పాఠ్యపుస్తకం దాటి మరో ప్రపంచాన్నీ పరిచయం చేయాల్సింది” ఉపాధ్యాయుడే ‘

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

పాఠ్యపుస్తకం దాటి మరో ప్రపంచాన్నీ పరిచయం చేయాల్సింది” ఉపాధ్యాయుడే ‘

అబ్దుల్ కలాం అన్నట్లు” సుందర హృదయాలుసుసంపన్నం కావాలంటే ముగ్గురు వలనే సాధ్యమవుతుంది. తల్లి, తండ్రి ఉపాధ్యాయులు. ఈ ముగ్గురు నిచ్చెనులైనప్పుడు ఆ నిచ్చెనలు ఎక్కి పిల్లలు భవిష్యత్తుని చేరుకుంటారు . మన ప్రభుత్వ పాఠశాలకు వచ్చే పిల్లలకు తల్లిదండ్రులు అనే నిచ్చెనులు 90% వరకు సరిగ్గా ఉండవు .ఇక మిగిలిన ఏకైక భరోసా ఉపాధ్యాయుడు మాత్రమే. ఒక తల్లికి బిడ్డ పట్ల ఎంత ప్రేమ ఉండాలో ఉపాధ్యాయులకు అంత ప్రేమ ఉండాలి. ఉపాధ్యాయుడు సిలబస్ను వాడి మీదకు ఎక్కించడం విద్య కాదు. దురదృష్టవశాత్తు 21వ శతాబ్దంలో కూడా సమాచారాన్ని బట్వాడా చేయడం అనే పన్లోనే పాఠశాలలు నిమగ్నమయ్యాయి. పిల్లలు గొప్ప సంపద. వాళ్ళని జ్ఞానం వైపు ,శాస్త్రీయత వైపు, కుతూహలం వైపు , శ్రమ పట్ల గౌరవం వైపు నడపాల్సిన బాధ్యత ముమ్మాటికి పాఠశాలలదే.
పసిపిల్లల హృదయాల్లో కలలు ఉంటాయి. చిన్న చిన్న ఆలోచనలు ఉంటాయి. అట్లాంటి చిన్న ఆలోచనలను మంచి మార్గంలో నడపగలిగే ఓర్పు, సహకారం ఉపాధ్యాయులకు ఉంటే అక్కడి నుంచి నూతన ప్రపంచం ఆవిష్కరణ అవుతుంది. బడికి రాకముందు బిడ్డ వాడి నోటితో ఎన్నో కూని రాగాలు, తాళాలు పాడతాడు . అడుగుపెట్టిన తొలి రోజే మనం పాఠశాలలో నోటికి తాళం వేయమంటాం. వాడి స్వేచ్ఛకి మెల్లగా సంకెళ్లు మొదలవుతాయి మన పాఠశాలలో పేద బడులే గాని పెద్ద బడులు కాదు. ప్రతి పసి గుండెలోను కొత్త ఆలోచనలు ఉంటాయి. ప్రతి మెదడు నిండా చైతన్య ఉంటుంది. చాలా వరకు పాఠశాలల్లో పిల్లల మనోభావాలు కూడా దెబ్బతింటుంటాయి .ఇక్కడ మనోభావాలు అనే మాట ఆషామాషీగా వాడలేదు .బడిలోకి అడుగు,పెట్టిన వాడికి సంసిద్ధతను కలిగించడంలోనే వాడి పాఠశాల జీవితంలో పాటు భవిష్యత్ ఆధారపడి ఉంది .ఒకటి రెండు తరగతుల ఉపాధ్యాయుడు ఎంత సహనంగా ,ఎంత ప్రేమగా వాడిలో బడి పట్ల సకారాత్మక ఆలోచనలు కలిగిస్తాడనేది అత్యంత కీలకమైన విషయం.
