అబ్దుల్ కలామ్ గారి జయంతి స్పెషల్….
ప్రతి రోజూ భూమి మీద ఎంతోమంది పుడతారు, మరణిస్తారు. కొంతమందే మరణం తర్వాత కూడా గుర్తుండిపోతారు. అలాంటి కొద్ది మందిలో ఒకరు డా. ఏపీజే అబ్దుల్ కలామ్. ‘కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి’ అంటూ యువతరాన్ని తట్టి లేపి కర్తవ్యబోధ చేశారు కలామ్. ‘కలలు కనడమంటే ఊహాలలో విహరించడం కాదు. గాలిలో మేడలు కట్టడం కాదు. ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకొని దానిని సాధించడం కోసం ఎంతైనా శ్రమపడాలని’ చెప్పిన ఏపీజే అబ్దుల్ కలాం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.
అణ్వస్త్ర పితామహుడిగా
దేశానికి 11 వ రాష్ట్రపతిగా ఎనలేని సేవలందించిన కలామ్ పూర్తి పేరు ‘అవుల్ ఫకీర్ జైనుల్ అబిదీన్ అబ్దుల్ కలాం’ 1931 అక్టోబరు 15న తమిళనాడులోని రామేశ్వరంలో జన్మించారు. పేద కుటుంబం కావడంతో తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉండేందుకు పేపర్ బాయ్‌గా పనిచేశారు. కష్టపడి చదువుకుని ‘మద్రాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’ నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో పట్టా సాధించారు. ఇస్రోలో చేరి మొట్టమొదటి స్వదేశీ ఉపగ్రహ వాహన ప్రయోగంలో (SLV-III) లో పాలుపంచుకున్నాడు.
1970, 1990 మధ్య కాలంలో, కలామ్ పీఎస్‌ఎల్‌వీ, ఎస్‌ఎల్‌వీ -III ప్రాజెక్టుల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. 1992 నుంచి 1999 వరకు ప్రధానమంత్రి శాస్త్రీయ సలహాదారుడిగా, డీఆర్‌డీడిఓ ముఖ్యకార్యదర్శిగా పని చేసారు. పోఖ్రాన్ అణు పరీక్షలో కలామ్ సంస్థాగత, సాంకేతిక, పాత్ర పోషించి దేశాన్ని అణ్వస్త్ర రాజ్యాల సరసన చేర్చారు. అందుకే కలామ్ ‘అణు శాస్త్ర పితామహుడిగా’ ‘మిసైల్ మ్యాన్’ గా కీర్తించబడినారు. 1998లో హృద్రోగ వైద్యుడితో కలిసి ‘స్టెంటు’ ను అభివృద్ధి చేశారు దీనిని ‘కలామ్-రాజు స్టెంట్’ అంటారు. 2012 లో గ్రామీణ ప్రాంత వైద్య సహాయం కోసం ‘టాబ్లెట్ కంప్యూటర్’ అభివృద్ధి చేశారు. దీనిని ‘కలామ్-రాజు టాబ్లెట్’ అంటారు. 2022 నుంచి 2007 వరకు రాష్ట్రపతి గా సేవలందించారు.
Also read: భగత్ సింగ్ తన తల్లితో చివరి సంభాషణ ఏంటో తెలుసా?
అతి సాధారణంగా
ఎలాంటి భేషజం లేకుండా ప్రజల మనిషిగా మెలిగారు కలామ్. 40 విశ్వ విద్యాలయాల నుండి గౌరవ డాక్టరేట్లను అందుకున్నారు. భారత ప్రభుత్వం 1981లో ‘పద్మభూషణ్’ 1990లో ‘పద్మ విభూషణ్’ తో సత్కరించింది. దేశంలో రక్షణ సాంకేతిక పరిజ్ఞానం, శాస్త్రీయ పరిశోధన, ఆధునీకరణలకు చేసిన కృషికిగాను 1997లో ‘భారతరత్న’ పురస్కారం లభించింది. 2013 లో అంతరిక్ష పథకానికి నాయకత్వం వహించి విజయవంతంగా పూర్తి చేసినందుకు అమెరికాకు చెందిన నేషనల్ స్పేస్ సొసైటీ నుంచి ప్రతిష్టాత్మక ‘వాన్‌బ్రాన్ అవార్డు’ను అందుకున్నారు.2015 జూలై 27న షిల్లాంగ్ ఐఐఎం విద్యార్ధులను ఉద్దేశించి ప్రసంగిస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి మరణించారు.
కలామ్ ఎంతో ఆదర్శప్రాయుడు. రాష్ట్రపతి హోదాలో వివిధ దేశాలలో పర్యటించిన సమయంలో వచ్చిన బహుమతులను దేశానికి రాగానే అర్కయివ్స్‌లో భద్రపరిచేవారు. 2002లో రంజాన్ ఇఫ్తార్ విందుకు బదులుగా పేదలకు బ్లాంకెట్లు, బట్టలు, ఆహారం పంపిణీ చేయాలని తన జేబు నుంచి లక్ష రూపాయలు ఇచ్చారు. బంధువులను రాష్ట్రపతిభవన్‌కు ఆహ్వానించి, వారందరికీ ఢిల్లీ చూపించారు. ఇందుకు అయిన ఖర్చును తన వ్యక్తిగత ఖాతా నుంచి చెల్లించారు. తన సోదరుడు వారం పాటు రాష్ట్రపతిభవన్‌లో ఉన్నందుకు అద్దె చెల్లించారు.
మానవతావాది
రాష్ట్రపతి భవన్ ఖాళీ చేసే ముందు ఉద్యోగులందరూ కుటుంబాలతో ఆయనను పలకరించారు. ఒక ఉద్యోగి భార్య అనారోగ్యంతో ఉన్నారని తెలిసి ఇంటికే వెళ్లి పరామర్శించారు. ఆయన ఆస్తి మూడు ప్యాంట్లు, ఆరు షర్టులు, మూడు సూట్లు, ఒక వీణ, ఒక చేతి గడియారం, 2,500 పుస్తకాలు, పురస్కారాలు మాత్రమే. బ్యాంకు బ్యాలెన్స్ 135 కోట్ల మంది భారతీయుల ప్రేమాభిమానాలు. కలామ్ అన్ని మతాలను సమానంగా గౌరవించేవారు. శాంతి కాముకుడు, మానవతావాది. ఆదర్శప్రాయుడు. విద్యార్థులు, యువత కోసం పరితపించిన కలామ్ సదా స్మరణీయుడు. అందుకే కలామ్ సాబ్‌కు సలామ్.
(నేడు ఏపీజే అబ్దుల్ కలామ్ జయంతి)
ఎండీ ఉస్మాన్‌ఖాన్
జర్నలిస్ట్, కాలమిస్ట్
99125 80645