Telangana:తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 5,111 అంగన్‌వాడీ టీచర్లు, ఆయా పోస్టులను వెంటనే భర్తీ చేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. 58, 59 జీవోల కింద పేదలకు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలనీ కేబినెట్ నిర్ణయించింది.
తెలంగాణలో జరుగుతున్న స్వతంత్ర భారత వజ్రోత్సవాల కానుకగా ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలో కొత్తగా 10 లక్షల మందికి ఆసరా పింఛన్లు మంజూరు చేయాలని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించింది. రాష్ట్రంలో ఇప్పటికే 36 లక్షల మంది పింఛన్లు పొందుతున్నారు. వీటితో కలిపి మొత్తం పింఛన్లు 46 లక్షలకు చేరనున్నాయి. గ్రామకంఠంలో నూతన ఇళ్ల నిర్మాణానికి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల శాశ్వత పరిష్కారానికి అధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేయనున్నారు.