకు బోధించే ఉధ్యాయులకు నిర్వహించిన రెండు రోజుల వ్యవస్థా పక మనస్తత్వ అభివృద్ధి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పాఠశాల హెచ్ఎం టి.వి నాగేశ్వర రావు, ఇంగ్లీష్ ఉపాధ్యాయుడు యు. రాము, అన్ని పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
*📚✍️బడికి దూరంగా ఉన్న*
*బాలలను గుర్తించండి✍️📚*
*🌻పెడన, న్యూస్ టుడే:* పాఠశాలలకు దూరంగా  ఉన్న విద్యార్థుల్ని గుర్తించాలని ఈవోపీఆర్డీ ఎం. జయరాం సచివాలయ ఉద్యోగుల్ని ఆదేశించారు.  మండలంలోని నందిగామ గ్రామ సచివాలయాన్నిసందర్శించిన ఆయన ఆ గ్రామంలో బడికి దూరంగా ఉన్న బాలలపై సమీక్ష నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఈవోపీఆర్డీ మాట్లాడుతూ 14 ఏళ్లలోపు బాలబాలికలు తప్పనిసరిగా పాఠశాలలకు వెళ్లాలని ఇందుకు భిన్న పరిస్థితులు కన్పిస్తే సంబంధిత సచివాలయ ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. జిల్లాలో ప్రస్తుతం ద్రాపవుట్లపై ప్రత్యేక డ్రైవ్ జరుగుతోందని షెడ్యూల్ ప్రకారం ఉద్యోగులు ఇంటింటికీ వెళ్లి బడికి దూరంగా ఉన్న బాలలను గుర్తించాలని ఆదేశించారు..
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
*📚✍️లక్ష మంది విద్యార్థులకు*
*డిజిటల్ శిక్షణ✍️📚*
*♦️’మైక్రోసాఫ్ట్ ఎడ్యుకేషన్’ సహకారంతో ప్రారంభించిన ధోని*
*🌻బెంగళూరు (క్రీడలు), న్యూస్టుడే:* బెంగళూరు నగరంలోని ఎం.ఎస్. ధోని గ్లోబల్ పాఠశాలలో వెయ్యి మంది ఉపాధ్యాయులు, లక్ష మంది విద్యా ర్థులకు సాంకేతికత డిజిటల్ శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని జాతీయ క్రికెట్ జట్టు మాజీ సారథి ఎం. ఎస్. ధోని సోమవారం ప్రారంభించారు. ఇక్కడి కూడ్లు గేట్ సమీపంలోని గ్లోబల్ పాఠశాలను సందర్శించిన ఆయన.. ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడారు. వచ్చే ఏడాదిలోగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన వెయ్యి మంది ఉపాధ్యాయులు, లక్ష మంది విద్యార్థు లకు సాంకేతిక రంగంలో శిక్షణ ఇచ్చేందుకే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి నట్లు పేర్కొన్నారు. ‘మైక్రోసాఫ్ట్ ఎడ్యుకేషన్’ సంస్థ సహకారంతో ఈ శిక్షణ కొనసాగిస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ భువ నేశ్వరి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
*📚✍️’సెట్’ అడ్మిషన్లన్నీ ఈ*
*నెలలోనే✍️📚*
*♦️17 నుంచి ఏపీ ఈఏపీ సెట్ రెండో విడత కౌన్సెలింగ్*
*♦️ఈ నెల 13 వరకు ఈసెట్, 25 నుంచి ఐసెట్ కౌన్సెలింగ్*
*♦️పీజీ ఈసెట్ అడ్మిషన్లు 27 నుంచి ఆరంభం..*
*♦️ఉన్నత విద్య కోర్సులకు ప్రవేశాలన్నీ ఆన్‌లైన్‌లోనే..*
*♦️డిగ్రీ కోర్సులన్నీ నాలుగేళ్లు..*
*♦️ఇంటర్న్‌షిప్, అలాగే ఉచితంగా కంప్యూటర్‌ సర్టిఫికెట్‌ కోర్సులు*
*♦️ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ హేమచంద్రారెడ్డి వెల్లడి*
*🌻సాక్షి, అమరావతి*: ఇంజనీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన ఏపీ ఈఏపీ సెట్‌-2022 రెండో విడత అడ్మిషన్ల కౌన్సెలింగ్‌ ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభం కానుందని ఉన్నత విద్యామండలి చైర్మన్‌ కె.హేమచంద్రారెడ్డి ప్రకటించారు. ఈనెల 25వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. వివిధ కోర్సులకు సంబంధించిన అడ్మిషన్ల కౌన్సెలింగ్‌ తేదీలను ఉన్నత విద్యామండలి కార్యాలయంలో సోమవారం ఆయన విడుదల చేశారు.
