నాడు-నేడు స్కూళ్లలో..నిరంతర పరిశీలన:ఉన్నతస్థాయి సమీక్షలో అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశం

WhatsApp Group         Join Now
Telegram Group Join Now
*📚✍️నాడు-నేడు స్కూళ్లలో..*
 *నిరంతర పరిశీలన✍️📚*
*♦️ఉన్నతస్థాయి సమీక్షలో అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశం*
*♦️పాఠశాలల్లో కల్పించిన సౌకర్యాలపై పరిశీలన అవసరమైన చోట్ల వెంటనే మరమ్మతులు..*
 *♦️నెలకోసారి తనిఖీ*
*♦️మెయింటెనెన్స్‌ ఫండ్‌తో సమర్థంగా స్కూళ్ల నిర్వహణ*
*♦️సమస్యలుంటే తెలియచేసే టోల్‌ఫ్రీ నంబర్‌ 14417తో బోర్డులు*
*♦️స్కూళ్ల నిర్వహణలో సచివాలయ ఉద్యోగుల భాగస్వామ్యం*
*♦️ప్రతి వారం సందర్శించనున్న సంక్షేమ, విద్యా అసిస్టెంట్, మహిళా పోలీసులు.. నెలకు ఒకసారి స్కూళ్లకు ఏఎన్‌ఎంల రాక*
*♦️టీచర్లు, 8వ తరగతి విద్యార్థుల కోసం 5,18,740 ట్యాబ్‌లు*
*♦️తొలిదశ స్కూళ్లలో మార్చి నాటికి తరగతి గదుల డిజిటలైజేషన్‌*
*♦️రూ.512 కోట్లతో స్మార్ట్‌ టీవీలు, ఇంటరాక్టివ్‌ టీవీల ఏర్పాటు*
*♦️మరింత నాణ్యంగా విద్యాకానుక బ్యాగులు*
*🌻సాక్షి, అమరావతి:* మన బడి నాడు-నేడు ద్వారా పనులు పూర్తైన పాఠశాలల్లో నిరంతరం ఆడిట్‌ నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. స్కూళ్లలో కల్పించిన సౌకర్యాలు బాగున్నాయా? లేదా? అన్నది పరిశీలన చేయాలని, అవసరమైన చోట వెంటనే పనులు, మరమ్మతులు చేపట్టాలని నిర్దేశించారు. నెలకు ఒకసారి తనిఖీ చేయాలని స్పష్టం చేశారు. స్కూళ్ల మెయింటెనెన్స్‌ ఫండ్‌ను వినియోగించుకుని నిర్వహణలో లోపాలు లేకుండా చూడాలన్నారు. పాఠశాలల్లో ఎలాంటి సమస్యలున్నా తెలియ చేసేందుకు వీలుగా ఏర్పాటైన టోల్‌ఫ్రీ నంబర్‌ను అందరికీ తెలిసేలా ప్రదర్శిస్తూ పాఠశాలల్లో డిస్‌ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దీనికి సంబంధించి 14417 టోల్‌ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు అధికారులు తెలిపారు.
పాఠశాల విద్య, నాడు-నేడు, విద్యాకానుక, బైజూస్‌ కంటెంట్‌తో ట్యాబ్‌ల పంపిణీ, తరగతి గదుల డిజిటలైజేషన్‌పై ముఖ్యమంత్రి జగన్‌ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. విద్యాకానుక కింద పిల్లలకు ఇచ్చే బ్యాగుల నాణ్యతను ఈ సందర్భంగా సీఎం స్వయంగా పరిశీలించారు. విద్యార్థులకు అందచేసే బ్యాగులు మరింత నాణ్యంగా, మన్నికగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నాడు – నేడు కింద పనులు పూర్తైన స్కూళ్లలో ఆడిట్‌కు సంబంధించిన వివరాలను అధికారులు అందచేశారు. స్కూళ్లలో సౌకర్యాలకు సంబంధించి గుర్తించిన సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
 *✍️సీఎం సమీక్షలో ముఖ్యాంశాలు ఇవీ..👇👇👇*
 
