NATIONAL BEST TEACHER TELUGU STATE’S WINNER’s TALK

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

NATIONAL BEST TEACHER TELUGU STATE’S WINNER’s TALK

బడి… బిడ్డను విద్యార్థిగా మార్చే అక్షరాల ఒడి. ఆ ఒడిలో పిల్లలు హాయిగా అక్షరాలు దిద్దాలి. భవిష్యత్తును బంగారంగా దిద్దుకోవాలి. బిడ్డల భవిష్యత్తును దిద్దే చేతులకు వందనం. ఉపాధ్యాయ వృత్తికి వందనం. వృత్తికి వన్నె తెచ్చిన గురువులకు వందనం.

ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అంటే విద్యాబోధనలో విశిష్ట సేవలందించిన ఉపాధ్యాయులకు ఓ గుర్తింపు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఉత్తమ ఉపాధ్యాయులుగా పురస్కారం అందుకుంటున్న వారిలో ఇద్దరు మహిళలున్నారు. ఒకరు ఆంధ్రప్రదేశ్‌లోని కానూరు ‘జిల్లా పరిషత్‌ హైస్కూల్‌’ ఫిజిక్స్‌ టీచర్‌ రావి అరుణ. మరొకరు హైదరాబాద్, నాచారం, ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ ప్రిన్సిపల్‌ సునీతారావు.

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సెప్టెంబరు ఐదవ తేదీన న్యూఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో వీరికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు ప్రదానం జరుగుతుంది. సునీతారావు, రావి అరుణ ఈ సందర్భంగా తమ సంతోషాన్ని సాక్షితో పంచుకున్నారు.

‘‘మాది మైసూర్‌. బాల్యం హైదరాబాద్‌లోనే. ఐదవ తరగతి వరకు సెయింట్‌ ఆన్స్‌లో చదివాను. ఆరవ తరగతి నుంచి చెన్నై. నా బోధన ప్రస్థానం కర్నాటక రాష్ట్రం తుముకూరులోని టీవీఎస్‌ అకాడమీలో మూడవ తరగతి టీచర్‌గా మొదలైంది. ఆశ్చర్యంగా అనిపించే విషయం ఏమిటంటే నేను చదువు చెబుతూ చదువుకున్నాను.

ఉద్యోగం చేస్తూ ఎంఏ ఎకనమిక్స్, ఎంఫిల్‌ పూర్తి చేశాను. ఆ తర్వాత కేంబ్రిడ్జిలో డిప్లమో, హార్వర్డ్‌ యూనివర్సిటీలో చదివాను… ఇలా ఏటా స్కూల్‌ వెకేషన్‌ని నేను ఏదో ఒక కోర్సుకోసం ప్లాన్‌ చేసుకునేదాన్ని. నాకిష్టమైన గణితం కోసం చెన్నైలోని రామానుజమ్‌ అకాడమీలో శిక్షణ తీసుకున్నాను.

ముప్పై రెండేళ్ల సర్వీస్‌లో నేను పిల్లలకు ఎన్నో నేర్పించాను, అంతకంటే ఎక్కువగా నేను నేర్చుకున్నాను. టీచర్‌ ఎప్పుడూ ఒకచోట ఆగిపోకూడదు. నిత్య విద్యార్థిలా రోజూ కొత్త విషయాలను నేర్చుకుంటూ ఉండాలి. పుస్తకాల్లో ఉన్న విషయాన్ని చెప్పి పాఠాలు ముగిస్తే సరిపోదు. కొత్త విషయాలను తెలుసుకుంటూ వాటిని దైనందిన జీవితానికి అన్వయిస్తూ పాఠం చెప్పాలి.

అలాగే ఏ తరగతికి అవసరమైతే ఆ తరగతికి పాఠం చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. నేను థర్డ్‌ క్లాస్‌ టీచర్‌గా చేరినా, అవసరమైనప్పుడు ఫస్ట్‌ స్టాండర్డ్‌కి కూడా పాఠాలు చెప్పాను. పన్నెండో తరగతి టీచర్‌ అయినా సరే ఒకటవ తరగతి టీచర్‌ లేనప్పుడు ఆ క్లాస్‌ను తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి.

అలాగే పాఠాన్ని సృజనాత్మకంగా చెప్పాలి. పిల్లలకు ఏ పదాలు అర్థం అవుతున్నాయో ఆ పదాల్లో వివరించాలి. వృత్తి పట్ల గౌరవం, విశ్వాసం ఉండాలి. రూల్స్‌కోసం పని చేసే వృత్తి కాదిది. అవసరమైన విధంగా ఒదిగిపోవాలి. కొంతమంది పిల్లలు డిప్రెషన్‌కు లోనవుతుంటారు. చదువు మీద ఆసక్తి సన్నగిల్లడం మొదలవుతుంది. ఆ విషయాన్ని తల్లిదండ్రుల కంటే ముందు పసిగట్టగలిగింది టీచర్‌ మాత్రమే.

పేరెంట్స్‌ వచ్చి చెప్పేవరకు టీచర్‌ గుర్తించని స్థితిలో ఉండకూడదు. అలాంటి పిల్లల విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెడుతుంటాను నేను. వాళ్లతో విడిగా మాట్లాడి, కౌన్సెలింగ్‌ ఇవ్వడం, వారి కోసం మెంటార్‌గా ఒక టీచర్‌కు బాధ్యత అప్పగించడం ద్వారా ఆ స్టూడెంట్‌ తిరిగి చదువుమీద మునుపటిలా ధ్యాస పెట్టేవరకు కనిపెట్టి ఉండాలి. అలాంటప్పుడు తల్లిదండ్రులు వచ్చి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియచేస్తుంటారు. టీచర్‌గా అత్యంత సంతోష పడే క్షణాలవి.

గురుశిష్యుల బంధం
విద్యార్థులు అమ్మానాన్న తర్వాత ఆదర్శంగా తీసుకునేది టీచర్‌నే. అందుకే టీచర్‌ గౌరవప్రదంగా కనిపించాలి. ఆహార్యం, మాటతీరు, నడవడిక… ప్రతి విషయంలోనూ ఆదర్శనీయంగా ఉండాలి. గురుశిష్యుల బంధం ఉన్నతమైంది. స్టాఫ్‌రూమ్‌లో ఉపాధ్యాయుల మధ్య జరిగే సంభాషణ కూడా పిల్లల మీద ప్రభావాన్ని చూపిస్తుంది.

విద్యాబోధనకు అవసరమైన చర్చలే ఉండాలి. అలాగే ప్రతి టీచరూ క్లాస్‌కి వెళ్లే ముందు ఏం చెప్పాలనే విషయం మీద తప్పనిసరిగా హోమ్‌వర్క్‌ చేయాలి, పాఠం చెప్పిన తర్వాత సరిగ్గా చెప్పానా లేదా అని స్వీయ విశ్లేషణ చేసుకోవాలి. ఇదే ఒక టీచర్‌గా నా తోటి ఉపాధ్యాయులకు నేను చెప్పగలిగిన మంచిమాట’’ అన్నారు సునీతారావు.

పాఠం చెప్పి ఊరుకుంటే చాలదు!
ప్రిన్సిపల్‌గా విద్యార్థులను తీర్చిదిద్దడానికి ప్రత్యేకంగా కరికులమ్‌ రూపొందిస్తుంటాను. గ్లోబల్‌ ఎక్స్‌పోజర్‌ ఉండాల్సిన తరం ఇది. ఒకప్పటిలా సిలబస్‌కే పరిమితమైతే సరిపోదు. క్యారెక్టర్‌ బిల్డింగ్‌ చాలా ముఖ్యం. విలువలు, క్రమశిక్షణ, ధైర్యం, అంకితభావం, నిజాయితీ వంటివన్నీ వ్యక్తిత్వానికి ఒక రూపునిస్తాయి. అలాగే ప్రతి ఒక్కరిలో ప్రత్యేకమైన నైపుణ్యం ఏదో ఒకటి ఉంటుంది. దానిని గుర్తించి ప్రోత్సహించాలి.

అప్పుడే పిల్లలకు పరిపూర్ణమైన విద్య అందుతుంది. మా దగ్గర స్పోర్ట్స్‌ ప్రాక్టీస్‌ చేసే విద్యార్థులకు అవసరమైన సెలవులు ఇవ్వడం, వారి కోసం సాయంత్రం ప్రత్యేక తరగతులు చెప్పించి పరీక్షలు పెట్టడం వంటి మార్పులు చేశాను. టీచర్‌ అంటే విద్యార్థులకు పాఠం చెప్పడమే కాదు, వారి భవిష్యత్తు కలలకు ఒక రూపం ఇవ్వాలి, ఆ కలల సాకారానికి అవసరమైన నైపుణ్యాన్ని పెంపొందించాలి.
– సునీతారావు, ప్రిన్సిపల్, ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్, నాచారం, సికింద్రాబాద్‌

సైన్స్‌ ఎక్కడో లేదు…
‘‘నేను పుట్టింది గుంటూరు జిల్లా అనంతవరప్పాడులో. పెరిగింది మాత్రం మచిలీపట్నంలో. మా నాన్న రావిరంగారావు బీఎస్సీ కాలేజ్‌ ప్రిన్సిపల్, అమ్మ ప్రభావతి. అమ్మ కూడా టీచరే. ఆ నేపథ్యమే నన్ను బోధనరంగం వైపు మళ్లించి ఉంటుంది. నిజానికి చిన్నప్పుడు నా మదిలో ‘భూమి ఎలా పుట్టింది, గ్రహాలు వలయాకారంలో ఎందుకుంటాయి’ వంటి అనేక ప్రశ్నలు మెదిలేవి. అలాగే సైంటిస్ట్‌ కావాలనే ఆలోచన కూడా.