ఈసెట్, ఐసెట్, పీజీఈ సెట్, జీప్యాట్, బీఆర్క్‌లకు సంబంధించి రెండో విడత కౌన్సెలింగ్‌ తేదీలను ఖరారు చేసినట్లు వివరించారు. అలాగే పీఈ సెట్, పీజీ సెట్‌ మొదటి విడత కౌన్సెలింగ్‌లను త్వరలో చేపట్టనున్నట్టు చెప్పారు. ఆర్‌ సెట్‌ పరీక్ష నిర్వహణ తేదీలను కూడా ఖరారు చేశామన్నారు. ఏపీ ఈఏపీ సెట్‌కు సంబంధించి కేటగిరీ-బి (యాజమాన్య కోటా) సీట్లలో ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్ల భర్తీకి సెప్టెంబర్‌ 3నుంచి 15వరకు అవకాశం ఇచ్చామన్నారు.
నాన్‌ ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్లను సెప్టెంబర్‌ 27 నుంచి ప్రారంభించామని, అక్టోబర్‌ 17వ తేదీతో ఈ అడ్మిషన్ల ప్రక్రియ ముగుస్తుందని తెలిపారు. కొన్ని సెట్ల తొలివిడత అడ్మిషన్ల కౌన్సెలింగ్‌ ముగియగా.. కొన్ని సెట్ల తొలివిడత ప్రక్రియ కొనసాగుతోందన్నారు. వాటినీ పూర్తిచేసి రెండో విడత కౌన్సెలింగ్‌ను చేపట్టేందుకు వీలుగా షెడ్యూళ్లను ఖరారు చేశామని వివరించారు.
*♦️డిగ్రీ కోర్సుల సీట్ల కేటాయింపు*
కాగా, రాష్ట్రంలోని ఉన్నత విద్యాకోర్సులన్నిటికీ అడ్మిషన్లను ఆన్‌లైన్‌లోనే కల్పిస్తున్నామని హేమచంద్రారెడ్డి వివరించారు. జూలై 22న డిగ్రీ అడ్మిషన్లకు నోటిఫికేషన్‌ ఇచ్చామని, సెప్టెంబర్‌ 27 నుంచి అక్టోబర్‌ 10 వరకు వెబ్‌ ఆప్షన్లకు అవకాశం కల్పించామని చెప్పారు. ఈ నెల 14న డిగ్రీ అభ్యర్థులకు తొలివిడత సీట్ల కేటాయింపు చేస్తామని చెప్పారు. వారంతా 15వ తేదీన కాలేజీల్లో రిపోర్టు చేయాలని, అదే రోజు నుంచి తరగతులు ప్రారంభం అవుతాయని పేర్కొన్నారు.
డిగ్రీ కోర్సులన్నీ నాలుగేళ్ల హానర్‌ కోర్సులుగా చేశామని, డిగ్రీలో చేరిన విద్యార్థులు ఏడాదిపాటు ఇంటర్న్‌షిప్‌ చేయాల్సి ఉంటుందని చెప్పారు. మూడేళ్లకే ఎగ్జిట్‌ అయ్యే విద్యార్థులకు 10 నెలల ఇంటర్న్‌షిప్‌ ఉంటుందన్నారు. ఇప్పటికే డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ కార్యక్రమాలు అమలవుతున్నాయని చెప్పారు.
ఇంటర్న్‌షిప్‌తోపాటు అదనంగా మైక్రోసాఫ్ట్, సేల్స్‌ఫోర్స్‌ వంటి వివిధ ఆధునిక కంప్యూటర్‌ సర్టిఫికెట్‌ కోర్సులను కూడా ఉచితంగా అందిస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి వైస్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కె.రామమోహనరావు, కార్యదర్శి ప్రొఫెసర్‌ నజీర్‌ అహమ్మద్, సెట్స్‌ ప్రత్యేకాధికారి డాక్టర్‌ ఎం.సుధీర్‌రెడ్డి పాల్గొన్నారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
*📚✍️కనీసం ఇద్దరు టీచర్లను*
*నియమించాలి✍️📚*
*🌻అమరావతి,ఆంధ్రప్రభ:* విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారనున్న వాటిల్లో ఇద్దరు ఉపాధ్యాయులను నియమించాలని యుటిఎఫ్ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎన్. నవకోటేశ్వరావు, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి చలపతిశర్మ, వి.వి. శేశులు ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే 8 వేల ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయని, సంస్కరణల్లో భాగంగా మరో 8 వేల పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారనున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వీటిల్లో మరో టీచర్ను నియమించకపోతే ఇవి సహజ మరణం చెందుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. మరో టీచర్ ఉంటేనే నాణ్యమైన విద్య విద్యార్థులకు అందుతుందని తెలి పారు. ప్రభుత్వానికి ఈ విషయం తెలిసి కూడా ఏకోపాధ్యాయ పాఠశాలలను నడుపుతోందని విమర్శించారు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గడానికి ఉపాధ్యాయులు లేకపోవడమే కారణమని తెలిపారు. ప్రభుత్వం ఈ అంశంపై తన విధానాన్ని పున్జపరిశీలించుకోవాలని కోరింది. లేదంటే అన్ని ప్రాథమిక పాఠశాలలు ఏకో పాధ్యాయ పాఠశాలలుగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