ఏ పాఠశాల లేదా ఏ ఉపాధ్యాయుడు అయితే పిల్లలను ముందు వినడానికి సిద్ధం చేస్తారో , ఆ పాఠశాల పిల్లలు వికసించడం మొదలుపెడతారు పిల్లల్ని మాట్లాడవద్దు అని ఆదేశించడం పాఠశాల లక్షణం కాదు. ప్రాథమిక పాఠశాలల్లో పిల్లలు చాలా చైతన్యవంతంగా ఉండాలి. చాలా ఉత్సాహంగా ఉండాలి. మనం ఏదో చదివేస్తున్నాం అనే భ్రమ వారికి కలగకుండానే నేర్చుకోవాలి. దీనికోసం ఉపాధ్యాయుడు ఆషామాషీగా బడికి వెళ్తే సరిపోదు.
ఇక ఉన్నత పాఠశాలల సంగతికి వస్తే, పాఠం చెప్పడం అనేది ఒక అద్భుతమైన కళ .అది మేథడాలజీ పుస్తకాల వల్ల రాదు. పాఠ్యప్రణాళికను చక్కగా రాసుకోవడం వల్ల కూడా రాదు. మనకు మనం పుటం పెట్టుకోవాలి .పుస్తకంలో ఉన్న వాక్యాలు చదవడం వార్తలు చదవడమే అవుతుంది ఆ పాఠానికి జోడించాల్సింది జోడించాలి. ఒక తెలుగు లేదా భాషోపాధ్యాయుడు పద్యం ,గేయం ,కథ, పాట ద్వారా తరగతి గదిని వెలిగించవచ్చు. ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు పిల్లలు కనీసం 1100 రోజులు పాఠశాలలో ఉంటారు. ఇన్ని రోజుల్లో భాషా ఉపాధ్యాయుడు తనకు కేటాయించిన పిరియడ్లో కనీసం ఒక ఐదు నిమిషాలు కేటాయించగలిగితే పద్యం ,కథ, కవిత క్రమం తప్పకుండా రోజూవినిపించ గలిగితే గొప్ప మార్పు పిల్లల్లో చూడవచ్చు. పాఠానికి ఆసక్తికరమైన అంశాలు జోడించినప్పుడు పిల్లలు వింటారు. దేశ నాయకుల పుట్టినరోజులకి సెలవులు ప్రకటించినప్పుడు ఆ ముందు రోజే ఆ నాయకుడి గొప్పతనం గురించి పిల్లలకు చెప్పి ఇంటికి పంపాలి.
ఒక లెక్కల టీచర్ లెక్కలే చెప్పాలి ,సీరియస్ గా ఉండాలి .అనే ఒక నాటు మొరటు మూసలోనే ఇంకా మనం ఉండిపోయాం. గణిత ఉపాధ్యాయుడు కూడా రోజులో ఐదు నిమిషాలు జీవితం గురించి చెప్పొచ్చు. గణిత శాస్త్రవేత్తల జీవితాన్ని రోజూ కాసేపు