కానీ ఎందుకో తెలియదు బీఈడీలో చేరిపోయాను. బీఈడీ పూర్తయిన వెంటనే 1996లో ఉద్యోగం వచ్చింది. ఫస్ట్‌ పోస్టింగ్‌ విజయవాడలోని ఎనికేపాడులో. అక్కడి తోటి ఉపాధ్యాయుల ప్రభావంతో బోధనను బాగా ఎంజాయ్‌ చేశాను. చదువు చెబుతూనే చదువుకుంటున్నాను. ఎమ్మెస్సీ, ఎమ్‌ఈడీ, విద్యాబోధనలో ఇన్నోవేటివ్‌ టీచింగ్‌ టెక్నాలజీస్‌ మీద íపీహెచ్‌డీ పూర్తయింది. ఇప్పుడు ఫిజిక్స్‌ లో మరో పీహెచ్‌డీ చేస్తున్నాను.

ప్రత్యామ్నాయం వెతకాలి!
సైన్స్‌ అంటే పుస్తకాల్లో ఉండేది కాదు, మన చుట్టూ ఉంటుందని చెప్పడంలో విజయవంతమయ్యాను. పరిశోధన ల్యాబ్‌లో మాత్రమే కాదు, ఇంట్లో కూడా చేయవచ్చని నేర్పించాను. పరిశోధనకు ఒక వస్తువు లేకపోతే ప్రత్యామ్నాయంగా అదే లక్షణాలున్న మరో వస్తువును ఎంచుకోవడం గురించి ఆలోచింపచేశాను. యాసిడ్‌ లేదని పరిశోధన ఆపకూడదు, నిమ్మరసంతో ప్రయత్నించాలి.

అలాగే ఇంట్లో వాడిపారేసే వస్తువులను, ఆఖరుకు కోడిగుడ్డు పెంకులను కూడా స్కూల్‌కి తెప్పించి వాటితోనే పరిశోధన చేయించేదాన్ని. ఒక్కమాటలో చెప్పాలంటే సైన్స్‌ని జీవితానికి అన్వయించుకోవడం ఎలాగో నేర్పిస్తాను. కొంతమంది పిల్లలు పుస్తకంలో ఉన్నదానిని క్షుణ్ణంగా మెదడుకు పట్టించుకుంటారు. కానీ తమ ఎదురుగా ఉన్న విషయం మీద అపై్ల చేయడంలో విఫలమవుతుంటారు. నా స్టూడెంట్స్‌ అలా ఫెయిల్‌ కారు.

దోమలను పారదోలగలిగేది రెడీమేడ్‌ మస్కిటో రిపెల్లెంట్‌ మాత్రమే కాదు బంతిచెట్టు కిటికీలో పెట్టినా ఫలితాన్ని పొందవచ్చని నా విద్యార్థులకు తెలుసు. ఫీల్డ్‌ ఎడ్యుకేషన్‌కి వాటర్‌ వర్క్స్‌తోపాటు ప్రతి డిపార్ట్‌మెంట్‌కీ తీసుకుని వెళ్తాం. మా స్కూల్‌ విద్యార్థులు చేసిన ప్రయోగాలు స్టేట్‌ సైన్స్‌ కాంగ్రెస్‌లో ప్రదర్శితమయ్యాయి. నేషనల్‌ ఇన్‌స్పైర్‌ మనక్‌లో రెండు ప్రాజెక్టులు ప్రదర్శించాం.

ఇస్రో సైన్స్‌ క్విజ్‌లో రెండేళ్లు పాల్గొనడంతోపాటు మా విద్యార్థులు గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ గారి చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్నారు. తక్కువ వనరులున్న పాఠశాల నుంచి పిల్లలను జాతీయ స్థాయి వేదికల వరకు తీసుకెళ్లగలుగుతున్నందుకు గర్వకారణంగా ఉంది. రేడియో ప్రసంగాల్లో ఎక్కువగా మహిళాసాధికారత గురించి మాట్లాడేదాన్ని. అలాగే ఈ పురస్కారాన్ని దేశానికి ఫస్ట్‌ సిటిజన్‌ హోదాలో ఉన్న ఒక మహిళ చేతుల మీదుగా అందుకోవడం సంతోషంగా ఉంది.
– రావి అరుణ, ఫిజిక్స్‌ టీచర్, జిల్లా పరిషత్‌ పాఠశాల, కానూరు, కృష్ణాజిల్లా

– వాకా మంజులారెడ్డి
ఫొటోలు: నడిపూడి కిషోర్‌

Stay informed about the latest government job updates with our Sarkari Job Update website. We provide timely and accurate information on upcoming government job vacancies, application deadlines, exam schedules, and more.

Categories

Category 1

Category 2

Category 3

Category 4

Category 5

error: Content is protected !!