*📚✍️ప్రభుత్వ బడుల్లో*
*డ్రాపౌట్స్✍️📚*
*🌻ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి:* ప్రభుత్వ బడుల్లో డ్రాపౌట్స్ (బడి మానేసిన బాల బాలికల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుత విద్యా సంవత్సరంలో 6,488 మంది విద్యార్థులు తరగతులకు హాజరు కావడం లేదని అధికారికంగా వెల్లడయ్యింది. ఒక్కసారిగా ఇంతపెద్దసంఖ్యలో విద్యార్థులు స్కూలు తెరిచిన రెండునెలల్లోనే బడికి దూరం కావడానికి కారణాలపై పలురకాల విశ్లేషణలు, అభిప్రాయాలు ఉన్నాయి. వీటిలో ఈ ఏడాది నూతన విద్యావిధానంలో భాగంగా జరిగిన పాఠశాలల విలీనం ఒక ప్రధానకారణం కావచ్చునని తెలుస్తోంది. స్థానికంగా ఉన్న ఊరిబడిని దూరంగా వున్న మరో పాఠశాలలోకి ప్రాథమిక తరగతులను విలీనం చేయడంతో మధ్యలోనే బడిమానేసిన విద్యార్థుల సంఖ్య పెరగడానికి కారణమని చెబుతున్నారు. అయితే విద్యాశాఖ వాదనమాత్రం మరోలా ఉంది. విద్యార్థులు వేరే ప్రాంతాలకు వలస వెళ్లిపోవడం, కుటుంబ పరిస్థితులు, ఇతర పాఠశాలల్లో చేరినా వారిని డ్రాపౌట్లుగా చూపించడం, అనారోగ్య పరిస్థితులు, వైకల్యం తదితర కారణాలను అధికారవర్గాలు చెబుతున్నాయి. అయితే జిల్లా కలెక్టరు కె.మాధవీలత ఇటీవల నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేయటంతో కదలిక మొదలైంది. అధికార యంత్రాంగం క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలిస్తోంది. తిరిగి పాఠశాలల్లో చేర్చే ప్రయత్నం చేపట్టింది.
*♦️నమోదు చేయడంలోనూ నిర్లక్ష్యమే..*
జిల్లాలో 6488 మంది విద్యార్థులు డ్రాపౌట్స్‌ ఉండగా వీరిలో కేవలం 1,575 మంది అంటే కేవలం 24 శాతం మంది వివరాలు మాత్రమే నమోదు చేసినట్లు తెలుస్తోంది. జిల్లా కలెక్టరు గత వారంలో నిర్వహించిన సమీక్షా సమావశంలో ఆగ్రహం వ్యక్తం చేయటంతో మిగిలిన వారి వివరాలు సేకరించేందుకు అధికార యంత్రాంగం ముమ్మర కసరత్తు చేపట్టింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని డ్రాపౌట్‌ విద్యార్థులందరినీ వెతికిపట్టుకుని, వారి తల్లితండ్రులకు నచ్చజెప్పడం ద్వారా సంబంధిత పిల్లలందరినీ మళ్లీ బడికి రప్పించే కార్యాచరణ ప్రారంభించారు. ఇంతవరకు గుర్తించిన డ్రాపౌట్లను సమీప ప్రభుత్వ బడుల్లో చేర్చినట్టు చెబుతున్నప్పటికీ, దసరా సెలవుల అనంతరం బడులు తెరిచినప్పుడు వీరిలో ఎంతమంది మళ్లీ తరగతులకు రెగ్యులర్‌గా వస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. డ్రాపౌట్లకు కారణాలపై సమగ్రశిక్ష ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వేలో ఎక్కడా పాఠశాలల్లో ప్రాథమిక తరగతుల విలీన అంశాన్ని లేవనెత్తకుండా, ఇతర అంశాలను కారణాలుగా చూపేందుకు ప్రాధాన్యత నిచ్చారు. ఇతర ప్రాంతాలకు, వలస వెళ్లి పోయారని విశ్లేషించారు. మొత్తంమీద 9 రకాల కారణాలను డ్రాపవుట్లకు ప్రధాన అంశాలుగా పేర్కొన్నారు.
క్షేత్రస్థాయి పరిశీలనలో సిబ్బంది
కొందరు విద్యార్థులు టిసిలు తీసుకోకుండానే ప్రైవేటు పాఠశాలల్లో చేరిపోయిన సందర్భాల్లో వారంతా డ్రాపౌట్ల జాబితాలో చేరిపోయారని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ గుర్తింపు పొందని ప్రైవేటు పాఠశాలల్లో చేరిన విద్యార్థులకు ప్రభుత్వ పరంగా యూడైస్‌ కోడ్‌ ఉండకపోవడం కూడా ఒక కారణమంటున్నారు. ముఖ్యంగా 5,7,8 తరగతుల్లోనే డ్రాపౌట్ల సంఖ్య ఎక్కువగా ఉందని తేల్చారు. ఫాలో అప్‌ ఉంటేనే సత్ఫలితాలు వస్తాయని చెబుతున్నారు. గుర్తించిన డ్రాపౌట్‌ విద్యార్థులందరినీ సమీప ప్రభుత్వ పాఠశాలల్లో మళ్లీ చేర్చేందుకు ప్రస్తుతం కార్యాచరణ ప్రారంభించారు. ఆ మేరకు కొందరిని సచివాలయాల్లో విధులు నిర్వర్తించే ఎడ్యుకేషన్‌, వెల్ఫేర్‌ అసిస్టెంట్లు, వాలంటీర్లు, సమగ్రశిక్ష సిఆర్‌పిలు, ఎంఇఒలు తిరిగి బడుల్లో చేర్పించే కార్యక్రమం జరుగుతోంది. అయితే ప్రస్తుతం దసరా సెలవులు ముగుస్తున్నాయి. సెలవుల అనంతరం విద్యార్థుల్లో ఎంతమంది రెగ్యులర్‌గా తరగతులకు వెళుతున్నారో మానటరింగ్‌ చేయడంపైనే ఫలితాలు ఆదారపడి ఉంటాయని చెప్పవచ్చు. గుర్తించిన విద్యార్థులందరికీ విద్యాకానుక కిట్లు, అమ్మఒడిని వర్తింపజేసేందుకు చర్యలు తీసుకుంటామని సమగ్రశిక్ష జిల్లా అధికారులు చెబుతున్నారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
*📚✍️ఉపాధ్యాయుల*
*పదోన్నతులపై గందరగోళం✍️📚*
*🌻అనంతపురం విద్య, న్యూస్టుడే:* జిల్లాపరిషత్తు, ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పిస్తున్నట్లు ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది.
రాష్ట్ర విద్యాశాఖ పదోన్నతుల షెడ్యూల్‌ కూడా ప్రకటించింది. ఆ ప్రకారం 10వ తేదీన సీనియార్టీ తుదిజాబితా విడుదల చేయాలి. ప్రధానోపాధ్యాయుల పదోన్నతులకు 11వ తేదీన కౌన్సెలింగ్‌ నిర్వహించాలి. సీనియార్టీ జాబితా సోమవారం రాత్రి 9 గంటలకు కూడా వెల్లడించలేదు. జాబితా తయారీలో జిల్లా విద్యాశాఖ అధికారులు రాత్రి వరకు కసరత్తు చేస్తూనే ఉన్నారు. జాబితాను రాష్ట్ర విద్యాశాఖకు పంపిస్తామని అధికారులు చెబుతున్నారు. 11వ తేదీన ప్రధానోపాధ్యాయులకు కౌన్సెలింగ్‌ జరగాలి. వాటి వివరాలు కూడా అర్హులకు అందలేదు. రాష్ట్రవిద్యాశాఖకు జాబితా పంపిస్తామని, అక్కడి నుంచి ఉపాధ్యాయులకు నేరుగా సమాచారం అందుతుందని అధికారులు చెబుతున్నారు. కౌన్సెలింగ్‌ లేకుండానే నేరుగా పదోన్నతులు కల్పిస్తారని కొందరు చెబుతున్నారు. ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారని విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు. 42 మందికి ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి కల్పిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. 54 మందిని ధ్రువపత్రాల పరిశీలనకు పిలిచారు. వారిలో 31 మంది సమ్మతి పత్రాలు సమర్పించారు. మిగిలిన వారు పదోన్నతులు వద్దని రాతపూర్వకంగా ఇచ్చారు. ప్రధానోపాధ్యాయుల పదోన్నతులకు అర్హులైన వారు, తమ చరవాణికి వచ్చే ఓటీపీ ద్వారా సమ్మతి తెలియజేయాల్సి ఉంటుంది.
*♦️ఆయా సబ్జెక్టుల్లో ఖాళీలిలా..*
స్కూల్‌ అసిస్టెంట్‌ ఉర్దూ 21, ఉర్దూ మాధ్యమంలో గణితం 6, హిందీ 45, ఆంగ్లం 130, గణితం, 47, ఫిజికల్‌ సైన్స్‌ 6, సోషల్‌ 17, పీడీలు 162 పోస్టులను ఖాళీలు ఉన్నట్లు తెలిసింది. డీఈవో శామ్యూల్‌ మాట్లాడుతూ పదోన్నతులకు ఆన్‌లైన్‌లో కౌన్సెలింగ్‌ జరిగే అవకాశం ఉందన్నారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
*📚✍️విద్యపై విషపు*
*రాతలా?✍️📚*
*♦️విద్యారంగం వెనుకబాటు అంటూ ‘ఈనాడు’ దుష్ప్రచారం*
*♦️ప్రభుత్వంపై విషం కక్కుతూ ప్రజలను తప్పుదోవ పట్టించేలా కథనం*
*♦️ఈ రాతల వెనుక క్రిమినల్ ఆలోచనలు*
*♦️ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్‌ ధ్వజం*
*🌻సాక్షి, అమరావతి:* ‘వెనుక’బడి’నా గొప్పలే’ అంటూ ఈనాడు దినపత్రిక సోమవారం వండివార్చిన కథనంలో అన్నీ అసత్యాలేనని, ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయాలన్న దుర్బుద్ధితో తప్పుడు కథనాన్ని ప్రచురించిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (పాఠశాల విద్య) బి. రాజశేఖర్‌ తీవ్రంగా ఖండించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఈ కథనాన్ని రాసిందని, ఇందులో దురుద్దేశమే కాకుండా నేరపూరిత ఆలోచనలు కూడా ఉన్నాయని వ్యాఖ్యానించారు. సచివాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈనాడు రాసిన కథనంలోని ప్రతి అంశమూ అసత్యమేనని సవివరంగా స్పష్టంచేశారు. అంశాల వారీగా ఈనాడు తప్పుడు రాతలను రాజశేఖర్‌ ఎండగట్టారు.
