నేడు ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం 05/10/2022

WhatsApp Group         Join Now
Telegram Group Join Now
గురువులకు అండగా!
  (నేడు ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం) 
 
ప్రతి ఏటా సెప్టెంబర్ 5న జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంజరుపుకుంటాము.అదే విధంగా అక్టోబర్ 5న ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవంనిర్వహించుకుంటాము.అంతర్జాతీయ విద్యా వైజ్ఞానిక సాంస్కృతిక సంస్థ (యునెస్కో) 1966 సెప్టెంబర్‌ 21 నుండి 15 రోజుల పాటు పారిస్‌లో ఉపాధ్యాయుల పరిస్థితిపై ప్రత్యేకంగా అంతర్జాతీయ సదస్సు నిర్వహించింది. అనేక దేశాలు, ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ కార్మిక సంస్థ, వివిధ ప్రభుత్వేతర సంస్థల ప్రతినిధులు పాల్గొన్న ఆ సదస్సు ఉపాధ్యాయుల హోదా పెంచడానికి వారి హక్కులు, బాధ్యతలకు సంబంధించి కొన్ని నిర్దిష్ట సిఫారసులతో సమగ్రమైన పత్రాన్ని ఆమోదించింది.
1994లో యునెస్కో  చేసిన సమీక్షలో ఆ పత్రం ‘ 28 ఏండ్ల తర్వాత కూడా ‘ఎక్కడ వేసిన గొంగడి అక్కడే’ అన్న చందంగా మిగిలిపోయినట్టు, ఆనాటి సిఫార్సులు కాగితాల్లోనే కరిగిపోతున్నట్టు గుర్తించి
ఆ లోపాన్ని అధిగమించాలనీ  ‘ స్టేటస్‌ ఆఫ్‌ ది టీచర్స్‌’ పత్రాన్ని అక్టోబర్‌ 5న  ఆమోదించింది 
అప్పటినుండి అక్టోబర్‌ 5న ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించి, సదరు సిఫార్సుల అమలును ప్రతియేటా సమీక్షించాలని నిర్ణయించింది.
యునెస్కో పత్రం మానవాభివృద్ధిలో, ఆధునిక సమాజ నిర్మాణంలో, విద్యాభివృద్ధిలో ఉపాధ్యాయులది ప్రముఖ పాత్ర అని తెలిపింది.  ఈ పాత్ర ద్వారా ఉపాధ్యాయులు తమ హోదా పొందాలి. విద్యా అవసరాల మేరకు ఉపాధ్యాయుల హోదా ఉనికిలోకి వస్తుంది. విద్యా సంబంధిత లక్ష్యాలు, ప్రయోజనాలూ పూర్తిగా నెరవేరాలంటే ఉపాధ్యాయులకు సరైన హోదా, ఉపాధ్యాయ వృత్తిపట్ల ప్రజల్లో గౌరవం ముఖ్యాంశాలుగా పరిగణించాలి. వృత్తిపరమైన లక్ష్యాలను సాధించడంపై దృష్టి పెట్టే విధంగా, ఉత్తమమైన విద్యాభ్యాసం సాగించే విధంగా ఉపాధ్యాయులకు పని పరిస్థితులను కల్పించాలి.  విద్యావ్యాప్తిలో ముఖ్యపాత్ర వహించే శక్తులుగా ఉపాధ్యాయ సంఘాలను గుర్తించాలి. విద్యా విధానాన్ని నిర్ణయించడంలో వాటిని భాగస్వాములను చేయాలి.
వృత్తి హోదాను నిలబెట్టుకోవడంలో ఉపాధ్యాయులకూ బాధ్యత ఉంది. వృత్తిపరమైన పని విధానంలో ఉపాధ్యాయులు అందరూ వీలైనంత వరకు అత్యున్నత ప్రమాణాలను సాధించాలి. నైతిక నియమావళిని ఉపాధ్యాయ సంఘాలు రూపొందించాలి. అలాంటి సూత్రాలు వ్యక్తికి గల ప్రతిష్టను పెంచేందుకు, అంగీకరించిన సూత్రాల మేరకు వృత్తిపరమైన విధులను నిర్వర్తించేందుకు ఉపయోగపడతాయి. 
వ్యక్తిగత అభివృద్ధిని సాధించేందుకు సామాజిక, ప్రజాజీవితాలలో పాల్గొనే విధంగా ఉపాధ్యాయులకు ప్రోత్సాహాన్నివ్వాలి.ఎన్నికల్లో నిలబడేందుకు, ప్రజా ప్రతి నిధులుగా సేవలు అందించేందుకు ఉపాధ్యాయులకు అవకాశం ఇవ్వాలి. సాధారణ పౌరులు అనుభవిస్తున్న అన్ని హక్కులూ వారికీ ఉండాలి.
