AP NATIONAL BEST TEACHER AWARD WINNERS 2024

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు-2024’కు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి ఇద్దరేసి చొప్పున నలుగురు అధ్యాపకులు ఎంపికయ్యారు. కేంద్ర విద్యాశాఖ మంగళవారం ఈ అవార్డులను ప్రకటించింది. దేశవ్యాప్తంగా మొత్తం 50 మంది ఎంపిక కాగా గురుపూజోత్సవం సందర్భంగా సెప్టెంబరు 5న దిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో వీరికి ఒక్కొక్కరికి ప్రశంసాపత్రం, రజత పతకం, రూ.50 వేల నగదును అందజేస్తారు. ఏపీ నుంచి ఎం.శ్రీనివాసరావు (గుడివాడ ఎస్‌పీఎస్‌ పురపాలక ఉన్నత పాఠశాల), కునాటి సురేష్‌ (శ్రీకాళహస్తి మండలం ఊరందూరు జడ్పీ ఉన్నత పాఠశాల), తెలంగాణ నుంచి తాడూరి సంపత్‌కుమార్, పెసర ప్రభాకర్‌రెడ్డి ఈ అవార్డులకు ఎంపికయ్యారు.


ప్రయోగాత్మక బోధన శ్రీనివాస్‌ సొంతం
విద్యార్థులకు ప్రయోగాత్మకంగా బోధిస్తున్న మిద్దె శ్రీనివాసరావు

మారుతున్న నూతన పోకడలపై ప్రయోగాత్మకంగా బోధిస్తున్న కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలోని శ్రీ పొట్టి శ్రీరాములు పురపాలక సంఘం ఉన్నత పాఠశాల భౌతికశాస్త్ర ఉపాధ్యాయుడు మిద్దె శ్రీనివాస్‌ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికయ్యారు. 9, 10 తరగతుల భౌతిక, రసాయన శాస్త్ర పాఠ్య పుస్తకాలను, 7వ తరగతి సామాన్య శాస్త్రం పాఠ్యపుస్తకం, ప్రభుత్వ ఫిజికల్‌ సైన్స్‌ మాడ్యుల్స్‌ రచించారు. గత ఆరేళ్లుగా సైన్స్‌ మైండ్‌ వెబ్‌సైట్‌ ద్వారా తెలుగు విద్యార్థులకు ఉచితంగా సైన్స్‌ హ్యాండ్‌బుక్స్, స్టడీ మెటీరియల్స్, ఉపాధ్యాయ పాఠ్య ప్రణాళికలను, పీపీటీ (పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌) ద్వారా పాఠ్యాంశాలను, ప్రయోగాలు, ప్రాజెక్టు వర్క్‌లు, సైన్స్‌కు సంబంధించి అన్ని రకాల వనరుల్ని ఉచితంగా అందిస్తున్నారు. బాలికలు మధ్యలో విద్య మానేస్తున్న నేపథ్యంలో ఇంటర్‌లో చేరిన బాలికలకు సుమారు రూ.3 లక్షల విలువైన స్టడీ మెటీరియల్స్‌ సమకూర్చారు. విద్యార్థులకు సైన్సు పట్ల అవగాహన కల్పిస్తూ రెండుసార్లు కృష్ణా జిల్లా సైన్స్‌ ప్రాజెక్టులు జాతీయ స్థాయికి ఎంపికయ్యేలా కృషి చేశారు. 

‘సాంఘికం.. సామాజికం’ సురేష్‌ రెండు కళ్లు

అటు పాఠ్యాంశాల బోధన.. ఇటు విద్యాభివృద్ధికి దారితీసే సేవా కార్యక్రమాలు రెండు కళ్లుగా పనిచేస్తున్న కునాటి సురేష్‌కు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడి పురస్కారం దక్కింది. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం ఊరందూరు ఉన్నత పాఠశాలలో సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న సురేష్‌ ఉపాధ్యాయ వృత్తితోపాటు పాఠ్యపుస్తక రచయితగా ప్రత్యేక గుర్తింపు పొందారు. ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాలను అనువదించడంలో ముఖ్య భూమిక పోషించారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న దీక్ష వెబ్‌సైట్‌లో కంటెంట్‌ క్రియేటర్‌గా వ్యవహరిస్తున్నారు. పాఠశాలల్లో డిజిటల్‌తెరపై పాఠ్యాంశాల బోధనకు డిజిటిల్‌ కంటెంట్‌ను సిద్ధం చేసి ఉపాధ్యాయులకు అందించారు. గురుదేవా డాట్‌ కామ్‌ వెబ్‌సైట్‌ సిద్ధం చేసి లక్షలమందికి సులభతర బోధనను అందుబాటులోకి తీసుకువచ్చారు. దాతల సాయంతో 2500 పాఠశాలల్లో 5 లక్షలమంది పిల్లలకు ఉపయోగపడేలా కంప్యూటర్‌ విద్యను ఉచితంగా అందుబాటులోకి తీసుకువచ్చారు.

error: Content is protected !!