*♦️ఆయన ఏమన్నారంటే..*
వరల్డ్‌ బ్యాంకు ప్రాజెక్టుపై ఈనాడుకు అవగాహనలేదు..
జాతీయ విద్యా విధానంలో 5+3+3+4 విధానాన్ని కేవలం కరిక్యులమ్‌ వరకు మాత్రమే అమలుచేయాలని చెప్పిందని.. 3, 4, 5 తరగతులను హైస్కూళ్లలో విలీనం చేయాలని ఎక్కడా చెప్పలేదని, ప్రపంచ బ్యాంకు ఒత్తిడికి తలొగ్గి టీచర్ల సంఖ్యను తగ్గించేందుకు విలీనం చేస్తున్నారంటూ ఈనాడు రాసింది. వాస్తవం ఏమిటంటే.. వరల్డ్‌ బ్యాంకు సహకారంతో అమలవుతున్న ప్రాజెక్టు మీద ఈనాడుకు అవగాహనలేదు. దానిపేరు సాల్ట్‌ (సపోర్టింగ్‌ ఆంధ్రాస్‌ లెర్నింగ్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌).
గత మూడేళ్లలో చేపట్టిన కార్యక్రమాల్లోని ప్రగతిని గమనించి ఆ ప్రభుత్వాలకు ఆర్థిక సహకారమిచ్చి మరింత ముందుకుపోయేలా ఈ ప్రాజెక్టు ద్వారా ప్రపంచ బ్యాంకు 250 మిలియన్‌ డాలర్లను అందిస్తోంది. గతంలో మాదిరిగా తాను ఎలాంటి జోక్యం చేసుకోకుండా కేవలం సాధించే ఫలితాల ఆధారంగా ఆర్థిక సహాయాన్ని అందించే కొత్త విధానాన్ని ప్రపంచబ్యాంకు చేపట్టింది.
2022లో ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ప్రాజెక్టులు 139 మంజూరు చేయగా అందులో ఏపీ ఒక్కటి. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో సాధిస్తున్న పురోగతిని గమనించి ప్రపంచబ్యాంకు ఈ ఆర్థిక సహకారాన్ని అందిస్తోంది. ఇందులో ఎలాంటి షరతుల్లేవు. రాష్ట్ర విద్యారంగ చరిత్రలోనే ఇలాంటి ప్రాజెక్టు ఎక్కడా రాలేదు. అయితే, ఈనాడులో ప్రపంచ బ్యాంకు ఒత్తిడిచేసి విలీనం చేయిస్తోందని తప్పుడు వార్త రాసింది.
ఎన్‌ఈపీలో విద్యార్థులకు అన్ని సదుపాయాలనూ అందుబాటులోకి తెచ్చేలా వనరులన్నిటినీ వినియోగించుకోవాలని, అందుకు అనుగుణంగా ఆయా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని, ఆ దిశగా 5+3+3+4 విధానాన్ని అనుసరించాలని ఎన్‌ఈపీ 7.5 పేరాలో కేంద్రం స్పష్టంగా చెప్పింది. కానీ, దీనిపై అవగాహన లేకుండా ఈనాడు ప్రజలను తప్పుదోవపట్టించింది.
*♦️చేరికల అంకెల్లోనూ అడ్డగోలు రాతలే*
ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు తగ్గిపోయాయని తప్పుడు అంకెలతో కథనం రాశారు. అసలు చేరికల లెక్కలకు సంబంధించి కేంద్రం ప్రామాణికంగా నిర్దేశించిన యూడైస్‌ ప్లస్‌ గణాంకాల ఇంకా ఖరారు కాలేదు. ఇష్టమొచ్చిన సంఖ్యలు రాశారు. ఈనెల 14, 15 తేదీల్లో కేంద్ర విద్యాశాఖ దక్షిణాది రాష్ట్రాలతో వర్కుషాపును నిర్వహించాక ఈ గణాంకాలు ఖరారవుతాయి. ఈ ఏడాది లెక్కలు ఇంకా ఖరారుకానందున ఇటీవలి అసెంబ్లీ సమావేశాల్లో సీఎం ప్రసంగానికి గత ఏడాది గణాంకాలను అందించాం.
యూడైస్‌ ప్లస్‌ ఏడాదికి ఒక్కసారే అప్‌డేట్‌ అవుతుంది. కానీ, రాష్ట్రంలో చైల్డ్‌ ఇన్ఫో పేరుతో రోజువారీ అప్‌డేషన్‌తో గణాంకాలు నిర్వహిస్తున్నాం. ఎక్కడినుంచో కొన్ని అంకెలను తీసుకుని ఈనాడు ప్రభుత్వంపై విషం చిమ్మింది. ఏ విద్యార్థీ బడిబయట ఉండరాదన్న ఉద్దేశంతో అమ్మఒడి సహ అనేక కార్యక్రమాలను ఎలాంటి తారతమ్యం లేకుండా ప్రభుత్వం చేస్తోంది. చరిత్రలో ఎవరూ పెట్టని విధంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగంపై దృష్టిపెట్టింది.