యునెస్కో, ఐఎల్‌ఓ, ఇఐ (ఎడ్యుకేషన్‌ ఇంటర్నేషనల్‌) సంయుక్తంగా ప్రతీ యేటా ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహిస్తుంటాయి. కానీ అమలు తీరుతెన్నుల సమీక్ష నివేదికలను మాత్రం విడుదల చేయడంలేదు. అందువల్ల మొక్కుబడి కార్యక్రమంగా జరుగుతున్నది.
 కొన్ని ప్రయివేటు సంస్థలు వివిధ దేశాల్లో ఉపాధ్యాయుల స్థితిగతులను అధ్యయనం చేసే నివేదికలను తరుచుగా వెలువరిస్తున్నాయి. ప్రజల్లో, ప్రభుత్వపరంగా లభించే గౌరవం, జీతభత్యాలు, పని పరిస్థితులు, హక్కులు, బాధ్యతలు మున్నగు అంశాలు ఉపాధ్యాయుల హోదాకు కొలమానాలుగా ఉంటాయి. 
 జెమ్స్‌ ఎడ్యుకేషన్‌ సొల్యూషన్‌ అనే సంస్థ ప్రకటించిన  నివేదికలో చైనాలో ఉపాధ్యాయులకు అత్యధిక గౌరవం లభిస్తున్నట్లు తెలిపింది. 
 గ్లోబల్‌ టీచర్‌ స్టేటస్‌ ఇండెక్స్‌లో చైనా ఆగ్రస్థానంలో ఉండగా, బ్రిటన్‌, అమెరికా మధ్య స్థాయిలో, భారత్ , దక్షిణ కొరియా, గ్రీస్‌ అథమ స్థాయిలో ఉన్నట్టు పేర్కొన్నది. 
 ఉపాధ్యాయులకు చెల్లించే జీతాల్లో స్విట్జర్‌లాండ్‌ మొదటి స్థానంలో ఉంది. అక్కడ టీచర్లకు లభించే వార్షిక జీతం అమెరికా డాలర్లలో 68000 అంటే మన రూపాయలలో సుమారు 44 లక్షలు . ఆ దేశంలోని ఉద్యోగుల సగటు వార్షిక జీతం రూ.50వేలు. డాక్టర్లకంటే చాలా ఎక్కువ. టీచర్లకు ఎక్కువ జీతాలు చెల్లించే దేశాల్లో నెదర్లాండ్స్‌, జర్మనీ, బెల్జియం, తరువాతి స్థానాల్లో ఉన్నట్టు పేర్కొంది. 
 విద్యా ప్రమాణాలు, అభ్యసన సామర్ధ్యాల స్థాయి కూడా ఉపాధ్యాయుల హోదాకు వన్నెతెస్తాయి. ఈ విషయంలో ఫిన్లాండ్‌ మొదటి స్థానంలో ఉండగా ఉత్తరకొరియా, జెకొస్లేవేకియా, హంగరీ తరువాతి స్థానాల్లో ఉన్నాయి.
ఓఈసీడీ (ఆర్థిక సహకార అభివృద్ధి సంస్థ)లోని 21 దేశాల్లో ఉపాధ్యాయుల  పనిభారం సగటున వారానికి 38 గంటలు. జపాన్‌లో 54, బ్రిటన్‌లో 39 గంటలు చొప్పున పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. 
 మనభారత దేశంలో కాంట్రాక్ట్‌, గెస్ట్‌, పార్ట్‌టైమ్‌ సిపియస్  తదితర పద్ధతులతో లక్షలాదిమంది టీచర్లకు వృత్తి భద్రత లేకుండా చేస్తున్నారు. 2004 నుండి నియామకం అయినవారికి పెన్షన్‌ కూడా లేకపోతున్న విషయం తెలిసిందే. ఎన్ని పోరాటాలు చేసినా న్యాయం జరగడం లేదు.
 ప్రపంచ దేశాలలో గత ఏడాది నుంచి ఈనాటి వరకూ విద్యారంగ తీరుతెన్నులను పరిశీలిస్తే భారతదేశంలోనే కాదు ప్రపంచీకరణ విధానాలు అమలవుతున్న అనేక దేశాలలో విద్యారంగం సంక్షోభంలో పడింది. గత విద్యా సంవత్సరం ప్రారంభంలోనే అంతర్జాతీయ ఆర్థికాభివృద్ధి సర్వే వెలువరించిన అంశాలు ఆందోళన కలిగించేవిగా ఉన్నాయి. ఇప్పుడు అవే రుజువవుతున్నాయి. విద్యపై పెట్టుబడులు తగ్గించాలనే ధోరణి పలు దేశాలలో విద్యారంగ పరిస్థితులకు అద్దం పడుతుంది. సరళీకరణ విధానాలు ఉపాధ్యాయవృత్తి ఔన్నత్యాన్ని తగ్గించేవిగా ఉన్నాయి. విద్యా రంగంలో ప్రపంచ ఉపాధ్యాయుల పరిస్థితి అంటే ప్రపంచ విద్యారంగ పరిస్థితిగానే చూడాలి. అంతర్జాతీయంగా ఆమోదించిన విద్యా లక్ష్యాలను చేరుకోవడానికి సుమారు 1.70 కోట్ల మంది ఉపాధ్యాయులు ఇంకా అవసరమని యునెస్కో చెప్పింది. ఉపాధ్యాయులకు భరోసా ఇచ్చి, బోధనా వృత్తిని ఆకర్షణీయంగా,సృజనాత్మకంగా తీర్చిదిద్దే పరిస్థితులు లేకపోవడంతో సమాజంలో ఉపాధ్యాయునికి దక్కవలసిన గౌరవం,హోదాకనుమరుగవుతోంది. విద్య మార్కెట్‌ సరుకుగా మారింది.
