ANDHRA PRADESH COMMISSIONER OF SCHOOL EDUCATION S.SURESH KUMAR TALK ABOUT AP SCHOOL EDUCATION REFORMS:బంగారు భవితకు పటిష్ట ‘పునాది’
చిన్నారులకు ప్రాథమిక దశలోనే అత్యుత్తమ విద్యాబోధన
3వ తరగతి నుంచే సబ్జెక్టు టీచర్లు
దశలవారీగా 5,968 ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హైస్కూళ్ల మ్యాపింగ్
పెద్ద ఎత్తున అదనపు తరగతి గదుల నిర్మాణం
8 వేల ఎస్జీటీ పోస్టులు ఎస్‌ఏలుగా అప్‌గ్రేడ్
వెయ్యి వరకు ఎస్‌ఏ పోస్టులు హెచ్‌ఎంలుగా ఉన్నతి
చకచకా ఏర్పాట్లు చేస్తున్న పాఠశాల విద్యాశాఖ
ఓ భవనమైనా.. మనిషి వ్యక్తిత్వమైనా పునాది బాగుంటేనే ఆటుపోట్లను తట్టుకుని కలకాలం నిలబడుతుంది. ఫౌండేషన్ సరిగా లేకుండా ఆ తరువాత భారం మోపితే ఏమవుతుంది? అంత బరువు తట్టుకోలేక కుప్పకూలుతుంది. అందుకనే ప్రాథమిక విద్యకు అత్యంత ప్రాధాన్యమిస్తూ, చిన్నారులను చేయి పట్టి నడిపిస్తూ, సంప్రదాయ విధానంలోని లోపాలను సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. దీర్ఘకాలంగా మన ప్రాథమిక విద్యా విధానం సరిగా లేకపోవడమే నాసిరకం ప్రమాణాలకు కారణమని అనేక నివేదికలు తేల్చి చెప్పిన నేపథ్యంలో ఫౌండేషన్ విద్యకు అత్యంత ప్రాధాన్యమిచ్చి పునాది స్థాయి నుంచే బంగారు భవితకు ప్రభుత్వం బాటలు వేస్తోంది.
ప్రభుత్వ పాఠశాలలను అన్ని మౌలిక వసతులతో తీర్చిదిద్ది ఉన్నత ప్రమాణాలతో అందరూ ఉచితంగా విద్య అభ్యసించే అవకాశం కల్పిస్తోంది. అత్యుత్తమ మానవ వనరులే లక్ష్యంగా విద్యారంగ సంస్కరణలు చేపట్టింది. తల్లిదండ్రులకు ఏమాత్రం భారం కాకుండా, పిల్లలంతా తప్పనిసరిగా స్కూళ్లకు వచ్చేలా జగనన్న అమ్మ ఒడి, విద్యాకానుక, పోషక విలువలతో కూడిన గోరుముద్ద లాంటి పథకాలను అమలు చేస్తూ ప్రాథమిక విద్యను పరిపుష్టం చేస్తోంది.
చిన్నారుల్లో మనోవికాసం గరిష్ట దశలో ఉండే సమయంలో సబ్టెక్టు టీచర్లను నియమించి విద్యాభాసం ఆహ్లాదకరంగా కొనసాగేలా జాగ్రత్తలు తీసుకుంది. విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా స్కూలింగ్ విధానంలో మార్పులు చేసింది. తొలిసారిగా విద్యార్థి కేంద్రంగా విప్లవాత్మక మార్పులు చేపట్టింది. ఫౌండేషన్ నుంచే ఉత్తమ బోధన అందించడంతోపాటు పైతరగతులకు వెళ్లే కొద్దీ ప్రపంచ స్థాయి విద్యా ప్రమాణాలతో తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నూతన విధానాన్ని ప్రవేశపెట్టారు.
3 నుంచే సబ్జెక్టు టీచర్లతో బోధన
చిన్నారుల్లో 8 ఏళ్లలోపే మేథో వికాసం పూర్తిస్థాయిలో ఉంటుందని పలు శాస్త్రీయ పరిశోధనలు వెల్లడిస్తున్న నేపథ్యంలో దేశంలోనే తొలిసారిగా పునాది విద్య బలోపేతం దిశగా రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో విప్లవాత్మక మార్పులను తెస్తోంది. విద్యార్ధుల సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆరంచెల విధానంలో స్కూళ్లు ఏర్పాటు చేస్తోంది.
