గురువులపై మరో పిడుగు
మళ్లీ రేషనలైజేషన్‌కు సన్నాహాలు
చైల్డ్ ఇన్ఫోడేటా ప్రకారమే ప్రక్రియ
పాఠశాలల విలీనంతో తగ్గిన విద్యార్థుల సంఖ్య
ఆందోళనలో ఉపాధ్యాయులు
(శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి)
ఉపాధ్యాయులపై మరోసారి హేతుబద్ధీకరణ(రేషనలైజేషన్) రూపంలో పిడుగు పడనుంది. ఇప్పటికే ఒకసారి హేతుబద్ధీకరణతో ఉమ్మడి జిల్లాలో మొత్తం అన్ని కేడర్లలో సుమారు 1,300 ఉపా ధ్యాయ పోస్టులు లేదా వేకెన్సీలు(పర్సన్స్ కాకుండా) పోతాయని అంచనా వేస్తున్నారు. మరోసారి హేతుబద్ధీకరణ చేపడితే.. మిగు లు ఉపాధ్యాయుల సంఖ్య పెరగడం ఖాయమని ఆందోళన చెం దుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నూతన విద్యావిధానం పేరిట ఈ ఏడాది ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో తరగతులను సమీ పంలోని ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసింది. దీంతో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చేర్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గడంతో ఈ ప్రభావం తమపై పడుతుందనే భయం ఉపాధ్యా యులను వెంటాడుతోంది. చైల్డ్‌ఇన్ఫో డేటా ప్రకారం హేతుబద్ధీకరణ చేపడతామని విద్యాశాఖ స్పష్టం చేసింది. జిల్లాలో అన్ని పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు, పేర్ల తొలగింపులతో ఈ నెల 28వ తేదీ నాటికి చైల్డ్‌ఇన్ఫోలో వివరాలు నవీకరణ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు వివ రాలు నమోదులో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు నిమగ్నమయ్యారు. సాంకేతిక సమస్యలు కారణంగా ప్రక్రియ పూర్తికాలేదు. దీంతో ఈ నెలాఖరు వరకు గడువు పెంచే అవకాశం ఉంది. కాగా ఇప్పటికే ఒకసారి పూర్తిచేసిన రేషనలైజేషన్‌ను ఈ ఏడాది మే 5వ తేదీ నాటి చైల్డ్‌ఇన్ఫో డేటా ప్రకారం జిల్లాలో పాఠశాలల వారీగా విద్యా ర్థులు, ఉపాధ్యాయుల సంఖ్య ఆధారంగా మిగులు(సర్‌ప్లస్) టీచర్ల సంఖ్యను తేల్చారు. అప్పట్లో ఉపాధ్యాయులు, విద్యార్థుల నిష్పత్తిని ప్రాథమిక పాఠశాలలకు 1:30గా, హైస్కూళ్లకు సెక్షన్ల సంఖ్య ఆధారంగా రేషనలైజేషన్ చేశారు. ఉపాధ్యాయ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేఖత రావడంతో జీవోకు సవరణలు చేశారు. తొలుత చేసిన రేషనలైజేషన్ లెక్కల ప్రకారం ఉమ్మడి జిల్లాలో ఎస్జీటీలు, స్కూల్ అసిస్టెంట్ కేడర్ ఉపాధ్యాయుల ఖాళీలు(వేకెన్సీలు) భారీ గా సర్‌ప్లస్ జాబితాలోకి వచ్చాయి. ఆ మేరకు ఈ ఖాళీలన్నీ డీఎస్పీ నియామకాల్లో హుళక్కే నని సర్వత్రా ఆందోళన వ్యక్త మైంది. తాజాగా విద్యార్థుల సం ఖ్య తగ్గుతున్న నేపథ్యంలో మరో సారి రేషన్‌లైజేషన్‌తో ప్రధానంగా చాలామంది ఎస్జీటీలు సర్‌ప్లస్‌లోకి వెళ్లిపోవడం ఖాయమని పలువురు భావిస్తున్నారు.
పెరగనున్న ఏకోపాధ్యాయ పాఠశాలలు
ఇటీవల సవరించిన రేషనలైజేషన్ ఉత్తర్వుల వల్ల ప్రాథమిక పాఠశాలల్లో 20 మంది విద్యార్థుల నమోదు దాటితే రెండో ఎస్జీటీ పోస్టునిచ్చేందుకు వెసులుబాటు వచ్చింది. దీంతో ఉపాధ్యాయులకు ఒకింత ఊరట కలిగింది. ఈలోగా పాఠశాలల విలీనం, దూరభారంగా ఉండటం, చాలాచోట్ల ప్రాథమిక పాఠశాలల్లో ప్రస్తుతం బాలబాలికల సంఖ్య 15 నుంచి 20 మందిలోపు మాత్రమే ఉన్నట్లు సమా చారం. ఈ పరిస్థితుల్లో రేషనలైజేషన్‌తో మరిన్ని ఉపాధ్యాయ పోస్టులు సర్‌ప్లస్‌లో చేరుతాయి. జిల్లాలో దాదాపు 30శాతం ప్రాథమిక పాఠశాలలు.. ఇక ఏకోపాధ్యాయ పాఠశాలలుగా ఉంటాయన్న ఆందోళన నెలకొంది. ఈ పరిస్థితుల్లో కొన్నిచోట్ల ఉపాధ్యాయులు.. తమ పోస్టులను కాపాడుకునేందుకు పాఠశా లలను వదిలి ప్రైవేటు పాఠశాలల్లో చేరేందుకు వెళతామన్న విద్యార్థులకు టీసీలు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నట్లు సమాచారం. మరోవైపు నిబంధనల ప్రకారం రికార్డు షీటు, టీసీలతో నిమిత్తం లేకుండా సంబంధిత విద్యార్థులను ప్రైవేటు పాఠశాలల్లో యాజమాన్యాలు చేర్చుకుంటున్నాయి. ఏదిఏమైనా చైల్డ్‌ఇన్ఫో పూర్తయిన తర్వాతే.. తాజా రేషనలైజేషన్‌లో సర్‌ప్లస్ ఉపాధ్యా యుల సంఖ్యపై స్పష్టత రానుంది.