ప్రతి పిల్లాడినీ బడిలో చేర్చేలా కసరత్తు చేశాం. రాష్ట్రం ఏర్పాటయ్యాక గణాంకాలు పరిశీలిస్తే.. 2014-15లో 72,32,771 చేరికలు కాగా 2015-16కు 69,07,004కు తగ్గింది. 2016-17లో 68,48,197, 2017-18లో 69,75,526, 2018-19లో 70,43,071లుగా చేరికలు ఉన్నాయి. ఇక 2019-20లో ఆ సంఖ్య 72,43,269లకు 2020-21లో 73,12,852కు పెరిగింది. 2021-22లో 72,45,640కు చేరింది.
ఇక 2022-23లో సెప్టెంబర్‌ 30 వరకు 71,59,441లుగా చేరికలు ఉన్నాయి. గత ఏడాదితో పోలిస్తే 86,199 తగ్గింది. ఈ తగ్గడం ఎందుకంటే ఇతర రాష్ట్రాలకు మైగ్రేషన్‌వల్ల 16,857, సీజనల్‌ మైగ్రేషన్‌వల్ల 38,951, మరణాలవల్ల 1,289 మంది చేరికలు తగ్గాయి. ఇక జనాభా తగ్గుదలవల్ల దేశవ్యాప్తంగా ఒకటో తరగతిలో చేరికలు తగ్గాయి. మన రాష్ట్రంలో కూడా ఆ విధంగా 29,102 మంది తగ్గారు. సీజనల్‌ మైగ్రేషన్‌ అయిన వారిని తిరిగి స్కూళ్లలో చేర్చేలా చర్యలు తీసుకున్నాం. ఇప్పటికే 12వేల మంది చేరారు.
*♦️చేరికలు ఐదు లక్షలకు పైగా పెరిగాయి*
ప్రభుత్వ స్కూళ్లలో చేరికలు చూస్తే.. వాటిపై శ్రద్ధ గత ప్రభుత్వానికి, ఇప్పటికి ప్రభుత్వానికి మధ్యనున్న తేడా తెలుస్తుంది. ప్రభుత్వ స్కూళ్లలో 2014-15లో 41,83,441 మంది పిల్లలుండగా 2015-16లో 39,24,078కు, 2016-17లో 37,57,000లకు, 2017-18లో 37,29,000లకు, 2018-19లో 37,20,988లకు చేరింది. అదే 2019-20లో 38,18,348లకు పెరగ్గా 2020-21లో 43,42,874లకు చేరింది. అంటే ఏకంగా 5 లక్షల మేర చేరికలు అదనంగా పెరిగాయి. 21-22లో 44,29,569లు కాగా 2022-23లో అది 40,31,239లుగా ఉంది.
కరోనావల్ల ఆర్థిక పరిస్థితులు దెబ్బతిని ప్రైవేటు నుంచి ప్రభుత్వ స్కూళ్లలోకి చేరికలు పెరిగాయని పలు విశ్లేషణలు చెబుతున్నాయి. అయితే, ఈ చేరికల్లో ఏపీ 14 శాతంతో అగ్రస్థానంలో ఉంది. ఇతర రాష్ట్రాలు మనకన్నా తక్కువగా ఉన్నాయి. అసర్‌ నివేదిక కూడా ఇదే చెబుతోంది. జనాబా తగ్గుదలవల్ల కూడా చేరికలు తగ్గుతున్నట్లు ఎన్‌సీఈఆర్టీ నివేదిక చెబుతోంది. 2025 నాటికి 14 శాతం మేర తగ్గుతుందని నివేదించింది.
ఇక 2019-20లో ప్రభుత్వ స్కూళ్లలో 38,18,348 మంది పిల్లలుండగా ప్రైవేటులో 32,28,681 మంది ఉన్నారు. అదే ప్రస్తుత విద్యాసంవత్సరంతో పోలిస్తే ప్రభుత్వ స్కూళ్లలో 40,31,239 మంది పిల్లలున్నారు. అంటే రెండు లక్షల మంది అదనంగా పెరిగారు. అదే ప్రైవేటు స్కూళ్లలో 2019-20తో పోలిస్తే 2,12,407 చేరికలు తగ్గాయి. ప్రభుత్వ స్కూళ్లలో చేరికలు తగ్గాయని ప్రైవేటులోకి వెళ్లిపోతున్నారని ఈనాడు పచ్చి అబద్ధాలు రాసింది.
కరోనా పరిస్థితులు తగ్గి ఆర్థిక స్థితి కొంత పెరిగి తిరిగి ప్రైవేటులోకి వెళ్లిపోతున్నారని అనుకున్నా అందరూ ప్రభుత్వ స్కూళ్ల నుంచి వెళ్లడంలేదని ఈ గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. ఆంగ్ల మాధ్యమంతో పాటు పథకాలు, ఇతర కార్యక్రమాలవల్ల తల్లిదండ్రులు, విద్యార్థుల్లో ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెరిగింది. ఐఏఎస్‌ అధికారులు కూడా తమ పిల్లలను ప్రభుత్వ స్కూళ్లలో చేరుస్తున్నారంటే రాష్ట్రంలో విద్యారంగంలో ప్రమాణాలు ఎంత అద్భుతంగా అభివృద్ధి చెందుతున్నాయో స్పష్టమవుతోంది.
ఇక బెండపూడి స్కూలులో ప్రసాద్‌ అనే టీచర్‌ చేసిన ప్రయత్నంవల్ల విద్యార్థులు ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడుతున్నారు. దీన్ని రాష్ట్రంలోని ఇతర స్కూళ్లలోనూ అమలుచేసేలా చర్యలు చేపడుతున్నాం. ఇంత మంచిగా కార్యక్రమాలు జరుగుతూ విద్యారంగం అభివృద్ధి సాధిస్తుంటే వెనుకబడిపోయిందని ఈనాడు తప్పుడు రాతలు రాయడం సరికాదు. తప్పుడు లెక్కలతో ప్రజలను తప్పుదోవ పట్టించడం వెనుక ఈనాడుకు నేరపూరిత ఉద్దేశాలున్నాయి.
*♦️ప్రైవేటు స్కూళ్లకు వెళ్లమనా ఈనాడు ఉద్దేశ్యం?*
