*♦️గణితం, భాషా సామర్థ్యాల్లో ఏపీ విద్యార్థుల వెనుకంజ*
*♦️అన్నింటా అథమ స్థానంలో తమిళనాడు*
*♦️కేంద్రం, ఎన్‌సీఈఆర్‌టీ నివేదికలో వెల్లడి*
*♦️3వ తరగతి విద్యార్థులపై అధ్యయనం*
*🌻న్యూఢిల్లీ, సెప్టెంబరు 8:* రాష్ట్రంలోని 91 శాతం మంది విద్యార్థులు చిన్నచిన్న కూడికలు, తీసివేతలు కూడా చేయలేకపోతున్నారు. కేవలం 9శాతం మందికి మాత్రమే గణితంపై చెప్పుకోదగిన స్థాయిలో పట్టు ఉంది. ఇక తప్పుల్లేకుండా తెలుగు చదవగలిగే విద్యార్థులు 9శాతమే. మ్యాథ్స్ భావనల విషయంలో విద్యార్థులకు కనీస అవగాహన లేదు. ఈ విషయంలో పొరుగునున్న కర్ణాటక(8), కేరళ(7) రాష్ట్రాలు ఏపీ కంటే మెరుగ్గా ఉన్నాయి. తెలంగాణలో ఇది 11శాతంగా ఉంది. అయితే తమిళనాడు (29), గుజరాత్(18), ఛత్తీ్‌సగఢ్(14), మధ్యప్రదేశ్(13) వంటి రాష్ట్రాల కంటే తెలుగు రాష్ట్రాల విద్యార్థులు మెరుగ్గా ఉన్నారు. అలాగే రాష్ట్రంలో 9శాతం మంది విద్యార్థులకు మాత్రమే అద్భుతమైన గణిత సామర్థ్యాలు ఉన్నాయి. వీళ్లు సంక్లిష్టమైన మ్యాథ్స్ ప్రాబ్లమ్స్‌కు సమాధానాలు కనుక్కోగలుగుతున్నారు. ఈ కేటగిరీలో గుజరాత్(7), ఢిల్లీ(7), పంజాబ్(8) కంటే ఏపీ మెరుగైన స్థానంలో ఉండగా… తెలంగాణ (11), కర్ణాటక(14), ఒడిశా(14), బిహార్(18), యూపీ(13)తో పోలిస్తే వెనుకంజలో ఉంది. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రెయినింగ్ (ఎన్‌సీఈఆర్‌టీ), కేంద్ర విద్యాశాఖ సంయుక్తంగా చేసిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 3వ తరగతి చదువుతున్న విద్యార్థులను ఈ అధ్యయనం కోసం ఎంచుకున్నారు. కనీస గణిత పరిజ్ఞానం (బేసిక్ న్యూమరసీ – నంబర్లను గుర్తించడం, కూడికలు, తీసివేతలు, భాగహారాలు, గుణకారాలు, భిన్నాలు, ఆకారాలు), మాతృభాషలో చదవడం, రీడింగ్ కాంప్రహెన్షన్ అంశాల్లో విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. మొత్తంగా చూస్తే… జాతీయ స్థాయిలో 11శాతం మంది విద్యార్థులకు కనీస స్థాయిలో కూడా ఆయా సామర్థ్యాలు లేవు. 37శాతం మంది ఫర్వాలేదు అనిపించే స్థాయిలో, ఇంకో 42శాతం మంది మరికొంత మెరుగ్గా ఉన్నారు. 10శాతం మంది విద్యార్థులకు మాత్రమే తమ తరగతికి అవసరమైనస్థాయిలో గణిత, భాషాసామర్థ్యాలు ఉన్నాయని అధ్యయనం పేర్కొంది.
*♦️30శాతం మందికి తెలుగు తీసికట్టే…:* తెలుగు చదవటం, రీడింగ్ కాంప్రహెన్షన్ అంశాల్లో కూడా విద్యార్థుల సామర్థ్యాలను నివేదిక అంచనా వేసింది. దీనికోసం రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులను కలిపి అధ్యయనం చేశారు. ఇరురాష్ట్రాల్లో కలిపి 30శాతం మంది విద్యార్థులకు తెలుగులో ఉండాల్సినంత పరిజ్ఞానం లేదు. వీళ్లు ఒక నిమిషం పాటు తెలుగు చదివితే అందులో తప్పుల్లేకుండా చదివే పదాలు 8లోపు ఉంటున్నాయి. అలాగే 9శాతం మంది విద్యార్థులకు తెలుగు భాషా సామర్థ్యాలు బాగున్నాయి. వీరు తెలుగులో తాము చదివింది బాగా అర్థం చేసుకోగలుగుతున్నారని నివేదిక పేర్కొంది. కాగా 42 శాతం మంది తమిళ విద్యార్థులకు కనీస భాష సామర్థ్యాలు లేవని వెల్లడించింది. గణిత సామర్థ్యాల విషయంలోనూ అన్ని రాష్ట్రాలకంటే తమిళనాడు వెనుకంజలో ఉంది. ఆ రాష్ట్రంలో 29శాతం మంది విద్యార్థులకు కనీస గణిత సామర్థ్యాలు లేవు.