కొత్త విధానంలో ఒక్క స్కూలు కూడా మూతపడకుండా, ఏ ఒక్క టీచర్ పోస్టూ తగ్గకుండా జాగ్రత్తలు చేపట్టారు. ఫౌండేషన్ విద్య బలోపేతంతో పాటు 3వ తరగతి నుంచే విద్యార్ధులకు సబ్జెక్టు టీచర్లతో బోధన నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు. ఫౌండేషన్ స్కూళ్లతో 5+3+3+4 విధానంలో తరగతులు ఏర్పాటవుతున్నాయి. అంగన్‌వాడీ కేంద్రాల్లో పీపీ 1, పీపీ 2 తరగతులను ఏర్పాటు చేసి స్కూళ్లకు అనుసంధానిస్తూ పునాది స్థాయి నుంచే అక్షర, సంఖ్యా పరిజ్ఞానానికి బాటలు వేస్తున్నారు.
పాత విధానంలో పునాది విద్యపై నిర్లక్ష్యం
ఇప్పటివరకు అమలవుతున్న అంగన్‌వాడీ, ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హైస్కూల్, జూనియర్ కాలేజీల విద్యా విధానంలో విద్యార్ధులకు సరైన బోధన అందక సామర్థ్యాలు మెరుగుపడడం లేదు. ఇదే అంశాన్ని పలువురు నిపుణులు రూపొందించిన నివేదికలు స్పష్టం చేశాయి. ముఖ్యంగా పునాది విద్యకు పాత విధానంలో చోటే లేదు. అంగన్‌వాడీలను స్కూలింగ్ విధానంలో భాగంగా పరిగణించకపోవడంతో అక్కడ చేరే పిల్లలకు స్కూలు వాతావరణం, అక్షర పరిజ్ఞన నైపుణ్యాలు అలవడే పరిస్థితి లేకుండా పోయింది.
నేరుగా ఒకటో తరగతిలో చేరుతున్న చిన్నారులకు ఫౌండేషనల్ లిటరసీ, న్యూమరసీ (ఎఫ్‌ఎల్‌ఎన్) ప్రమాణాలు కొరవడటంతో విద్యా ప్రమాణాల్లో వెనుకబడుతున్నారు. పైతరగతులకు వెళ్లే కొద్దీ అందుకు తగ్గ సామర్థ్యాలు సంతరించుకునే పరిస్థితి లేకుండా పోయింది. ప్రైమరీ స్కూళ్లలో 1నుంచి 5వ తరగతి వరకు 18 సబ్జెక్టులను ఒకరిద్దరు టీచర్లే బోధించాల్సి రావడంతో విద్యార్ధుల్లో ప్రమాణాలు మెరుగుపడలేదు.
నాడు.. దిగజారిన ప్రమాణాలు
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా కార్పొరేట్ విద్యాసంస్థలను ప్రోత్సహిస్తూ ప్రభుత్వ విద్యాసంస్థలను మరింత దిగజార్చారు. ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాలు క్షీణించాయి. ఈ అంశాలను 2018లో పలు సర్వేలు వెల్లడించాయి. అసర్ నివేదిక ప్రకారం మూడో తరగతి విద్యార్ధుల్లో 22.4 శాతం మంది మాత్రమే రెండో తరగతి పుస్తకాలను చదవగలుగుతున్నారు. 3వ తరగతి విద్యార్ధులలో 38.4 శాతం మాత్రమే తీసివేతలు చేయగలుగుతున్నారు. 5వ తరగతి పిల్లల్లో 39.3 శాతం మందికి మాత్రమే భాగాహారాలు వచ్చు. 8వ తరగతి పిల్లల్లో 47.6 శాతం మంది మాత్రమే భాగాహారాలు చేయగలుగుతున్నారంటే పరిస్థితిని ఊహించవచ్చు.
