AP TET RESULTS 2022: CLARIFICATION ON OUT OF 150 MARKS STUDENTS GOT 151 MARKS
ఆశ్చర్యానికి గురైన అభ్యర్థులు
* పరిశీలన లేకుండా నార్మలైజేషన్ విధానం అమలుతో ఫలితాల వెల్లడి
* సరిచేస్తామన్న పాఠశాల విద్యాశాఖ
ఏదైనా పరీక్ష 150 మార్కులకు రాస్తే ఎన్ని వస్తాయి? గరిష్ఠంగా 150 లేదా అంతకంటే తక్కువ మార్కులు వస్తాయి. అయితే… పాఠశాల విద్యాశాఖ నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)లో 150కి 151, 150.86, 150.64, 150.26, మార్కులు వచ్చాయి. ఇదేంటి? అని అనుకుంటున్నారా? అధికారులు నిర్వహించిన నార్మలైజేషన్ విధానంతో ఈ పరిస్థితి ఏర్పడింది. టెట్ ఫలితాలను సెప్టెంబర్ 29న వెబ్‌సైట్‌లో ఉంచారు. గరిష్ఠం కంటే ఎక్కువ మార్కులు రావడంతో వాటిని చూసి అభ్యర్థులు సైతం ఆందోళనకు గురయ్యారు. ఇలా ఒక్కరికో ఇద్దరికో కాదు.. దాదాపు 8 మంది ఎస్జీటీ పరీక్ష రాసిన విద్యార్థులకు ఇదే రీతిలో ఫలితాలు వచ్చాయి. టెట్ పరీక్షను ఈ ఏడాది కంప్యూటర్ ఆధారిత విధానంలో 16 రోజుల పాటు నిర్వహించిన పరీక్షలకు 4,07,329 మంది హాజరయ్యారు. ఇన్ని రోజుల పరీక్షల్లో ఒక రోజు ప్రశ్నపత్రం కఠినంగా.. మరొక రోజు తేలికగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో అభ్యర్థులందరికీ సమ న్యాయం చేసేందుకు నార్మలైజేషన్ విధానాన్ని అమలు చేస్తారు. ఏపీఈఏపీసెట్, జేఈఈ మెయిన్స్, అడ్వాన్సుడ్ లాంటి వాటిల్లోనూ ఇదే విధానాన్ని పాటిస్తారు. నార్మలైజేషన్ చేసే సమయంలో గరిష్ఠ 150 మార్కుల కంటే ఎక్కువ వచ్చినా వాటిని 150కే పరిమితం చేయాలి. పాఠశాల విద్యాశాఖ మాత్రం ఫలితాల విడుదలలో ఎలాంటి పరిశీలన చేసుకోకుండానే 150కి 151 మార్కులను ఇచ్చేసింది. ఇది అభ్యర్థులను తీవ్ర గందరగోళానికి గురి చేసింది. కఠిన ప్రశ్నపత్రంలోనూ ఎక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థులకు 150కంటే ఎక్కువ వచ్చాయని అధికారులు వెల్లడించారు. ప్రశ్నపత్రం తేలికగా ఉన్న వారికి ఎక్కువ మార్కులు వస్తే కఠినంగా వచ్చిన వారికి అదనంగా మార్కులు కలుస్తాయని, ఇలాంటి సమయంలో ఇదే జరుగుతుందని పేర్కొన్నారు. ఈ అభ్యర్థులకు మళ్లీ ప్రత్యేకంగా 150 మార్కులను మాత్రమే ఇస్తామని ప్రకటించారు. టెట్‌లో 150కి 150 మార్కులు రావడం చాలా అరుదు. ఈ సారి ఎక్కువమంది అభ్యర్థులకు వందశాతం మార్కులు రావడంపైనా కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సెకండరీ గ్రేడ్ టీచర్స్(ఎస్జీటీ)కు పేపర్-1ఏ, విభిన్న ప్రతిభావంతుల ప్రత్యేక పాఠశాలల్లో 1-5 తరగతుల బోధనకు పేపర్-బీ, స్కూల్ అసిస్టెంట్లకు పేపర్-2ఏ, ప్రత్యేక ఉపాధ్యాయులకు పేపర్-2బీ పెట్టారు. ఈ పరీక్షను 150 మార్కులకు నిర్వహించారు.
*📚✍️‘టెట్’ ఆశలు ఆవిరి!✍️📚*
*♦️కొందరికి నూరుశాతానికి పైగా మార్కులు .. ఆపై దిద్దుబాటు*
*🌻అమరావతి, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి*): ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)పై అభ్యర్థుల ఆశలు ఆవిరయ్యాయి. పరీక్ష నిర్వహణలో ప్రభుత్వం విఫలం కావడంతో ఏకంగా 1,18,474 మంది పరీక్షలకు దూరమయ్యారు. వీరంతా రూ.500 చొప్పున చెల్లించిన దరఖాస్తు రుసుము దాదాపు రూ.6 కోట్లు వృథాగా మారింది. గతంలో ఎప్పుడూ ఈ స్థాయిలో అభ్యర్థులు పరీక్షలకు దూరం కాలేదు. 2018 తర్వాత నిర్వహిస్తుండటంతో ఈ ఏడాది ఆగస్టులో జరిగిన టెట్‌కు ఏకంగా 5,25,803 మంది దరఖాస్తు చేసుకున్నారు. పాఠశాల విద్యాశాఖ కేవలం 150 పరీక్ష కేంద్రాలు మాత్రమే ఏర్పాటు చేసింది. వీటిలో చాలావరకూ ఒడిశా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లో ఉండటంతో ఏపీలో కేంద్రాలు దొరకని వారు పరీక్షలు రాయలేకపోయారు.
*♦️ఐదుగురికి 150 మార్కులు*
ఈ ఏడాది టెట్ రాసిన 4,07,329 మందిలో 2,36,535 (58.07ు) మంది అర్హత సాధించారు. వారిలో ఐదుగురికి 150 మార్కులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. జనరల్ అభ్యర్థులకు 60శాతం, బీసీ అభ్యర్థులకు 50శాతం, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీ్‌సమన్ కోటా అభ్యర్థులకు 40శాతం మార్కులు అర్హతగా నిర్ణయించారు. పరీక్షలకు ఎక్కువ సమయం ఇవ్వకపోవడంతో చాలామంది అనర్హులుగా మిగిలిపోయారు. మరోవైపు టెట్ ఫలితాల్లో వింతలు చోటుచేసుకున్నాయి. 150 మార్కులకు పరీక్ష నిర్వహించగా కొందరికి నూరు శాతానికి పైగా మార్కులు రావడంతో అభ్యర్థులు కంగుతిన్నారు. నంద్యాల జిల్లాకు చెందిన వడ్ల మంజుల 150కి గాను 150.26958 మార్కులు వచ్చాయి. మరో అభ్యర్థికి 150.86, ఇంకొకరికి 15.64 మార్కులు రావడంతో వారిలో ఆందోళన మొదలైంది. సాయంత్రానికి వీటిని సరిదిద్దడంతో ఊపిరి పీల్చుకున్నారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