మంకీ ట్రాప్…. ఇటీవల మూడు రోజుల క్రితం చదివిన ఒక చిన్న వార్త …
భాగ్యనగరంలో ఒక బిక్షగాడు మృతి.. పోస్టుమార్టంలో తేలింది ఏమిటంటే, అతనికి 14 రోజుల నుంచి భోజనం లేదు… అంటే ఆకలి మరణం. ఇది కూడా పెద్ద సంచలన వార్త ఏమీ కాదు, కానీ ఈ వార్తలోని కొసమెరుపు ఏమిటంటే బిక్షగాడి జోలిలో కానీ, సంచిలో కానీ అక్షరాలా మొత్తము లక్ష 34 వేల రూపాయలు దొరికాయి. న్యూస్ హెడ్డింగ్ కూడా ఇదే…
“బిచ్చగాడి దగ్గర భారీ మొత్తం’’ అని… ఇక్కడ బాగా గుంజి పడేస్తున్న విషయం ఏమిటంటే అంత డబ్బు ఉంచుకున్న బిక్షగాడు ఒక పూట ఆహారం ఎందుకు తీసుకోలేకపోయాడు? అదీ తన ప్రాణం పోతున్నా..!! 14 రోజుల నుంచి ఆకలితో ఉన్నాడు తప్ప డబ్బు ఎందుకు ఖర్చు పెట్టలేకపోయాడు? ఏమిటి ఈ మనస్తత్వం ? ఇటువంటి దౌర్భల్యం మనందరిలో కూడా ఉంటుందా? అంటే.. అవుననే చెబుతుంది మానసిక శాస్త్రము.
ఈ విషయం చదవగానే నాకు మొదట గుర్తు వచ్చిన విషయము “మంకీ ట్రాప్”… అవును, ఆఫ్రికాలోని ఒక తెగ వారు కోతులను వేటాడటానికి నికి చెట్టు తొర్రలో కానీ, పుట్టలో కానీ, ఇవి కాకపోతే ఎండు కొబ్బరికాయలో … ఖచ్చితంగా కోతి చేయిపట్టేంత రంధ్రం చేస్తారు. ఈ రంధ్రం ప్రత్యేకత ఏమిటంటే ఇది కోతి చేయి పట్టేంత పెద్దదిగా మరియు.. కోతి పిడికిలి బయటికి రానంత చిన్నదిగా ఉంటుంది..
ఇక ఈ రంధ్రంలో కోతికి కావలసిన అరటికాయనో వేరుశనగ గింజలనో పోసి ఉంచుతారు. దీనికి ఆశ పడిన కోతి రంధ్రంలో చేయి పెట్టి వాటిని పట్టుకుంటుంది. కానీ పిడికిలిని మాత్రం బయటికి తీయలేక పోతుంది. సరిగ్గా ఇదే సమయంలో ఆ తెగ వారు ఆ కోతిని పట్టుకుంటారు. గమ్మత్తుగా మనుషులు తనను సమీపిస్తున్నా… ప్రమాదం పొంచి ఉన్నా.. కోతి మాత్రం ఆ పిడికిల్ని తెరవలేకపోతుంది. తాను పట్టుకొన్నది వదలలేక పోతుంది. చివరికి దొరికిపోతుంది. దీన్నే సింపుల్ గా మంకీ ట్రాప్ అంటాము.
నిజంగా మనకి ప్రమాదమని.. నష్టమని తెలిసినప్పటికినీ కొన్నిటిని మనం వదులుకోలేకపోతున్నామా ? అయితే ఇటువంటి మంకీ ట్రాప్ లో మనం ఉన్నట్లే.. రోజువారి కష్టపడి సంపాదించుకున్న కూలీ డబ్బులను దాచిపెట్టుకొని ఆసుపత్రికి వెళ్ళటానికి కూడా మనసు ఒప్పుకోకుండా తనువు చాలించిన చుట్టాలు నాకు చాలా మంది తెలుసు. నిజంగా డబ్బు అంతగా కట్టి పడేస్తుందా అంటే.. డబ్బు కాదు కానీ మన తత్వం మనల్ని ట్రాప్ లో పడేస్తుంది.
విశదంగా ఇంకా పరిశీలిస్తే… మన నష్టాన్ని మనం అంత తొందరగా వదులుకోలేము అనిపిస్తుంది….. చచ్చిన బిచ్చగాడిని చూసి నవ్వుకునే మనము .. మనకు తెలియకుండానే మనం అదే ట్రాప్ లో ఉన్నామనిపిస్తుంది. ఎప్పుడో తెగిపోయిన ఒక బంధాన్ని పట్టుకొని ఇప్పటికి ఏడుస్తున్న వాళ్ళము ఎంతమంది లేము? ఒక మాట పంతానికి ఇంకెన్నో బంధాలను దూరం చేసుకుని ఒంటరిగా మిగిలిపోయిన వాళ్లు మనలో లేరా?
వ్యాపార లాభాలు అంటూనో, పేరు ప్రతిష్ఠలంటునో వృత్తికి అంకితం అయిపోయి తన కుటుంబాన్ని పిల్లల్ని నిర్లక్ష్యం చేసిన పెద్దలు నాకు బాగా తెలుసు. మేము పరాజితులమని వాళ్లే ఒప్పుకుంటున్నారు ఇప్పుడు. అందుకే చిన్న మోతాదులో కానీ పెద్ద మోతాదులో కానీ మనం కూడా ఇటువంటి ట్రాప్ లో ఏమైనా ఉన్నామేమో చూసుకోవాలి. అది బంధం కావచ్చు, డబ్బు కావచ్చు, కీర్తి కావచ్చు.. మనల్ని పట్టేసి ఉంచుతుందేమో గమనించుకోవాలి. అవసరానికి దాన్ని వదులుకోగలమో లేదో చూసుకోవాలి. అప్పుడే మనము ఈ ట్రాప్ నుంచి బయటపడగలం…
మనల్ని ఏడిపించే జ్ఞాపకాలు…
నో చెప్పలేని మోహమాటలు…
తిరిగి అడగలేని అప్పులు…
దండించలేని ప్రేమలు…
ఊపిరి సలపనివ్వని పనులు…
వత్తిడి పెంచే కోరికలు….
ఆరోగ్యాన్ని హరించే సంపాదనలు…
పేరు వెంట చేసే పరుగులు….
అన్నీ మంకీ ట్రాప్ లే…