ఇక స్టేట్ లెవల్ అఛీవ్‌మెంట్ సర్వే (స్లాస్) నివేదిక ప్రకారం రాష్ట్ర విద్యార్ధుల్లో పఠన సామర్థ్యాలు చాలా పేలవంగా ఉండడంతో పాటు ఇతర నైపుణ్యాలు కొరవడ్డాయి. 6 నుంచి 10వ తరగతి విద్యార్ధుల్లో భాషా నైపుణ్యాలు 63.50 శాతం నుంచి 49.40 శాతానికి తగ్గిపోయాయి. మేథమెటిక్స్‌లో అయితే 69.55 శాతం నుంచి 39.30 శాతానికి కుదించుకుపోయాయి. నేషనల్ అఛీవ్‌మెంట్ సర్వే (న్యాస్) ప్రకారం పదో తరగతిలో 60 శాతం విద్యార్ధులకు ప్రధాన సబ్జెక్టులతో పాటు భాషల్లోనూ సరైన సామర్థ్యాలు లేవని తేలింది. టెన్త్ విద్యార్ధులలో ఎక్కువ మంది ఇంగ్లీషు లేదా తెలుగు వాక్యాన్ని తప్పులు లేకుండా చదవడం, రాయడం కూడా రాని పరిస్థితి నెలకొందని వెల్లడించింది. పరిస్థితి ఇంత అధ్వాన్నంగా ఉన్నా టెన్త్‌లో 95 నుంచి 99 శాతం వరకు ఉత్తీర్ణత నమోదు కావడం నాటి పరీక్షల ప్రక్రియలో చోటు చేసుకున్న అక్రమాలకు నిదర్శనం.
నేడు.. చక్కదిద్దేందుకే కొత్త విధానం
రాష్ట్రంలో విద్యారంగం దుస్థితిని గుర్తించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిద్దుబాటు చర్యలతో నూతన ఫౌండేషన్ విధానానికి శ్రీకారం చుట్టారు. విద్యార్ధులకు పునాది స్థాయి నుంచే పటిష్ట బోధన అందించడం, పైతరగతులకు వెళ్లే కొద్దీ ఉన్నత ప్రమాణాలతో పరి/ê్ఙనాన్ని పెంపొందించడం కొత్త విధానం ముఖ్య ఉద్దేశం. తద్వారా మన విద్యార్థులను అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేలా అత్యున్నతంగా తీర్చిదిద్దాలన్నది సీఎం జగన్ ఆకాంక్ష.
ఈ క్రమంలో అంగన్‌వాడీలు, ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తూ ఆహ్లాదకరమైన వాతావరణంలో చదువులు కొనసాగేలా చర్యలు తీసుకున్నారు. తల్లిదండ్రులపై భారం లేకుండా జగనన్న విద్యాకానుక అందిస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీషు మీడియంతోపాటు అన్ని హైస్కూళ్లలో దశలవారీగా సీబీఎస్‌ఈ విధానాన్ని అమలుకు సిద్ధమయ్యారు. విద్యార్ధులకు మాధ్యమంతో ఇబ్బంది లేకుండా బైలింగ్యువల్ పాఠ్యపుస్తకాలను సమకూరుస్తున్నారు.
ఉచితంగా బైజూస్ కంటెంట్, ట్యాబ్‌లు
ఈ ఏడాదినుంచి విద్యార్థులకు ఆధునిక విద్యా పరి/ê్ఙనాన్ని సమకూరుస్తూ బైజూస్ కంటెంట్‌ను ప్రత్యేక యాప్ ద్వారా అందించేలా ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఏటా 8వ తరగతిలోకి వచ్చే నాలుగు లక్షల మందికిపైగా విద్యార్ధులకు ప్రత్యేక ట్యాబ్‌లను అందించి బైజూస్ కంటెంట్ అప్‌లోడ్ చేయనున్నారు.
