‘మహాత్మా గాంధీ లాంటి రక్తమాంసాలు నిండిన ఓవ్యక్తి..ఈ భూమిపై నడిచాడంటే భవిష్యత్తు తరాలు ఆశ్చర్య పడక మానవు అన్నారు ప్రఖ్యాత శాస్త్రవేత ఆల్బర్ట్ ఐన్‌స్టీన్.. గాంధీజీ సిద్ధాంతాలకు ప్రపంచం మొత్తం ప్రభావితమైంది. దేశ భవిష్యత్తు యువతపైనే ఆధాపడి ఉందన్నారు పూజ్య బాపూజీ.
ఓ మహాత్మా.. ఓ మహర్షి..
జాతికి గ్రహణం పట్టిన వేళ..
మాతృభూమి మొరపెట్టిన వేళ..
ప్రజల్లో ఐక్యత నింపి..కనువెలుగై నడిపించావు..
సత్యం..అహింస అనే ఆయుధాలు ధరించి..
స్వరాజ్య సమరం పూరించావు..
స్వాతంత్య్ర ఫలం సాధించావు..
ఓ మహాత్మా.. ఓ మహర్షి..
దేశం స్వేచ్ఛా వాయువులు పీల్చి 75ఏళ్లయింది..
అమృతోత్సవాలు ఘనంగా నిర్వహించుకున్నాం..
తప్పటడుగులు పడుతున్నా..భుజకీర్తులు తొడుక్కున్నాం..
నీ మాటలు మరచి..నీ బాటను విడిచాం..
కలతలు రేగి..కత్తులు దూసుకుంటున్నాం..
నీవు నడయాడిన నేల.. నేరగాళ్ల రాజ్యమైంది..
నీ స్వప్నం భగ్నమైంది.. మళ్లీ అంధకారం ఆవహిస్తోంది..
ఓ మహాత్మా.. ఓ మహర్షి..మళ్లీ రావా..
దిక్కుతోచని జాతికి దారి చూపించవా..!
యువత భవితకు బాపూజీ సప్త సూత్రాలు..
‘మహాత్మా గాంధీ లాంటి రక్తమాంసాలు నిండిన ఓవ్యక్తి..ఈ భూమిపై నడిచాడంటే భవిష్యత్తు తరాలు ఆశ్చర్య పడక మానవు అన్నారు ప్రఖ్యాత శాస్త్రవేత ఆల్బర్ట్ ఐన్‌స్టీన్.. గాంధీజీ సిద్ధాంతాలకు ప్రపంచం మొత్తం ప్రభావితమైంది. దేశ భవిష్యత్తు యువతపైనే ఆధాపడి ఉందన్నారు పూజ్య బాపూజీ. ఆ మహాత్ముని ఆలోచనలు, ఆశయాలకు అనుగుణంగా యువత నడుచుకుంటే దేశం ప్రగతి పథంలో పయనించడంతో పాటు దేశం గర్వించదగ్గ వ్యక్తులుగా ఎదుగుతారని గీతం స్కూల్ ఆఫ్ గాంధీయన్ స్టడీస్ డైరెక్టర్ ఆచార్య బి.నళిని పేర్కొన్నారు. గాంధీజీ జయంతి సందర్భంగా..నాడు ఆయన ప్రవచించిన సప్త సిద్ధాంతాలు యువతకు ఎలా మార్గదర్శకమో వివరిస్తున్నారు.
1. అశాంతి..అసహనం ప్రజ్వరిల్లుతున్న ప్రస్తుత తరుణంలో గాంధీజీ అహింసా మార్గానికి అధిక ప్రాధాన్యత ఉంది. అది ప్రపంచంలో శాంతిని నెలకొల్పే మార్గాలు చూపగలదనే అంశాన్ని యువత గుర్తించి ముందుకు సాగాలి.
2. ధర్మాన్ని ఏ విధంగా ఆచరించాలో రామాయణం ప్రబోధిస్తే.. యుద్ధం వల్ల కలిగే అనర్థాలను మహా భారతం చాటిచెప్పింది. గాంధీ మార్గం సత్యం, ధర్మం, అహింసలపై ఆధారపడింది. ఆ మార్గం ఎన్నో రాజ్య సమస్యలకు పరిష్కారం చూపగలిగిందనే విషయం నేటి యువత గుర్తుంచుకోవాలి.
3. సామాజిక మాధ్యమాల ద్వారా సమాజంలో అశాంతిని సృష్టించడం, హింసను ప్రేరేపించడం తదితర విపరిణామాలు ప్రస్తుతం చోటుచేసుకుంటున్నాయి. ఈ తరుణంలో మహాత్ముడి చూపిన సత్యం, ధర్మం, అహింసను మనస్ఫూర్తిగా ఆచరిస్తే ఆధునిక సమాజంలో విలువలు పెరుగుతాయి.
మ్యూజియంలో గాంధీజీ అరుదైన చిత్రాలు
4. గాంధీజీ సిద్ధాంతాలు ఇప్పటికీ ప్రపంచానికి అనుసరణీయం. స్వరాజ్యం, స్వదేశీ అనే నినాదాలు భారతదేశాన్ని బలమైన శక్తిగా మారుస్తాయని బాపూజీ వందేళ్ల క్రితమే భావించారు. ఏ దేశమేగినా యువత స్వదేశాన్ని మరువకూడదనే అంతరార్థం అందులో ఉంది.
5. స్వచ్ఛత, శుభ్రతకు మహాత్ముడు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. యువత అవి పాటించాలని వందేళ్ల కిందటే ప్రబోధించారు. కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఎన్‌ఎస్‌ఎస్ శిబిరాల్లో చురుగ్గా పాల్గొని ప్రజల్ని స్వచ్ఛభారత్ వైపు మళ్లించాలి.
6. మనిషి ప్రకృతితో మమేకమవ్వాలి.. అందులో అన్ని ప్రాణులకు భాగస్వామ్యం ఉందనే విషయం మరువకూడదు. మనిషి అవసరాల కోసం ప్రకృతిని ధ్వంసం చేయకూడదు.. అది భావి తరాలకు శ్రేయస్కరం కాదని మహాత్ముడు చెప్పారు. అందుకే యువత పర్యావరణ పరిరక్షణపై దృష్టి సారించాలి.. భూతదయ కనబర్చాలి.
7. స్వాతంత్య్ర సమరంలో బాపూజీ పాల్గొన్న ఉద్యమాలు, వివిధ చారిత్రక ఘట్టాలు, మహాత్ముని లేఖలు, ఆటో బయోగ్రఫీ సత్యశోధన గ్రంథం భారత జాతికి ఎంతో అమూల్యమైనవి. వాటి ద్వారా యువత గాంధీ తత్వం తెలుసుకుని ఆచరించడానికి ప్రయత్నించాలి.
* గీతం స్కూల్ ఆఫ్ గాంధీయన్ స్టడీస్‌లో ఏర్పాటైన మ్యూజియం యువతకు ఒక వరం. ఎన్నో అపూరూప చిత్రాలు ఇందులో కొలువై ఉన్నాయి. వాటిని సమగ్రంగా అధ్యయం చేస్తే మహాత్ముడు ఎంత నిరాడంబరంగా జీవించారో తెలుస్తుంది. యువత మంచి మార్గంలో పయనించడానికి దారి చూపుతాయి.