వినిపించవచ్చు. గణితం ప్రపంచాన్ని ఎలా మార్చిందో ఎలా మారుస్తుందో చెప్పవచ్చు. చతుర్విధ ప్రక్రియలను జీవితానికి అన్వయించి విలువలను నేర్పవచ్చు. అదే ఉపాధ్యాయుడు తన వ్యక్తిగత జీవితంలో తన ఎదుర్కొన్న కష్టాన్ని చెప్పవచ్చు. తన ఓటమిని గెలుపును నిజాయితీగా పిల్లల ముందు ఉంచవచ్చు.
పదవ తరగతి వరకు సైన్స్ చదివిన మన పిల్లలకు సైన్స్ లోని చాలా ప్రాథమిక అంశాల పట్ల అవగాహన ఉండదు. ఈ విషయంలో ప్రైవేటు పాఠశాలలు కూడా మినహాయింపు కాదు. నిత్య జీవితంలోని అనేక చిన్న చిన్న శాస్త్రీయ అంశాలను విద్యార్థులకు ఉపాధ్యాయులు జోడించడం లేదు. ఒక గ్యాస్ లైటర్ వెలగడంలో ఉన్న ఆంతర్యం మన పిల్లలకు తెలియదు ఇంట్లో ఫ్రిడ్జ్ ఉన్న వాళ్లకు కూడా అది ఎలా పదార్థాలు నిల్వఉంచగలదో, కుండలో నీళ్లు ఎందుకు చల్లగా ఉంటాయో లేదా అగ్గిపుల్ల ఎందుకు వెలుగుతుందో కూడా చెప్పలేరు. మా డిగ్రీ కళాశాలలో పిల్లల్ని నేను అనేకమార్లు మనం నిమిషానికి ఎన్నిసార్లు గాలి పిలుస్తాం అనే ప్రశ్న అడిగినప్పుడు ఏ ఒక్కరి నుంచి నేను సరైన సమాధానాన్ని వినలేకపోయాను.
దర్పణాల గురించి భౌతిక శాస్త్రంలో పాఠం ఉంటుంది కానీ తన ఇంట్లో ఉండే అద్దం గురించి లేదా బైక్ ఏదైనా వాహనా అనుకుంటే అద్దానికి సంబంధించి ప్రాథమిక అవగాహన పిల్లల్లో లేదు. ప్రతిరోజు సైకిల్ తొక్కుకుంటూ బడికి వచ్చే పిల్లాడికి ఆ సైకిల్ తయారు చేసిన శాస్త్రవేత్త గురించి చెప్పండి. రోజు టీవీ చూస్తాడు కానీ అది ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది? ఆ టీవీ ని కనిపెట్టిన శాస్త్రజ్ఞుడు ఎవరు?, మొబైల్ ఫోన్ సృష్టికర్త ఎవరు? ఇలాంటి ప్రశ్నల ద్వారా మన పిల్లల్లో ఆసక్తిని రేపాలి. ఇట్లాంటి ప్రశ్నలకు మన పిల్లలు సమాధానాలు ఇవ్వలేరు. ఒకవేళ సిలబస్ లో ఉంటే ఎవరైనా ఇవ్వొచ్చు ఏమో గాని ఇవేమీ మన సిలబస్లో ఉండవు. కానీ తాను నిత్య జీవితంలో వాడుతున్న అనేక వస్తువుల యొక్క తాత్వికత దాని ఆవిష్కరణ వెనుక ఉన్న శ్రమని, ప్రతి సైన్స్ టీచర్ తరగతి గదిలో చెప్పగలిగితే ఎంత స్ఫూర్తివంతంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. శాస్త్రవేత్తల జీవితాల గురించి చెప్పే సైన్స్ ఉపాధ్యాయులు ఉంటే వాళ్లకి నేను పాదాభివందనం చేస్తాను. ఇవన్నీ తరగతి గదుల్లోకి మనం ఎందుకు తీసుకెళ్లలేకపోతున్నామో ఆలోచించాలి. ఎటువంటి ల్యాబ్లు సాంకేతికత అందుబాటులో లేని కాలంలో జగదీష్ చంద్రబోస్, సర్ సివి రామన్, యల్లా సుబ్బారావు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా జాబితానే ఉంటుంది వాళ్ళు అద్భుతాలు చేశారు కదా.
ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు ఎన్నో ఆసక్తికరమైన అంశాలను పాఠానికి జోడించవచ్చు ఇవాళ పిల్లలకు ఇన్స్టాగ్రామ్ తెలుసు టెలిగ్రామ్ తెలుసు తన గ్రామం వివరాలు కూడా తెలియని పిల్లలు ఎంతోమంది ఉన్నారు. నల్లబల మీద రోజుకో దేశం పేరు రాజధాని రాసి నేర్పించవచ్చు. ఒక్కో దేశంలోని విశేషాలు ఐదు నిమిషాలు చెప్పవచ్చు. జాతీయ నాయకుల త్యాగాలను జోడించవచ్చు. నెల్సన్ మండేలా, గాంధీ, అంబేద్కర్ ,అబ్దుల్ కలాం లాంటి ఒక జాబితా తయారు చేసి ఆరవ తరగతి నుంచి తొమ్మిదవ తరగతి వరకు అయినా ఆ ఉపాధ్యాయుడు వాళ్ళ జీవితాల గురించి చెప్పగలిగితే మన తరగతి గదుల్లోని ఎంతోమంది పిల్లలు స్ఫూర్తి పొందరా? ఉపాధ్యాయుడు పిల్లల్ని మెల్లగా విజ్ఞానపు ముగ్గులోకి దించాలి.