కనుకనే అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాలలో కూడా ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటీకరించే పనిచేస్తున్నారు. 
 అనేక దేశాలలో ముందస్తు ప్రణాళికలతో సామాజిక బాధ్యతగా ప్రభుత్వాలు విద్యను స్వీకరిస్తున్నాయి. ఉత్తర ఐరోపా, ఫిన్లాండ్‌, క్యూబా, చైనా, వెనిజులా వంటి దేశాలలో ప్రభుత్వ విద్యకు ప్రాధాన్యత ఇవ్వడం వలన టీచర్‌ స్థానం చాలా గౌరవంగా ఉందని, లింగ వివక్షత లేదని, నేర చరిత లేదని ఆ దేశాల అనుభవాలు చెబుతున్నాయి.
 ఏ దేశ ఆర్థిక వ్యవస్థ విజయానికైనా కీలకమైన అంశం విద్య అని ఐక్యరాజ్యసమితి నిర్వచనానికి అర్థంమారిపోతోంది.వృత్తిరీత్యా ఉపాధ్యాయులందరూ ప్రజాస్వామిక పనివిధానం. సమానత్వం, సామాజిక న్యాయం, సెక్యులర్‌ భావాలు, శాస్త్రీయ ఆలోచనలు, నైతిక విలువలు, చారిత్రక దృక్పథం లాంటి అంశాలు బోధించటమే పని. ఆ పనిలో రాణించటం ద్వారానే సమాజంలో సముచిత హోదా సాధించగలరు.నేటి ప్రయివేటీకరణ , మార్కెట్‌ ఆర్థిక విధానాల నేపథ్యంలో ఉపాధ్యాయులు సరికొత్త సవాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో ఉపాధ్యాయ దినోత్సవ స్ఫూర్తిని గుర్తించి ఆచరించటానికి పాలకులు, ఉపాధ్యాయులు పునరంకితం కావాలి. విద్యారంగాన్ని సముచిత స్ఢానంలో నిల్పాలి.
కోవిడ్ అనంతరం విద్యా రంగం అనేకసవాళ్లుఎదుర్కొంటుంది.రెండేళ్ల కాలం పాటు పిల్లలు చదువుకు దూరం అయ్యారు.ముఖ్యంగా పేద పిల్లలు మరింత నష్టపోయారు. ప్రయివేటు ఉపాధ్యాయులు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు.ఇప్పుడు విద్యా రంగంలో వేగంగా మార్పులు వస్తున్నాయి. సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశ పెడుతున్నారు.సాంకేతిక పరిజ్ఞానం ఎప్పుడూ కూడా ఉపాధ్యాయులకు ఒక బోధనాఉపకరణమే అని గుర్తు పెట్టుకోవాలి.
కాలానుగుణంగా ఏ రంగంలోనైనా మార్పులు అవసరమే. ఇందుకుగాను విస్తృతమైన చర్చలు అవసరం. ఇందులో తల్లి తండ్రులని,ఉపాధ్యాయులకు అవకాశం కల్పించాలి.వారు చేసే సూచనలని స్వాగతించాలి.ప్రతి పాఠశాల కు మౌలిక సదుపాయాల కల్పన అవసరమే.అదే సమయంలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు ఉండేట్లు చూడాలి.వారికి ఎన్నికల విధులు,జనాభా లెక్కలు వంటివి తప్ప వేరే బోధనేతర పనులు అప్పగించరాదు. వారు వినూత్నంగా,సృజనాత్మకంగా బోధించేందుకు అవసరమైన వాతావరణాన్ని కల్పించాలి.
ఉపాధ్యాయులు కేవలం తమ హక్కులకోసమేపోరాడరు.ఇందులో ఇతర ఉద్యోగుల సమస్యలు, ప్రజల సమస్యలు కూడా ఉంటాయి.విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు  ఉపాధ్యాయులు తగిన కృషి  చేయాలి.ఇందుకు అధికారులు వారికి సహకరించాలి.తల్లి తండ్రులు, ఉపాధ్యాయులు, అధికారులు ఉమ్మడిగా కృషి చేస్తేనే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుంది.
యం. రాం ప్రదీప్
తిరువూరు
9492712836

Stay informed about the latest government job updates with our Sarkari Job Update website. We provide timely and accurate information on upcoming government job vacancies, application deadlines, exam schedules, and more.

Categories

Category 1

Category 2

Category 3

Category 4

Category 5

error: Content is protected !!