ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలు ఇప్పట్లో లేనట్లేనా? అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. ప్రొబేషన్ డిక్లయిర్ కాగానే బదిలీలు ఉంటాయని ఆశించిన ఉద్యోగుల ఆశలు ఇప్పట్లో నెరవేరే అవకాశాలు కనబడటం లేదు. దసరా కానుకగా బదిలీలు ఉంటాయని అందరూ ఆశించినప్పటికీ ఆచరణలో ఇందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ష్టాత్మకంగా భావిస్తున్న ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో సచివాలయ ఉద్యోగుల బదిలీలు చేపడితే పరిపాలన పరంగా కొంతమేర అస్తవ్యస్త పరిస్థితులు నెలకొనే అవకాశాలుంటాయని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అంతేకాకుండా ప్రజా ప్రతినిధులకు ప్రజల నుంచి వచ్చిన అర్జీలు స్క్రూట్నీ జరుగుతున్న నేపథ్యంలో అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలు అమలు కుంటుపడే అవకాశముందని ప్రభుత్వం భావిస్తు న్నట్లు సమాచారం. ఇటువంటి పరిస్థితుల్లో కనీసం సంక్రాంతి వరకైనా బదిలీల ప్రక్రియ చేపట్టకుండా ఉంటే మంచిదని పలువురు ఎమ్మెల్యేలు సిఎంఒ కార్యాలయంపై ఒత్తిడి తెస్తు న్నట్లు తెలిసింది. అయితే గ్రామ సచివాలయ ఉద్యోగుల పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఉద్యోగం వస్తుందనే ఆశతో ఏ జిల్లాలో ఉద్యోగం దొరికితే ఆ జిల్లాకు వెళ్లామని, కుటుంబం, భార్యా బిడ్డలు ఒకచోట తాము ఒకచోట ఉంటున్నామని, ఇటువంటి పరిస్థితుల్లో కుటుంబానికి దూరమయ్యా మని సచివాలయ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మానసిక ఒత్తిడికి కూడా గురవు తున్నట్లు పలువురు చెబుతున్నారు. అలాగే ఇఎస్‌ఐ అమల్లోకి రాకపోవడం గ్రామ సచివాలయ ఉద్యోగులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ప్రభుత్వం ఇకనైనా తమ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుని బదిలీల ప్రక్రియ చేపట్టాలని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు
సచివాలయ ఉద్యోగుల బదిలీలు ఇప్పట్లో లేనట్లేనా..?:సంక్రాంతి వరకు ఆపాలని ఎమ్మెల్యేల ఒత్తిడి !
You might also check these ralated posts.....