ఇవన్నీ చెబితే సిలబస్ గతి ఏంటి నేను మొదటి నుంచి చెప్తుంది ఒక్క ఐదు నిమిషాలు రోజు కేటాయిస్తే మన సిలబస్ ఏమి వెళ్ళిపోదు తరగతి గదిలో ఉపాధ్యాయుడు నాయకుడు కదా అంతా మన చేతుల్లోనే ఉంది. ఇన్నాళ్లు సిలబస్ చెప్పిన మనం పిల్లల్లో అవి ఎంత మాత్రం ఉన్నాయో కూడా ప్రశ్నించుకోవాలి అయితే ఇన్ని అంశాలు జోడించాలంటే ముందు మనం చదవాలి. ఉపాధ్యాయుడు తన జ్ఞానం పట్ల ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. సిలబస్ ఎలా అయిపోతుందో మనకు తెలుసు. ఒకవేళ మన పిల్లలే మన ముందు తరగతి గదుల్లో ఉంటే మనం ఎలా పాఠం చెప్తామో ఒకసారి ఆలోచించుకోవాలి. సమాజానికి, పాఠశాలకి మధ్య కిలోమీటర్ల దూరం పెరిగిపోయింది. సహకార సామూహిక స్ఫూర్తి నింపే కార్యక్రమాలు పాఠశాలల్లో జరగాలి. విచిత్రం ఏమిటంటే ఇద్దరు ఉపాధ్యాయులు ఉండే ప్రాథమిక పాఠశాలల్లో కూడా ఒక ఉపాధ్యాయుడు అంటే మరో ఉపాధ్యాయుడికి లేదా ఒక ఉపాధ్యాయురాలు కి మరో ఉపాధ్యాయురాలికి పోసగక పోవడం కూడా నేను చాలా చోట్ల గమనించాను. ఉన్నత పాఠశాలలో కూడా ఉపాధ్యాయులు సంఘాలుగా విడిపోవడం ,కుల మత ప్రాతిపదికన ఉండడటం,గమనించవచ్చు. పాఠశాల సమయంలో పాఠశాలలో ఉన్న 10 లేదా 20 మంది ఉపాధ్యాయులు ఒక్కటే అనే భావన పిల్లల్లోకి వెళ్లాలి. కనీసం రెండు నెలలకు ఒకసారి తల్లిదండ్రులని పాఠశాలలకు ఆహ్వానించి వాళ్ళ పిల్లల ప్రతిభ సామర్థ్యాలను వాళ్ళ ముందు ప్రదర్శించే అంత సాహసం చేయాలి. ఐకమత్యమే మహాబలం అని గోడమీద నినాదంగా రాసిన మనం ఒక్క మాట మీద పాఠశాలలో ఉండకపోతే పిల్లలు ఎలా అర్థం చేసుకుంటారో ఆలోచించుకోవాలి.
మన తరగతి గదుల్లో ఉన్న పిల్లల నేపథ్యాలు మనకు తెలియాలి. పిల్లలు క్రమశిక్షణగా లేనప్పుడు పాఠశాలలో ఉన్న అందరూ ఉపాధ్యాయులు ఒక్కతాటిమీద ఉంటే ఒక్క నెల రోజుల్లో పాఠశాల దారిలో పడుతుంది.
ఇవాళ విలువలు కోల్పోయిన సమాజాన్ని చూస్తున్నాం. సాహిత్యం పట్ల ఆసక్తి లేని తరాలు వస్తున్నాయి. అయితే ఇక్కడ సాహిత్యం అంటే కేవలం భాషకు సంబంధించిన ఉపాధ్యాయులే చెప్పాలి అనే భ్రమ ఉపాధ్యాయులలో ఉండడం శోచనీయం. ఏ సబ్జెక్ట్ ఉపాధ్యాయుడైన జీవిత చరిత్రలు ,ఆత్మకథలు, గొప్ప వ్యక్తుల జీవితాలలో ని
సంఘటనలు చెప్పడం కూడా సాహిత్యం లో భాగంగానే వస్తుంది. ఉపాధ్యాయులకు బోధ నేతర పనుల నుంచి విముక్తి కల్పించడం కూడా ప్రభుత్వం ఆలోచించాలి. మమ్మల్ని పాఠాలు చెప్పనివ్వడం లేదు అనే మాట ఉపాధ్యాయ లోకంలో వినిపిస్తూ ఉంది. కనీసం పాఠశాలలో ఒక్కరోజు సారస్వత సంఘం నిర్వహించాలి.