ఆంగ్ల మాధ్యమంలో ఒక్క వాక్యాన్నీ చదవలేకపోతున్నారని రాశారు. కానీ, అది అవాస్తవం. ఈ ఏడాది టెన్త్‌ ఫలితాల్లో తెలుగు మీడియంలో 1,08,543 మంది హాజరైతే 43.97 పాసయ్యారు. ఇంగ్లీషు మీడియంలో 4,22,743 మంది రాస్తే 77.55 శాతం పాసయ్యారు. ఈ పరీక్షలను ఎలాంటి వాతావరణంలో నిర్వహించామో అందరికీ తెలుసు. మాస్‌కాపీయింగ్‌ చేసిన వారిని, దానికి సహకరించిన టీచర్లను కూడా సస్పెండ్‌ చేశాం.
ఇంత పకడ్బందీ నిర్వహణలోనూ ఇంగ్లీషు మీడియం పిల్లలు పాస్‌ అత్యధికంగా ఉంది. ఏదీ రాయడం, చదవడం రాకుండానే ఇంతమంది పాసవుతారా? అన్నది అర్థం చేసుకోవాలి. ఇలాంటి తప్పుడు వార్తలతో ప్రజలను మిస్‌లీడ్‌ చేయడం వెనుక ఈనాడు ఉద్దేశమేమిటి? ప్రభుత్వ స్కూళ్లు నిర్వీర్యం అయ్యాయంటూ ప్రైవేటు స్కూళ్లకు వెళ్లమని పిల్లలకు చెబుతున్నారా? రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులను ప్రపంచస్థాయి పౌరులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
*📚✍️ప్రభుత్వ బడుల్లో తగ్గిన*
*విద్యార్థులు 3.98 లక్షలు✍️📚*
*♦️పిల్లలు పుట్టడం తగ్గి.. ప్రవేశాలు కొంత తగ్గాయి..*
*♦️పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వెల్లడి*
*🌻ఈనాడు, అమరావతి*: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో గతేడాదితో పోల్చితే 3.98 లక్షలమంది విద్యార్థులు తగ్గినట్లు ప్రభుత్వమే అంగీకరించింది. కరోనా సమయంలో ప్రైవేటు ఫీజులు కట్టలేక చాలా మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు రావడం వల్ల దేశవ్యాప్తంగా సర్కారీ బడుల్లో విద్యార్థుల సంఖ్య పెరిగిందని పేర్కొంది. వచ్చిన వారిలో కొంతమంది వెనక్కి వెళ్లిపోయారని తెలిపింది. రాష్ట్రంలో జననాల రేటు తక్కువగా ఉన్నందున ప్రవేశాలు తగ్గుతున్నాయని కూడా చెప్పడం విశేషం. సోమవారం పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్ విలేకర్ల సమావేశంలో విద్యార్థులకు సంబంధించి ఈ వివరాలు వెల్లడించారు. కరోనా సమయంలో ప్రభుత్వ బడుల్లో చేరినవారిలో అందరూ వెళ్లిపోలేదని, ఇంకా 2.12 లక్షల మంది పిల్లలు ఉన్నారన్నారు. రాష్ట్రంలో జననాల రేటు తక్కువగా ఉన్నందున ప్రవేశాలు తగ్గుతున్నాయని చెప్పారు. కర్నూలులో ఒక ఐఏఎస్ అధికారి, శాప్ ఎండీ తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివిస్తున్నారని తెలిపారు. పదోతరగతి పరీక్షల్లో ఆంగ్ల మాధ్యమంలో 77.55%, తెలుగు మాధ్య మంలో 43.97% మంది ఉత్తీర్ణులయ్యారని, ఆంగ్లంలో చదివిన వారే ఎక్కువ ఉత్తీర్ణులవుతున్నారని ఆయన చెప్పారు. విద్యార్థుల సంఖ్యకు కేంద్ర ప్రభుత్వ యూడైస్ ప్లస్ డేటానే ప్రామాణికమని రాజశేఖర్ తెలిపారు. విద్యార్థుల వివరాల నమోదు సెప్టెంబరు 30తో ముగిసినందున యూడైస్ పూర్తి కాక.. సీఎం జగన్ అసెంబ్లీలో మాట్లాడినప్పుడు గతేడాది విద్యార్థుల సంఖ్యనే ఇచ్చా మన్నారు. వలసల కారణంగా 16,857 మంది, సీజనల్ వలసల వల్ల 38,951 మంది బడి మానేశారని.. 1,289 మంది చనిపోయారని తెలిపారు. సీజనల్ వలసల్లో 12,000 మందిని తిరిగి బడుల్లో చేర్పించామన్నారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించకుండా సత్ఫలితాలు రావని పేర్కొన్న ఆయన ప్రభుత్వ విద్యార్థి ప్రపంచస్థాయిలో పోటీ పడేలా తయారు చేస్తున్నామని వివరించారు. గిరిజన ప్రాంతాల్లోని పిల్లలు సైతం బ్రహ్మాండంగా ఆంగ్లంలో మాట్లాడుతున్నారని, బెండపూడి పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడు ఒక కొత్త విధానంలో భాష నేర్పుతున్నారని చెప్పారు. ఆస్ట్రేలియాలోని ఆంగ్ల టీచర్ సైతం బెండపూడికి వచ్చి అభినందించారని రాజశేఖర్ వెల్లడించారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
sikkoluteachers.com