తద్వారా 8 నుంచి 10వ తరగతి విద్యార్థులకు బైజూస్ కంటెంట్ అందుబాటులోకి వస్తుంది. రూ.20 వేలకు పైగా విలువ చేసే బైజూస్ కంటెంట్‌ను ప్రభుత్వ స్కూళ్ల విద్యార్ధులకు ఉచితంగానే అందించేలా ఏర్పాట్లు చేశారు. ఫౌండేషన్ స్కూళ్లలో పీపీ 1, పీపీ 2లకు అంగన్‌వాడీ టీచర్లతో బోధన తోపాటు 1, 2 తరగతులకు ఎస్జీటీలతో బోధన నిర్వహిస్తారు. గతంలో 1 నుంచి 5 తరగతులుండగా ఇపుడు 1, 2 తరగతుల పిల్లలకు మాత్రమే బోధన వల్ల టీచర్లకు సులభం కావడంతో పాటు పిల్లలకూ ఉత్తమ పరి/ê్ఙనం అందే అవకాశం ఏర్పడింది.
ఆరంచెల విధానంలో స్కూళ్లు
► అంగన్‌వాడీ కేంద్రాలను సమీపంలోని స్కూళ్లకు అనుసంధానించి పీపీ 1, పీపీ 2లతో పాటు 1, 2వ తరగతులతో ఫౌండేషన్ స్కూళ్లుగా మార్పు చేస్తున్నారు.
► పీపీ 1, పీపీ 2లతో పాటు 1–5 తరగతుల వరకు ఉండేలా ఫౌండేషన్ ప్లస్ స్కూళ్లను నెలకొల్పుతున్నారు.
► స్కూళ్లతో అనుసంధానానికి వీలులేని చోట అంగన్‌వాడీ కేంద్రాలను పీపీ 1, పీపీ 2లతో కలిపి శాటిలైట్ ఫౌండేషన్ స్కూళ్లుగా ఏర్పాటు చేస్తున్నారు.
► ప్రైమరీ స్కూళ్లలో 3, 4, 5వ తరగతులను 250 మీటర్ల నుంచి ఒక కి.మీ. లోపు ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలల్లో మ్యాపింగ్ చేయడం ద్వారా 1 నుంచి 7 లేదా 8వ తరగతులతో ప్రీ హైస్కూల్ విధానంలో కొన్ని స్కూళ్లను తీర్చిదిద్దుతున్నారు.
► ప్రైమరీ పాఠశాలల్లోని 3, 4, 5వ తరగతులను కిలోమీటర్ దూరంలో ఉన్న హైస్కూళ్లకు అనుసంధానించడం ద్వారా 3 నుంచి 10వ తరగతి వరకు హైస్కూళ్లు కొలువుదీరుతున్నాయి.
► ప్రతి మండలంలో జూనియర్ కాలేజీని అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కాలేజీలు లేని మండలాల్లో హైస్కూళ్లలో 11, 12వ తరగతులను ఏర్పాటుచేసి హైస్కూల్ ప్లస్‌గా ఏర్పాటు చేస్తున్నారు.
దశలవారీగా మ్యాపింగ్
స్కూళ్ల మ్యాపింగ్‌ను ఒకేసారి కాకుండా దశలవారీగా చేస్తున్నారు. మొదటి దశలో 250 మీటర్ల పరిధిలోని అంగన్‌వాడీలు, ప్రైమరీ స్కూళ్లు, యూపీ, హైస్కూళ్ల మధ్య మ్యాపింగ్ చేపట్టారు. రెండో విడతలో కిలోమీటర్ లోపు దూరంలోని స్కూళ్లలోని తరగతులకు మ్యాపింగ్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఇలా 5,968 ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హైస్కూళ్ల మధ్య 3, 4, 5 తదితర తరగతుల మ్యాపింగ్ జరిగింది.
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 47 లక్షల మంది విద్యార్ధులుండగా 2.49 లక్షల మంది మాత్రమే మ్యాపింగ్‌తో పక్కనే ఉండే మరో స్కూల్‌కి మారతారు. ఆయాస్కూళ్ల మ్యాపింగ్‌తో ప్రీహైస్కూల్, , హైస్కూళ్లలో చేరే 3, 4, 5 తరగతుల విద్యార్ధులకు మ్యాపింగ్ నేపథ్యంలో తరగతి గదులతోపాటు సదుపాయాలను మెరుగుపర్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం నాడు – నేడు ద్వారా యుద్ధప్రాతిపదికన చేపట్టింది. మ్యాపింగ్ అయిన స్కూళ్లతో పాటు ఇతర స్కూళ్లలో 1,69,972 అదనపు తరగతి గదులను ప్రభుత్వం నిర్మిస్తోంది.
