AP TEACHER TRANSFERS G.O, SCHEDULE,GUIDE 2022
*📚✍️ఉపాధ్యాయుల*
*బదిలీలకు పచ్చజెండా!✍️📚*
*♦️ప్రధానోపాధ్యాయులకు ఐదేళ్లు, టీచర్లకు 8 ఏళ్ల సర్వీసు ఉంటే తప్పనిసరి*
*♦️జీరో సర్వీసు ఉన్నా దరఖాస్తు చేసుకునే అవకాశం*
*🌻ఈనాడు, అమరావతి:* ఉపాధ్యాయుల బదిలీలు నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. గురు, శుక్రవారాల్లో వరుసగా సమావేశాలు నిర్వహించిన మంత్రి బొత్స సత్యనారాయణ, అధికారులు చివరికి బదిలీలు నిర్వహించాలనే నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 12వ తేదీలోపు ప్రకటన విడుదల చేసి, నెల రోజుల్లో పూర్తి చేయనున్నారు. ఆన్‌లైన్‌లోనే ప్రక్రియ నిర్వహిస్తారు. ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న ప్రధానోపాధ్యాయులు, 8ఏళ్లు ఒకేచోట పని చేస్తున్న ఉపాధ్యాయులకు తప్పనిసరి బదిలీ ఉంటుంది. ఎలాంటి సర్వీసు లేకుండానే(జీరో సర్వీసు) బదిలీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించనున్నారు. స్పౌజ్, దివ్యాంగులు, ఒంటరి మహిళలు ఇతరత్రా సర్వీసు, పాఠశాలల స్టేషన్ పాయింట్లు గతంలోలాగానే ఉంటాయి.
*♦️సర్దుబాటుపై ఏం చేస్తారు?*
పాఠశాలల్లో సబ్జెక్టు ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉన్నట్లు ఫిర్యాదులు రావడంతో తాత్కాలిక సర్దుబాటుకు అధికారులు చర్యలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 3-10 తరగతులకు 6,578 మంది, 6-10 తరగతులకు 1,350 మంది సబ్జెక్టు ఉపాధ్యాయులు అవసరమని అంచనా వేశారు. దీని ప్రకారం ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తారు. సబ్జెక్టు ఉపాధ్యాయులు లేకపోతే అర్హత ఉన్న ఎస్జీటీలను స్కూల్ అసిస్టెంట్లుగా నియమిస్తున్నారు. హేతుబద్ధీకరణ కారణంగా మిగులుగా తేలిన ఎస్జీటీలను అవసరమైన చోటుకు పంపించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. కొన్నిచోట్ల 3,4,5 తరగతులను ఉన్నత పాఠశాలలకు తరలించడంతో పాటు అర్హత కలిగిన ఎస్జీటీలను ఆయా బడులకు పంపించారు. ఇప్పుడు బదిలీలు నిర్వహిస్తే వీరి పరిస్థితి ఏంటి? అనేదానిపై స్పష్టత లేదు. సర్దుబాటు రద్దు చేసి, అందరికీ బదిలీలకు అవకాశం కల్పిస్తారా? సర్దుబాటు చేసిన వారికి ఏ పాయింట్లు ఇస్తారు? అనేది ఉపాధ్యాయుల్లో ఆందోళన కలిగిస్తోంది.
ఉపాధ్యాయుల బదిలీల తరువాత జిల్లా విద్యాధికారులకు నిర్వహించనున్నారు. రాష్ట్రంలో నాలుగు డీఈవో పోస్టులు ఖాళీగా ఉండగా.. వాటితో పాటు మరికొన్ని జిల్లాల్లో కొత్తవారిని నియమించాలని నిర్ణయించారు.
* ఉపాధ్యాయుల బదిలీల అనంతరం ఏర్పడే ఖాళీల్లో డీఎస్సీ-98 అభ్యర్థులకు పోస్టింగ్‌లు ఇవ్వనున్నారు.
*♦️సుదీర్ఘ చర్చలు*
2020 అక్టోబరులో బదిలీలు చేపట్టిన ప్రభుత్వం 2021 జనవరి వరకు కొనసాగించింది. ఈసారి బదిలీలు నిర్వహించాలా? వద్దా? అనేదానిపై సుదీర్ఘ చర్చలు జరిపిన ప్రభుత్వం.. ఉద్యోగ సంఘాల ఒత్తిడి మేరకు బదిలీలు చేసేందుకు పచ్చజెండా ఊపింది. పాఠశాలలు పునఃప్రారంభం నాటికే ఈ ప్రక్రియ పూర్తి చేస్తామని మొదట విద్యాశాఖ ప్రకటించింది. ఆ తర్వాత ఆగస్టులో నిర్వహించాలని భావించింది. పాఠశాలల విలీన ప్రక్రియలో జాప్యం కారణంగా వాయిదా వేస్తూ వచ్చారు. తరగతుల విలీనం, సబ్జెక్టు ఉపాధ్యాయుల కొరత కారణంగా సెకండరీ గ్రేడ్ టీచర్లకు పదోన్నతులు కల్పించారు. స్కూల్ అసిస్టెంట్లకు ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు కల్పించారు. వీరికి పదోన్నతుల ప్రయోజనం కల్పించి, కొత్త పోస్టులు ఇవ్వాలంటే బదిలీలు చేయాల్సి ఉంటుంది.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