Recent Posts

NMMS MODEL GUESS PAPER 03

NMMS MODEL GUESS PAPER 03NMMS MODEL GUESS PAPER 03HOW TO ATTEMPT AP NMMS ONLINE TESTSRead… Read More

December 7, 2024

NMMS MODEL GUESS PAPER 02

NMMS MODEL GUESS PAPER 02NMMS MODEL GUESS PAPER 02HOW TO ATTEMPT AP NMMS ONLINE TESTSRead… Read More

December 2, 2024

NMMS MODEL GUESS PAPER 01

NMMS MODEL GUESS PAPER 01 NMMS MODEL GUESS PAPER 01 HOW TO ATTEMPT AP NMMS… Read More

November 28, 2024

NMMS MODEL GRAND TEST – 10

NMMS MODEL GRAND TEST - 10NMMS MODEL GRAND TEST - 10HOW TO ATTEMPT AP NMMS… Read More

November 24, 2024

NMMS MODEL GRAND TEST – 9

NMMS MODEL GRAND TEST - 9NMMS MODEL GRAND TEST - 9HOW TO ATTEMPT AP NMMS… Read More

November 22, 2024

NMMS MODEL GRAND TEST – 8

NMMS MODEL GRAND TEST - 8NMMS MODEL GRAND TEST - 8HOW TO ATTEMPT AP NMMS… Read More

November 22, 2024

NMMS MODEL GRAND TEST – 7

NMMS MODEL GRAND TEST - 7NMMS MODEL GRAND TEST - 7HOW TO ATTEMPT AP NMMS… Read More

November 20, 2024

NMMS MODEL GRAND TEST – 6

NMMS MODEL GRAND TEST - 6NMMS MODEL GRAND TEST - 6HOW TO ATTEMPT AP NMMS… Read More

November 19, 2024

NMMS MODEL GRAND TEST – 5

NMMS MODEL GRAND TEST - 5NMMS MODEL GRAND TEST - 5HOW TO ATTEMPT AP NMMS… Read More

November 17, 2024

NMMS MODEL GRAND TEST – 4

NMMS MODEL GRAND TEST - 4NMMS MODEL GRAND TEST - 4HOW TO ATTEMPT AP NMMS… Read More

November 17, 2024