అదనంగా 8వేలకు పైగా ఎస్‌ఏ పోస్టులు
మూడో తరగతి నుంచే సబ్జెక్టు టీచర్లతో బోధన నిర్వహించేందుకు వీలుగా స్కూల్ అసిస్టెంట్ టీచర్లను సమకూరుస్తున్నారు. మ్యాపింగ్ జరిగిన 3,609 హైస్కూళ్లలో 73,620 మంది స్కూలు అసిస్టెంట్ టీచర్లు అవసరం కాగా ఇప్పటికే 62,935 మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో మరో 8 వేలకుపైగా ఎస్జీటీ పోస్టులను ఎస్‌ఏలుగా అప్‌గ్రేడ్ చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇవి కాకుండా 1,000 హెచ్‌ఎం పోస్టులను కల్పించేందుకు వీలుగా ఎస్‌ఏ పోస్టులను అప్‌గ్రేడ్ చేయనున్నారు. అప్‌గ్రేడ్ అయిన ఈ పోస్టుల్లో అర్హత కలిగిన టీచర్లకు పదోన్నతి కల్పించి నియమించనున్నారు.
నాడు – నేడు ద్వారా రూ.16,450 కోట్లు
టీడీపీ హయాంలో ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లను ప్రోత్సహిస్తూ ప్రభుత్వ విద్యా వ్యవస్థను చంద్రబాబు నిర్వీర్యం చేశారు. కనీస సదుపాయాలు కల్పించకుండా, టీచర్లను నియమించకుండా ప్రభుత్వ పాఠశాలలను అధ్వాన్నంగా మార్చారు. పిల్లలు లేరన్న సాకుతో 6 వేల ప్రభుత్వ స్కూళ్లను మూసివేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 5 వేల స్కూళ్లను తిరిగి తెరిపించడమే కా>కుండా అన్ని సదుపాయాలతో టీచర్లను సమకూర్చారు. ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక సదుపాయాల కల్పనకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అందుకోసం ఏకంగా రూ.16,450 కోట్లు వెచ్చిస్తుండడం గమనార్హం. ఈ నిధులతో మొత్తం 62,661 విద్యాసంస్థల్లో సదుపాయాలను సమకూరుస్తోంది.
నిశిత పరిశీలన తరువాతే
స్కూళ్ల మ్యాపింగ్ వల్ల ఎక్కడా ఒక్క పాఠశాల కూడా మూతపడకుండా, టీచర్ పోస్టులు తగ్గకుండా చర్యలు తీసుకున్నాం. క్షేత్రస్థాయిలో నిశిత పరిశీలన తరువాతే మ్యాపింగ్ చేపట్టాం. ఆయా స్కూళ్లలో వసతులు, ఇతర సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకున్నాం. ఇప్పటివరకు ఐదు వేలకుపైగా స్కూళ్ల మ్యాపింగ్ జరగ్గా కొన్ని చోట్ల మాత్రం ఇబ్బందులు తలెత్తినట్లు ప్రజాప్రతినిధులతో పాటు ఇతర వర్గాలు తెలిపాయి. వాగులు, ప్రధాన రహదారులు దాటాల్సి రావడం, గదులు చాలకపోవడం లాంటి సమస్యలున్నట్లు చెప్పారు.
800 స్కూళ్లలో సమస్యలున్నట్లు సమాచారం అందడంతో జాయింట్ కలెక్టర్ల నేతృత్వంలోని కమిటీల పరిశీలన అనంతరం 250 వరకు స్కూళ్లను మ్యాపింగ్ నుంచి ప్రస్తుతానికి మినహాయించాం. 36 వేలకు పైగా తరగతి గదుల నిర్మాణం చకచకా సాగుతోంది. త్వరలోనే అవి అందుబాటులోకి వస్తాయి. సబ్జెక్టు టీచర్లతో బోధనకు వీలుగా అవసరమైన మేరకు స్కూల్ అసిస్టెంట్లను నియమిస్తున్నాం.
– ఎస్.సురేష్‌కుమార్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్