*♦️తల్లిదండ్రుల కమిటీలు క్రియాశీలకం*
స్కూళ్ల నిర్వహణలో తల్లిదండ్రుల కమిటీలను నిరంతరం క్రియాశీలకం చేయాలని ముఖ్యమంత్రి జగన్‌ సూచించారు. స్కూళ్ల అభివృద్ధి, నిర్వహణలపై తరచూ వారితో సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు.
*♦️ఎంఈవోలకు అకడమిక్, స్కూళ్ల నిర్వహణ బాధ్యతలు*
మండల విద్యాశాఖ అధికారుల్లో (ఎంఈవో) ఒకరికి అకడమిక్‌ వ్యవహారాలు, మరొకరికి స్కూళ్ల నిర్వహణ అంశాల బాధ్యతలను అప్పగించాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. స్కూళ్ల నిర్వహణలో సచివాలయ ఉద్యోగులు కూడా భాగస్వాములు కానున్నారు.
వెల్ఫేర్‌-ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్, మహిళా పోలీసు ప్రతివారం స్కూళ్లను సందర్శించనున్నారు. నెలకు ఒకసారి ఏఎన్‌ఎంలు సందర్శించనున్నారు. స్కూళ్ల నిర్వహణలో తమ దృష్టికి వచ్చిన అంశాలను ఫొటోలతో సహా సచివాలయ సిబ్బంది అప్‌లోడ్‌ చేయనున్నారు. అధికారులు వీటిపై వెంటనే తగిన చర్యలు తీసుకుంటారు. ఎవరెవరు ఏం చేయాలో నిర్దిష్టంగా ఎస్‌వోపీలు రూపొందించినట్లు అధికారులు తెలిపారు.
*♦️విలేజ్‌ క్లినిక్‌ పరిధిలోకి పారిశుద్ధ్యం, తాగునీటి నాణ్యత నిర్ధారణ*
గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీటి నాణ్యత నిర్ధారణను విలేజ్‌ క్లినిక్‌ పరిధిలోకి తేవాలని
సూచించినట్లు ముఖ్యమంత్రి జగన్‌ గుర్తు చేశారు. వీటిపై ఎప్పటికప్పుడు విలేజ్‌ క్లినిక్స్‌
పంపే నివేదికలను అనుసరించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. తద్వారా అంటువ్యాధులు, రోగాలను చాలావరకు నివారించేందుకు ఆస్కారం ఉంటుందన్నారు.
*♦️5,18,740 ట్యాబ్‌ల కొనుగోలు*
టీచర్లకు, 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీ కోసం తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రి జగన్‌ సమీక్షించారు. వీరి కోసం 5,18,740 ట్యాబ్‌లను ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. ట్యాబ్‌ల్లో 8వ తరగతి విద్యార్ధులు, టీచర్లకు బైజూస్‌ కంటెంట్‌ అప్‌లోడ్‌ చేసి ఇవ్వనున్నారు. ఏటా స్కూళ్లు తెరిచే నాటికి పిల్లల చేతికి విద్యాకానుక కచ్చితంగా అందాలని ఈ సందర్భంగా సీఎం స్పష్టం చేశారు. యూనిఫామ్స్‌ కుట్టు కూలీ డబ్బులను విద్యాకానుక ప్రారంభం రోజునే తల్లుల ఖాతాల్లో జమ చేయాలని ఆదేశించారు.
*♦️మార్చికి తొలి దశ తరగతి గదుల డిజిటలైజేషన్‌*
తరగతి గదుల డిజిటలైజేషన్‌లో భాగంగా స్మార్ట్‌ టీవీలు, ఇంటరాక్టివ్‌ టీవీలను సమకూర్చటంపై ముఖ్యమంత్రి జగన్‌ సమీక్షించారు. 72,481 స్మార్ట్‌ టీవీ యూనిట్లు అవసరమని అంచనా వేసినట్లు అధికారులు తెలిపారు. దశలవారీగా తరగతి గదుల్లో స్మార్ట్‌ టీవీలను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఇందుకు దాదాపు రూ.512 కోట్లకుపైగా వ్యయం కానుందని అంచనా. మనబడి నాడు – నేడు తొలిదశ పనులు పూర్తైన స్కూళ్లలో వచ్చే ఏడాది మార్చి నాటికి తరగతి గదుల డిజిటలైజేషన్‌ పూర్తి చేయాలని సీఎం జగన్‌ నిర్దేశించారు. అందుకు అనుగుణంగా నవంబర్‌లో టెండర్లు పిలవనున్నట్లు తెలిపారు.
*♦️అన్ని చోట్లా ఇంటర్నెట్‌*
అన్ని స్కూళ్లలో ఇంటర్నెట్‌ సదుపాయం ఉండేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. డిజిటల్‌ లైబ్రరీలతో సహా గ్రామ సచివాలయం, ఆర్బీకేలు, విలేజ్‌ క్లినిక్స్‌లో కూడా ఇంటర్నెట్‌ సదుపాయం అందుబాటులోకి తేవాలని సూచించారు. సమీక్షలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ సమీర్‌ శర్మ, పాఠశాల విద్యాశాఖ స్పెషల్‌ సీఎస్‌ బుడితి రాజశేఖర్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌.సురేష్‌ కుమార్, స్కూల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, ఇంటర్‌ విద్య కమిషనర్‌ ఎంవీ శేషగిరిబాబు, పాఠశాల విద్యాశాఖ సలహాదారు ఏ.మురళి తదితరులు పాల్గొన్నారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇

error: Content is protected !!