మానిటరింగ్ వ్యవస్థను బలోపేతం చేయాలి. మానిటరింగ్ వ్యవస్థ ద్వారా మార్గదర్శనం చేయాలి కానీ కక్ష సాధింపులు, బెదిరింపులు లేకుండా ఉపాధ్యాయుని బలోపేతం చేసే విధంగా ఉండాలి. పాఠశాలలోని ప్రధాన అధ్యాపకులు మూర్ఖ దర్శనం కాకుండా మార్గ దర్శనం చేయాలి. ఉపాధ్యాయులకు జరుగుతున్న వృత్యంతర శిక్షణా కార్యక్రమాలు కూడా మొక్కుబడిగా సాగుతున్నట్టుగానే అనిపిస్తోంది. ఇప్పుడు మేమేం కొత్తగా నేర్చుకుంటాం. అనే భావనతో లోపలికి వెళ్లే ఉపాధ్యాయులను ఎవరూ మార్చలేరు. అందువల్ల శిక్షణ కార్యక్రమాలు సృజనాత్మకంగా ఉండాలి. సరికొత్త ఆలోచనలను ఉపాధ్యాయులు కలిగించాలి. ఈ మధ్య నేను ఒక ఆటోలో ప్రయాణిస్తున్న సందర్భంలో ఒక సగటు వ్యక్తి అన్న మాట ప్రభుత్వాన్ని మార్చేస్తాం అని ఉపాధ్యాయులు అంటూ ఉంటారు, మరి పిల్లల్లో అంత మార్పు ఎందుకు తేలేకపోతున్నారు. తల్లిదండ్రులు ఉపాధ్యాయులు అనుకుంటూ ఉన్నట్లు అటు ప్రైవేటు పాఠశాల పిల్లల్లో కూడా జీవన నైపుణ్యాలు ఉండవు. శ్రమ పట్ల గౌరవం ఉండదు. వేలకు వేలు లక్షలకు లక్షలు ఫీజులు పోసే తల్లిదండ్రులు అక్కడ ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయో కూడా పరిశీలించరు. పిల్లలకి కనీసం 10 వాక్యాల ఒక్కవ్యాసం వ్యాసంగా రాయడం కూడా రాదు. తల్లిదండ్రులారా పరిశీలించుకోండి మీ పిల్లల్ని మీ గురించి పది వాక్యాలు తెలుగులో రాయమని అడగండి. వాళ్లు ఇంగ్లీష్ మీడియం అయితే అందులో ఏదైనా ఒక కథను రాయమని అడగండి. అసలు బండారం బయటపడుతుంది. ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు కూడా పిల్లలచేత అప్పుడప్పుడు అమ్మ గురించి నాన్న గురించి కుటుంబ సంబంధాల గురించి పది వాక్యాలు మాట్లాడించడం రాయించడం చేయాలి. మనం దగ్గరుండి పిల్లలకి మధ్యాహ్నం భోజనం పెట్టిస్తున్నాం కానీ ఆ పిల్లలు ఉండబట్టే మన పిల్లలు మనం హాయిగా ఉండగలుగుతున్నాం అనే మాట కూడా గుర్తుపెట్టుకోవాలి.
ఏది ఏమైనా ఉపాధ్యాయ వృత్తి అనేది జీతం తీసుకోవడానికి కాదు. మన ముందు కూర్చున్న పిల్లల తరాల జీవితాన్ని మార్చడానికి గుర్తుపెట్టుకోవాలి. ఉపాధ్యాయ సంఘాలు కూడా కేవలం సర్వీస్ సంబంధిత విషయాలే కాకుండా పాఠశాలలు బాగుపడడానికి చేయాల్సిన కార్యక్రమాలు, అలాగే ఉపాధ్యాయులకు వర్క్ షాపులు నిర్వహించడం లాంటివి. చేయాలి. ఉపాధ్యాయ సంఘాలు బృందాలుగా పాఠశాలను సందర్శించాలి ఉపాధ్యాయులకు భరోసాగా నిలవాలి. అద్భుతంగా పనిచేసే ఉపాధ్యాయులను ప్రభుత్వ పురస్కారాలతో కాదు ఉపాధ్యాయ సంఘాలే నిజాయితీగా గౌరవించాలి. ఉపాధ్యాయుడు ఎప్పటికప్పుడు తనని తాను మెరుగు దిద్దుకోవడంలో పుస్తకాలు దారి దీపాలుగా నిలుస్తాయి. రెండు మూడు తరాలు శాస్త్రీయ దృక్పధాని గాని సాహిత్య విషయాలను గాని , సామూహికంగా పనిచేయడాన్నీ గానీ నేర్చుకోలేదని చెప్పవచ్చు.

Stay informed about the latest government job updates with our Sarkari Job Update website. We provide timely and accurate information on upcoming government job vacancies, application deadlines, exam schedules, and more.

Categories

Category 1

Category 2

Category 3

Category 4

Category 5

error: Content is protected !!